అవ్వారి ఉమాభార్గవితో .ముఖాముఖి ప్రశ్నావళి ; సునీత నెల్లుట్ల
 ప్రశ్న:  పరిచయ హృదయావిష్కరణ చేయగోర్తాము.
జ: నా పేరు అవ్వారి ఉమాభార్గవి.
నా భర్త పేరు అవ్వారి రాజశేఖర్.
నాకు ఇద్దరు కుమారులు
పెద్దబాబు పేరు అవ్వారి నవీన్ కుమార్
చినబాబు పేరు అవ్వారి హృదయరాజ్ కుమార్
ప్రశ్న: మన సాహితి బృందావన జాతీయ వేదిక ఆత్మీయ  సభ్యులకోసం మీ గురించి నాలుగు మాటలు... 
మీ మాటల్లో .. 
జ: "సాహితీ బృందావన జాతీయ వేదిక ఎందరో కవుల, కవయిత్రుల సృజనాత్మకతను వెలికితీసి వారిని సమాజంలో ఒక స్థాయిలో ఉంచడానికి 
దోహదపడే అద్భుత సాహిత్య సూచిక" నా గురించి చెప్పాలంటే కుటుంబవ్యవస్థను గౌరవిస్తూ,సాటి మనిషిలో దైవాన్ని చూస్తూ ఈ క్షణం మాత్రమే నాది అనుకుంటూ ఎక్కువ ఆశలు లేని మనిషిని..!!
ప్రశ్న: మీ పేరు, తల్లిదండ్రులు, స్వస్థలం, కుటుంబ నేపద్యం ఇతర వివరాలు 
జ: నా పేరు అవ్వారి ఉమాభార్గవి.
నా తల్లి తండ్రులు శ్రీ నారాయణ గారు,శ్రీమతి కర్ణమ్మ గార్ల ఏకైక పుత్రికను.
స్వస్థలం తెలంగాణా లోని సూర్యాపేట జిల్లా
మాది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం
నేను చిన్నతనంలోనే పోలియోకి గురయ్యాను
మా ఇంట్లో నేను,అన్నయ్య మాత్రమే.
అన్నయ్యకు ఇరువై సంవత్సరాల వయసులో నేను జన్మించాను మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వలన చిన్న చిన్న ఆనందాలను తోబుట్టువుల ప్రేమను కోల్పోయాను కానీ అన్నయ్య నన్ను అరచేతిలో పువ్వులా నాజూగ్గా చూసుకున్నారు.
నాన్నగారు బట్టల దుకాణం నడుపుతుండేవారు
అన్నయ్య డాక్టర్.

