నిజం; -- తమిళంలో వచ్చిన ఓ అనువాద పుస్తకంలో చదివానిది - జగదీశ్ యామిజాల
 నిజం అనేది చాలా వరకూ మనమనుకున్నట్టు ఉండదు. అది మనం తీసుకునే నిర్ణయంలోనే ఉంటుంది. వాస్తవానికి అది నిజం కావచ్చు. కాకపోవచ్చు.
ఓ విమాన ప్రయాణంలో యూదులైన ఓ నడివయస్కురాలు స్వీడన్ దేశానికి చెందిన ఒకరు పక్క పక్క సీట్లలో కూర్చున్నారు.
ఆ స్త్రీ మాటిమాటికీ తన పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి మధ్య మధ్యలో 
ఓ నవ్వు నవ్వేది. 
ఇలా కాస్సేప్పయ్యాక ఆమె ఆ వ్యక్తిని "మీరు యూదులేనా?" అని అడిగింది.
"కాదు" అన్నాడతను.
కొన్ని నిముషాల తర్వాత ఆమె మళ్ళీ అతని వంక చూసి అడిగింది "మీకు తెలుసు మీరు యూదులేనని. మీరు యూదులే కదండీ".
"కచ్చితంగా చెప్తున్నా నేను మీరనుకున్నట్టు కాదు" అన్నాడతను.
మళ్ళా కొన్ని నిముషాల తర్వాత ఆ మనిషిని చూసి "మీరు యూదులేనని నాకు తెలుసండి" అన్నాది.
ఆమె నసకు తెర దించాలనుకున్న అతను "సరే ...సరే....నేను యూదుడినే.... మీరనుకుంటున్నట్టు" అని విసుగుని కనీకనిపించక చెప్పాడు.
అప్పుడామె అతని వంక కింది నుంచి పైదాకా చూసి "హూ హూం..." అని తల అడ్డంగా తిప్పుతూ "మీరు యూదులు కానే కాదండీ" అంది.
మనం మొదట్లో ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. తర్వాత ఆ అభిప్రాయాన్ని నిజం చేసుకోవడానికి దారులు వెతుక్కుంటాం.

కామెంట్‌లు