నిన్న..నేడు.. రేపు;-లావణ్య గణేష్;-కలం స్నేహం :
 నిన్న
గుడి లాంటి బడిలో 
విద్యార్థుల మది క్షేత్రాల్లో
విజ్ఞాన బీజాలు మొలకలై చిగురిస్తున్న వేళ
నీతి భాషణముల నీటిని పోసి
సంస్కృతి సంప్రదాయముల ఎరువునందిస్తే
మాతృభాషా పరిమళాలందించే పుష్పాలుగా వికసించి 
విజ్ఞాన శాస్త్ర శాఖలుగా విస్తరించి
ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించిన వైనం 
నేడు
పద పద మంటూ అడుగులు వేసే
పాదాలు ముందుకు సాగడం లేదు
ఝరీవేగతుల్యమై ఉత్సాహంతో ఉరకలు వేసే మది నది నేడు నిశ్చల తటాకమైపోయింది
పెదవి కొమ్మకు నిత్యం విచ్చుకొనే చిరునవ్వు ఈనాడు వికసించలేదు
ప్రతిదినం సప్త స్వరాలు పాడే మది వీణ అపశృతులు పాడుతోంది 
పిల్లలతో కూడి నూతనోత్సాహంతో గొంతెత్తి పద్యాలాపన చేసే గళము తడబడుతోంది..
కేరింతల చెమరింతలతో ఆటలాడే ఛాత్రుల అంబరాన్నంటిన సంబరాల్లో పాల్గొనలేకపోతోంది 
ఆలోచనా సుడిగుండాల్లో చిక్కుకున్న హృదయం విద్యార్థుల మృదు మధురమైన పిలుపులను వినలేక అవస్థపడుతోంది 
ఎందుకంటే రేపు
నవ్యపథంలో పయనించి నూతన విద్యాలయంలో ప్రవేశమవ్వాలి 
ఓ క్షణం ఆనందం కొత్త శిష్యుల్లో
శ్రవణకుమారులుండవచ్చని,అబ్దుల్ కలాం లు తయారవ్వచ్చని..
మరోక్షణం విచారం నా అనుకున్న పిల్లలు దూరమైతున్నారని
అభివృద్ధి సౌధనిర్మాణం ఆగిపోతోందని 
ఒకసారి ఉద్వేగం క్రొంగొత్త స్నేహితులు పరిచయమౌతారని..
ఒకతూరి నిర్లిప్తం మంచి మిత్రులు దూరమౌతున్నారని..
ఏది ఏమైనా కర్తవ్య నిర్వహణలో బదిలీలు సహజమని 
ఎక్కడ ఉన్నా ఎచ్చోట విధులు నిర్వర్తించినా ఆత్మనిగ్రహం కోల్పోకూడదని దృఢపరచుకొన్న చిత్తముతో ముందడుగు వేస్తా

కామెంట్‌లు