ప్రశ్న:  మీ విద్యాబ్యాసం ఎక్కడ జరిగింది.
ఎలా సాగింది. 
జ: నా విద్యాభ్యాసం సూర్యాపేట లోని సరస్వతి విధ్యా నిలయంలో పదవతరగతి వరకు తర్వాత మహిళా పాలిటెక్నిక్ సూర్యాపేట నందు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగంలో పి.జి.డి.సి. ఏ పూర్తిచేసి వివాహమైన పిదప దూరవిద్యలో బీ.కామ్ డిగ్రీ చేశాను.
ప్రశ్న:  మీ బాల్య స్మృతులు నెమరు వేస్తారా? 
జ: నా బాల్యం అద్భుతమైన ఊహాలతో, అందమైన జ్ఞాపకాలతో గడిచింది.
దివ్యంగినైన నన్ను ఎవరు కించిత్తు మాట అనకుండా చక్కగా చూసుకున్నారు.
ఎన్నో ఆటలు ఆడాను
నా స్మృతుల లోగిళ్ళలో రంగవల్లులు వేస్తూ నాతో ఆడుకుని,నన్ను వారిలో చేర్చుకున్న ప్రతి స్నేహహస్తానికి  నేనెప్పుడూ రుణగ్రస్తురాలినే
ప్రశ్న:మీ వృత్తి  ఏమిటి ..  ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
జ: నేను ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పని చేసి ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వలన గృహిణిగా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను 
ప్రశ్న: కుటుంబం అంటే ఎలా ఉండాలి....
జ: కుటుంబంలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం,భరోసా 
ఏ విషయాన్నైనా కుటుంబసభ్యులందరు కూర్చుని కూలంకుశంగా మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలి ..
ఒకరిపట్ల ఒకరికి నిజాయితీతో నిండిన ప్రేమ కలిగి జీవించాలి 
ప్రశ్న:  మీ ప్రవృత్తి ఏంటి? 
జ: నా ప్రవృత్తి రచనా వ్యాసంగం..సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ.
ప్రశ్న: మీ అభిరుచులు ఏంటి ? 
జ: నాకు పాటలు వినడం ఇష్టం,కామెడీ అంటే ఇష్టం,అప్పుడప్పుడు ఏవో కొన్ని బొమ్మలు వేస్తాను అంత నిష్ణాతురాలిని మాత్రం కాదు.
నవలలు చదువుతాను నాట్యమంటే ఇష్టం కానీ చేయలేనుగా😢
 ప్రశ్న: మీరు ఎన్నుకొన్న  వృత్తి, ప్రవృత్తి ఇప్పుడు ఎలా ఉంది. 
జ: నాలో ఒక గుణముంది అనుకున్న పనిని అనుకున్న సమయంలో చేసి తీరతాను..
దానివలన వృత్తిలో ,ప్రవృత్తిలో కూడా రాణించగలిగాను అందరి మన్ననలు పొందగలిగాను
ప్రశ్న: మీరు వృత్తిలో ప్రవృత్తిలో ఏలా ప్రవేశించారు? ఎప్పటి నుంచి ఎన్ని కొనసాగుతున్నారు? 
జ: నేను నల్లగొండ జిల్లాలోని క్యాడ్ క్యాట్ ఇనిస్టిట్యూట్ నందు ఇన్స్ట్రక్టర్ గా చేస్తూనే వివాహం జరగడంతో హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ లో విజయా పబ్లిక్  మరియు సూర్యాపేట జె.ఆర్.ఆర్.గ్రామర్ స్కూల్ నందు గణిత ఉపాధ్యాయురాలిగా 13 సంవత్సరాలు పని చేసి కొన్ని అనివార్య కారణాల వలన మానేశాను 
ప్రశ్న: మీ వృత్తి, ప్రవృత్తిలో అనుభవాలు ఏమిటీ ? 
జ: ఎన్నో రకాల మనుషులు,మనస్తత్వాలు వృత్తిలోనైనా,ప్రవృత్తిలోనైనా సహజమే వారితో మనం ఎలా ఉంటున్నాం,వారినుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం మనల్ని మనం ఎలా సరిచేసుకుంటున్నాం అనేదే నాకు ముఖ్యం మిగతా వాటి గురించి నేను ఎక్కువగా పట్టించుకోను.. నా మనసులో ఉంచుకోను
ప్రశ్న: మీ జీవితంలో చేదు అనుభవాలు వున్నాయా? 
 జ: ఉన్నాయండి..!
ప్రతీ మనిషికి ఉంటాయి..
ప్రశ్న: ఎలాంటివి చవి చూశారు? 
జ: నన్ను ఎంతగానో ప్రేమించి కంటికి రెప్పలా చేసుకున్న అమ్మ,అన్నయ్య మరణాలు నాలో పెద్ద విస్ఫోటనాన్నే కలిగించాయి.. తప్పదు కదా మరల మరుపు సహజం..అది దేవుడు మనిషికి ఇచ్చిన వరం
ప్రశ్న:  మీ అంతరంగం లో మెదిలిన సందేశాలు, సలహాలు ఏమిటి..
జ: నాలో ఎన్నో భావాలు సంద్రంలోని అలల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుతూనే ఉంటాయి..
ఏదైనా విపత్తు సంభవించినప్పుడు,ఒకరిపట్ల ఒకరు దూషణతో మెలిగినప్పుడు,దేశ వ్యవస్థ మార్పుకై ..ఇలా కొన్ని నాలో ఎగిసిపడిన తరంగాలై తపన చెందుతాయి అంతే.
ఇక సలహాలంటారా ..
ఇది సలహా కాదేమో ఒక చిన్న అర్ధింపు మాత్రమే..!!
తోటిమనిషికి ఎంతో కొంత సాయం చేయక ఎంత సంపాందించి ఏమి లాభం..??
నేను అన్నార్తులను ఆదుకుని,బీదవారిని కరుణించాలని అంటాను
ప్రశ్న: మీరు ఈ సమాజంలో అనేక రకాల మనుషులు  వుంటారు కదా!. 
వారి మనస్తత్వంలను మీరెప్పుడయినా గమనించారా? 
జ: గమనించాను 
ప్రశ్న: వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అలాంటి వారి గురించి?
జ:  తప్పకుండా విభిన్న మనుషుల సమాహారమే సమాజం చేతికున్న అన్ని వేళ్ళు సమానంగా ఉండవు మరి ఎక్కడెక్కడో పుట్టిన వారి మనోభావాలు ఎలా కలుస్తాయి..
వారినందరిని గమనిస్తాను.. వీలైతే వారికి చెప్పి చూస్తాను..లేదంటే నేను నా దారిలో వెళ్లిపోతాను
ప్రశ్న: మీకు ఏఏ రంగాలలో ప్రవేశం ఉంది?
జ: కేవలం సాహిత్యరంగంలో మాత్రమే
ప్రశ్న: మీకు సామాజిక, సాహిత్యం రంగాలపై మీకు అభిరుచి ఎలా ఏర్పడింది?
జ: తెలియదు కాని నా చిన్నప్పటినుండి నాలో అక్షరాన్ని అందంగా మలచాలనే జిజ్ఞాస ఎక్కువ.
ప్రశ్న: కవిత్వం అంటే మీదృష్టిలో నిర్వచనం ఏవిధంగా చెపుతారు?
 
