పెద్దలమాట! అచ్యుతుని రాజ్యశ్రీ

 పెద్దలమాట చద్దిమూట అన్నారు. మొదట్లో మనకి వారి మాటనచ్చదు.వినం మొండి కేస్తాం.మనం పూర్తి గా  నాశనం అయ్యాక భోరుమని ఏడుస్తాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం!ఇప్పుడు జరుగుతున్నది అదే!రాజు లైనా  మంత్రి గురువు చెప్పింది విన్నారు. పాండవులు పెద్దలు చెప్పినది విని మంచి వారు గా పేరు పొందారు. దుర్యోధనుడు దురహంకారంతో గురువు తాత భీష్ముడు  కృష్ణ పరమాత్మ చెప్పింది వినక సర్వనాశనమై వంశంకి అప్రతిష్ఠతెచ్చాడు.
ఈజర్మనీ దేశపు కథకూడా అలాంటిదే! సముద్ర తీరంలో చేపలుపట్టేవారి బస్తీఉంది.ఓసారి వారికి  ఓ పండు ముసలితాత కనపడి పెద్దగా వారిని హెచ్చరించసాగాడు"అయ్యో! అటువెళ్లకండి.తుఫాను వస్తుంది. "ఆబెస్తలు అతనిని ఓ పిచ్చి వాడిగా భావించిసముద్రం దగ్గరకు వెళ్లి బుడుంగున మునిగి కొట్టుకుని పోయారు.ఆతాత సముద్రం ఒడ్డునే కూచుని ఉన్నాడు.నేను వద్దు అని చెప్పినా మీరు వినలేదు. చెప్పినంక వినకుంటే  చెడినాక చూడాలి అని సామెత. "అని మందలించి అక్కడే గుడిసె వేసుకుని ఉండసాగాడు. అతను చెప్పిన  ప్రతిమాటా నిజంకావటంతో అతనిపేరు  దశదిశలా మారుమోగింది.ఆప్రాంతరాజుకి ఓదురాలోచన వచ్చింది.ముసలితాత కి ఏవో దివ్య శక్తులు ఉండబట్టే అందరికీ నచ్చాడు.అతని సాయంతో తన శత్రురాజుపై పగతీర్చుకోవాలి అనుకున్నాడు.ఓనావికునివేషంలో వెళ్లి "తాతా! నాభవిష్యత్తునిగూర్చి చెప్తావా?"అని అడిగాడు. "నీబుద్ధి మంచిది కాదు. ప్రజాక్షేమం కోరవు" అంతే!రాజు కి కోపంవచ్చింది.యథార్ధవాది లోకవిరోధి అని సామెత. "తాతా!నీకు వాతావరణం ఋతువుల సమాచారం ఎలా తెలుసు?"తాత నవ్వుతూ అన్నాడు  "వాటిని నీవు చూడలేవు.నీకెందుకు?" రాజు కోపంతో "నిన్ను కారాగారంలో పడేస్తా"అని అరిచాడు. "నేను ఏమీ భయపడను.నీకు తెలుసుకోవాలని ఉంటే రాత్రికి నాదగ్గరకు రా! ఆమార్గంలో నడవటంకష్టం.తరువాత పశ్చాత్తాప పడుతావు" అని హెచ్చరిక చేశాడు. ఆరాత్రి సముద్రపునీరు తళతళ మెరుస్తున్నది.తాత తనగుడిసెలోంచి రెండు ఇనుపచువ్వలు తెచ్చి రాజు కి ఇచ్చి "వీటిని పట్టుకుని నావెనుక నడు" అన్నాడు. తనని ఏదో గుహలోకి తీసుకుని వెళ్తాడు అనే ఆలోచనలో ఉన్న రాజు  మెడదాకా నీరు వచ్చింది. తాత కనపడటంలేదు. నీటిలో మునిగిపోయాడు అని భావించాడు.ఇనుపకడ్డీల బరువు కి రాజు నీటిలో మునిగి పోతూ కెవ్ కెవ్ న కేకలు వేయసాగాడు.హఠాత్తుగా రాజు కి మెలుకువ వచ్చింది. ఓహ్!ఇది కలనా!?అదిగో తాతనవ్వుతున్నాడు.విరగబడి
పడీపడీ అట్టహాసంగా నవ్వు తుంటే ఆలోచనలో మునిగాడురాజు.సేనాపతినిపిలిచి " తాతను బంధించి తీసుకుని రా!"అని ఆజ్ఞాపించాడు. తాతదగ్గరకు వెళ్లిన సేనాని అతనిని బంధించబోతుంటే తప్పించుకుంటూ తిరిగాడు. సహనం కోల్పోయిన సేనాని తాత తలపై బలంగా బాదాడు.కింద పడిన తాతని గుర్రం వీపుకి కట్టేసి రాజు ముందు నిలిపాడు."తాతా!నీవింక చావుబతుకుల మధ్య ఉన్నావుకదా? ఆరహస్యం చెప్పు"  " సరే నేను స్నానం చేసి వచ్చి  ఆగుట్టు విప్పుతా" అని నదిలో ప్రవేశించి పెద్దగా నవ్వసాగాడు."నీవు నన్ను చంపాలని సముద్రం నించి దూరం గా తీసుకుని వెళ్లావు.దాన్ని విడిచి నేను ఉండలేను.నీవు ప్రజాక్షేమం కోరని రాజువి.రహస్యం తెలుసుకునే యోగ్యత నీకు లేదు సుమా!" తాత సముద్రంలో కి పోతున్నాడు.అతనిని వెంబడిస్తూనే రాజు నీటిలో మునిగి ప్రాణాలు వదిలాడు.ఆతరువాత ఆతాతని ఎవరూ చూడలేదు. రకరకాల కథలు మాత్రం  ప్రచారంలోకి వచ్చాయి. 🌹
కామెంట్‌లు