పరశురాముడు .;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 పట్టువదలని విక్రమార్కుడు శవంలోని బేతాళుని భంధించి భుజంపైన వేసుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా సకల శాస్త్రపారంగతుడవైన నీవు నాకు పరశురాముని గురించి తెలియజేయాలి.తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు 'అన్నాడు.
' బేతాళా పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడు.
తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.
" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.
అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది.
బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.
" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి.
ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది. 
 కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.
 జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు.వినిపించనట్లు పరశురాముడు ఉండిపోయాడు.
"పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.
 పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు. జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు.
అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
 పరశురాముడు సందేహించకుండా,
"నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు. జమదగ్ని కోపగించుకోలేదు.
"తథాస్తు" అన్నాడు.
పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు.
కార్తవీర్యార్జునుడు, హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి ఆవును మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి భోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి.
పరశురాముడు మాట్లాడలేదు. గొడ్డలి చేత పట్టుకున్నాడు.  పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు.
మాహీష్మతీపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదకి వెదకి గర్భాలలొ వున్న పిండాలతో సహా క్షత్రియులందర్నీ నాశనం చేశాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం.
తరువాత అశ్వమేధయాగం చేసి ఆ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు.
అప్పటినుండి భూమికి 'కశ్యపి' అనే పేరు వచ్చింది.
"భూమిని నాకిచ్చేశావు. ఇంక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్రతీరానికి వెళ్ళు" అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలు ఏమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్ధేశంతో ఆయన అలా ఆదేశించాడు. (ఇక్కడ దశరథుడు ఆలమందల మధ్యలో దాగుకుని పరశురాముడి బారినుండి తప్పించుకుంటాడట. ఇలా కొద్దో గొప్పో ఎవరైనామిగిలితే వారి పనీ పట్టే దానికి తిరిగి రావాలనే) సరేనన్నాడు పరశురాముడు. 
దక్షిణ సముద్రానికి వెళ్ళిన పరశురాముడికి సముద్రుడు తనకు చోటు ఇవ్వడట .. అందుకై కోపించిన పరశురాముడు తన గండ్రగొడ్డలి సముద్రుడిపై విసురుతాడట.. అప్పుడు భయపడిన సముద్రుడు కొంత భూభాగాన్ని అతనికి కేటాయిస్తాడు ,రామావతారంలో శ్రీరామునితో పోరాడబోయి అవతారపురుషుని ఆనతిమేరకు హిమాలయాలలోతపస్సుకై వెళ్ళిపోయాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో,శవంతోసహా బేతాళుడు మాయమై తిరిగి చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు .

కామెంట్‌లు