జ: మేధస్సును మధించి కలంతో దున్ని అక్షరాలను విత్తితే మొలకెత్తిన అద్భుత ఆవిష్కరణమే కవిత్వం

 ప్రశ్న: మీరు రాసిన, మీకు నచ్చిన కవిత ఒకటి చెప్పండి...
జ:  "తన పిల్లల్లో ఎవరు ఇష్టం అంటే ఏ తల్లి చెప్పలేదు..నేను ప్రాణం పోశాను కాబట్టి ప్రతి ఒక్క రచన నా బిడ్డ లాంటిదే"
మచ్చుకి కొన్ని:
నా ఊహల స్వప్నసౌధంలో
తడిపెదవుల అంచున దాగిన
చిరునవ్వును చీల్చుకుని
నీ పేరు పలవరిస్తుంటే
ఆనందం సాక్షిగా నిలిచింది
మదికవాటపు వేదికపై 
జ్ఞాపకాల పుష్పాలతో
నీ పలుకుల మాలనలంకరించి
తన్మయత్వపు గుచ్ఛంతో
నీ రూపాన్ని ఆవిష్కరిస్తున్నవేళ
నక్షత్రపుకెంపులా మనసు మెరిసింది
మాటలు లేక మౌనంగా
నా అడుగులు పడుతున్నా
వెలకట్టలేని మౌనంలో
అర్థవంతమైన అక్షరాలెన్నో
ఎగిసిపడుతున్న భావతరంగాలై
నీ చూపుల చిక్కుకుని
చిత్రంగా నన్నల్లుకుని
అద్భుతానుభూతినిచ్చింది...!!
*********
శీర్షిక: "నేను..."
****
నీ దృష్టిలో నేను
దాసీనే కావొచ్చు
వేరొకరి దృష్టిలో
రాణినే...!
కోపంతో నేను
జతకట్టలేను
మాటల్లో నేను
పొదుపు సుమా....!
బంధాలు బంధువులు
బరువేమి కాదు
ప్రేమకి నేనెప్పుడూ
బానిసనే....!
సాయం చేయడం 
తెలిసిన నాకు
సాయం పొందడమే
తెలియట్లేదు....!
తప్పొప్పులు ఎన్నగా
నా తరమా
తప్పు చేయని
మనిషెక్కడున్నాడు...!!
*********
*అంశం: ' ఝాన్సీ లక్ష్మిభాయి వీర పరాక్రమం"
తల్లితండ్రుల ఇంట మణికర్ణికగా
అత్తగారింట ఝాన్సీలక్ష్మి  నామధేయంగా
ధైర్యసాహాసాలకు ఆమె ప్రతిరూపంగా
చూడచక్కని తెలుగు సున్నితంబు!
   
