గీతాంజలి ; రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 51. ఖడ్గ మహాభరణం ప్రతి జీవిని అంటిపెట్టుకుని వుండే మృత్యువు. స్నేహితుడిని మనకు తోడుగా ఇచ్చి మృత్యువు ద్వారా జీవాత్మలను పరమాత్మ తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ భావనను వివరించే ఖండిక." ఖడ్గ మహాభరణం". నీ మెడను అలంకరించిన గులాబీమాలను నాకు దయచేయమని అడగాలనుకొన్నాను. పూనిక చేయలేక ఉదయ పొద్దు వరకు వేచియున్నాను. పక్కమీద రాలిన గులాబీరేకులైనా ఏరుకునేందుకు బిచ్చగత్తెవలె దేవులాడుకున్నాను. నీ నిష్క్రమణానంతరం ఆశ్చర్యం.... నీ ప్రేమకానుకగా నాకు వదిలి వెళ్ళిందేమిటో తెలుసా? పుష్పం కాదు, సుగంధాలు కావు, పన్నీటి పాత్ర కాదు, 'మహాగ్నికీలల్లా మెరుపుల మిరుమిట్లు గొలిపే శక్తిపూరిత “మహాఖడ్గం”. ఆ గది కిటికీ గుండా ఉదయపు నీరెండ నీ పక్కమీద పరుచుకోగా ఉదయవిహంగం “తరుణీ నీకేమి లభించింది? అంటూ కిచకిచలు చేస్తుంది. పుష్పం కాదు, సుగంధాలు కావు, పన్నీటి పాత్రలు కావు, భయానక "ఖడ్గం"!. ఈ బహుమానం నాకేమిటి? అంటూ విస్తుపోయి కూర్చున్నాను. అబలను, ఖడ్గాన్ని ధరించాలంటే దాచలేని బిడియం. బలమైన వాంఛతో గుండెలకు హత్తుకుందామంటే గాయమై నొప్పెడుతుందని భయం. అయినా నీ ప్రసాదితమైన ఈ బాధాభారాన్ని నా హృదయంలో పదిలపరుస్తాను.
ఇక ఈ లోకంలో నాకెలాంటి భయంలేదు. నా ప్రతి సంఘర్షణలో నీకు విజయమే. నా సహచరునిగా మృత్యువునే నాకు స్నేహితునిగా వదిలివెళ్ళావు. ఇకపై నా జీవితానికి అతడు అభిషిక్తుడు. నా భవబంధాల ఛేదనకే గాక నీ ఖడ్గం వల్లనే నేను నిర్భయను. 
ఈనాటి నుంచి అల్పమైన ఈ అలంకారాల నన్నింటినీ త్యజిస్తాను. ఇకపై నేను నిరీక్షణలు, విలాపాలు, మధుర ముగ్ధత్వాలకు వీడ్కోలు పలుకుతున్నాను. మహాభరణంగా ఈ ఖడ్గం ఉండగా బొమ్మలకొలువు అలంకారాలతో నాకిక పనిలేదు.

కామెంట్‌లు