ఆంగ్లేయల నెదిరించే అపరకాళికయై
అశ్వమును అధిరోహించే రాణియై
కత్తిని ఝళిపించే వీరనారీమణియై
చూడచక్కని తెలుగు సున్నితంబు!
స్వతంత్రార్జనలో ప్రముఖపాత్ర పోషించి
మహిళలతో  సైన్యాన్ని  బలపరిచి
పోరాటంలో వీరవనితగా రాణించి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
   
పిన్న వయసులో వైధవ్యప్రాప్తం
అయినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
చూడచక్కని తెలుగు సున్నితంబు!
 
దత్తత కుమారుడు దామోదరుడితో
ప్రాణభీతిలేక పోరాట పటిమతో
ఆంగ్లేయులకు వణుకుపుట్టించే ధైర్యంతో
చూడచక్కని తెలుగు సున్నితంబు
***********
 కవిత శీర్షిక :అక్షరమే ఆయుధమై 
..............................................
ఆటల పాటలతో చదవగ
నేనంత అదృష్టం చేసుకోలేదులే
దారిద్ర్యం మాచెంతన ఉన్నా....
ప్రేమాభిమానాలకు లోటులేదులే
ఆడపిల్లలకు చదువులెందుకని
బంధువులంతా పొరుపెట్టగా
అమ్మ,నాన్న లక్ష్యపెట్టక
కష్టమెంతైనా మేమనుభవిస్తాము
నట్టింట తిరిగేటి మాలక్ష్మి
చదువులతల్లి కృపను పొందమని
నన్ను బడికిపంపి ఆశీర్వదించారు..
ఒక్కపూట తిన్నారో..రెండో పూట పస్తున్నారో
నా ఆకలి తీర్చి తృప్తి పొందుతున్నారు
ఉడతాభక్తితో ఇంతసేవ చేస్తూ
నా తల్లిదండ్రులకు అండనౌతానులే
పుస్తకాల బరువు మోస్తూనే ఉన్నా
కట్టెలబరువు మోయగలేనా...
అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని
జీవిత పోరాటంలో విజయాన్ని సాధించి..
నా వారి కళ్లల్లో కాంతినింపుతాను
ఆడపిల్లల చిన్నచూపు చూసిన సమాజానికి 
అంబరాన్ని తాకిన నక్షత్రమై కనిపిస్తా...
స్వశక్తిని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగి
వీరవనితగా కీర్తికెక్కుతా
"చదువే ఆడపిల్లకు రక్ష"నే నినాదంతో
సంఘాన్ని సంస్కరిస్తా...!!
 **********
ప్రశ్న: ఎలాంటి కవిత్వం మీరు ఇష్ట పడుతారు ? 
జ: నేను ఎక్కువగా వాస్తవానికి దగ్గరగా ఉండే కవిత్వాన్ని మనుషుల్లో మార్పు తెచ్చే కవిత్వాలను ఇష్టపడతాను 
ప్రశ్న:  కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు ?
జ: నా పదమూడో  సంవత్సరం నుండి రాస్తున్నాను*
ప్రశ్న: ఏఏ సాహితీ ప్రక్రియలు యందు తమకు అవగాహన, అనుభవం వుంది? 
జ: సున్నితాలు,నానీలు కథలు,కథానికలు, నవలలు ఇలా కొన్ని...
ప్రశ్న:  రాసిన ఏఏ రచనలు పుస్తక ప్రచురణలు నోచుకొన్నాయి?
జ: ఇంతవరకు నేను ముద్రణకు ఇవ్వలేదు 
ప్రశ్న: మొదటి పుస్తకం ఏది? 
జ: .........లేదు
ప్రశ్న: మీ రచనలు యెక్కడెక్కడ ప్రచురణ అయ్యాయి?
 
ప్రశ్న: శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారి కవితా సంకలనంలో శ్రీశ్రీ గారి గురించిన కవిత..
తరుణం దినపత్రికలో 30 కవితల దాకా ప్రచురితమయ్యాయి.
ప్రశ్న: బహుమతులు, అవార్డులు వేటికి లభించాయి. 
జ: సాహిత్య కళానిధి.
అబ్దుల్ కలాం యూత్ ఎక్స్ లెన్స్
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్
విజ్ఞాన జ్యోతి
ప్రశ్న: మహిళలకు స్వాతంత్ర్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత వరకు అవసరం? 
జ: మహిళలకు స్వాతంత్య్రం తప్పకుండా ఉండాలి కానీ,దానిని దుర్వినియోగం చేయకుండా ఉండాలి..
ఆర్ధిక స్వాతంత్య్రం తప్పకుండా అవసరం కానీ 
ఎదుటివారి కోసం గొప్పలు పోకూడదు
ప్రశ్న:  ఇప్పుడు మహిళలకు స్వేచ్చ వుందా? 
జ: కొందరికి ఉంది,కొందరికి లేదు మరికొందరికి అతి ఎక్కువగా ఉంది 
ప్రశ్న: ఎలాంటి స్వేచ్చ కావాలి? 
జ: ఆర్ధికంగా కొంతఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉండాలి..
అంతేకాని బంధాలను వేరుచేసేంత స్వేచ్చ ఉండకూడదు
 ప్రశ్న: ,ప్రేమ, పెళ్లి సంస్కృతి, సంప్రదాయాలపై మీ అభిప్రాయం? 
జ: ప్రేమ స్వవిషయం కానీ పెళ్లి ఇరు కుటుంబాలకు సంబంధించినది కనుక మరీ పాశ్చాత్య పోకడలు పోకుండా అలా అని పిచ్చి మూఢనమ్మకాలు లేని సనాతన సంప్రదాయం అవసరం అంటాను 
ప్రశ్న:  ప్రస్తుత వ్యవస్థలో టీవీలు, సినిమాలు, మీడియా, మొబైళ్ళ వల్ల  పిల్లలపై ఏలాంటి ప్రభావం వుంది ?
 జ: చాలా ఉంది..ముందు ఇంట్లో పెద్దలు మారాలి..అప్పుడే పిల్లల్లో మార్పు వస్తుంది..అతి గారభం కూడా ఒక కారణమే అంటాను నేను 
ప్రశ్న:  పసి వయస్సు ఆడ పిల్లల వయసు పైబడిన ముసలవ్వ దాకా పైశాచికంగా మృగాల అత్యాచారాలపై మీ స్పందన తెలపండి? 
జ: దీని గురించి నేను ఎన్నో కవితలు రాశాను..
మార్పు రావాలంటే  ఇంటినుండే ప్రారంభమవ్వాలి తల్లిదండ్రులు,  పరిస్థితులు, స్నేహితులతో ముడిపడి ఉందని నా అభిప్రాయం

ప్రశ్న:  ఈ ఆధునిక కాలంలో ఎలాంటి మార్పులు కోరుకొంటున్నారు? 
జ:స్వేచ్ఛ అవసరమే కానీ మితిమీరిన స్వేచ్ఛతో యువతరం పెడదారి పడుతుంది 
ప్రశ్న:  మార్పులు రావాలంటే ఏం చేయాలి? 
జ: ముందు మనలోంచే,మన ఇంటినుంచే మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి సామాజిక ఆర్ధిక స్థితిని సైతం మార్చగలగాలి 
ప్రశ్న:  కొత్తగా సాహితీ బృందావన జాతీయ వేదిక   నిర్వహించే ముఖాముఖిపై మీ అభిప్రాయం ఏమిటీ? 
జ: వారి కృషి అనిర్వచనీయం, వారు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఎన్నో రచనలను ప్రోత్సాహిస్తున్న తీరు ప్రశంసనీయం..
వారికి నా అభినందనలు*
 ప్రశ్న: ఈ ముఖాముఖిలో మీరు ఎలాంటి అనుభూతి పొందారు? 

జ:  చాలా ఆనందంగా ఉంది..
నాలో నిక్షిప్తమై ఉన్న భావాలను మళ్ళీ ఒకసారి నెమరువేసుకున్నాను..
ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..!!*
ధన్యవాదాలు🙏

కామెంట్‌లు