జింక ప్రేమ (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు

     ఆ అడవిలో పెద్దపులి అన్ని జీవులతో స్నేహం చేస్తూ వాటి సమస్యలను తీరుస్తుంది. దుష్ట స్వభావం ఉన్న జీవులనే ఆహారంగా తీసుకుంటూ అవి దొరకనప్పుడు శాకాహారం మాత్రమే తినేది. పెద్దపులి అంటే అన్ని ప్రాణులకూ ప్రాణం. అయితే ఆ పెద్దపులికి జింక అంటే పంచప్రాణాలు. వాటి స్నేహం నక్కకు ఈర్ష్యను పెంచింది. తరచూ జింకపై పెద్దపులికి చాడీలు చెప్పడం చేసేది. పులి నమ్ముతున్నట్లు నటిస్తుంది కానీ జింకతో స్నేహాన్ని వదులుకోలేదు.
         ఈసారి పెద్దపులి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని నిశ్చయించుకుంది. అడవి జీవులు అన్నింటినీ తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించింది. చాలా జంతువులు వచ్చాయి. అన్నింటికీ విందు ఇచ్చింది. జింక ఆ వేడుకలకు రాలేదు. అప్పుడు నక్క"చూశారా! వ్యాఘ్రరాజమా! మీ ప్రాణ స్నేహితులు అని చెప్పుకునే జింక గారికి మీ పుట్టినరోజు గుర్తుకు లేదు. మీ పుట్టినరోజునే మరచిపోయేంత పెద్ద పని జింక గారికి ఏమి తగిలిందో!" అన్నది. పెద్దపులి ఆలోచనలో పడింది. 
       మరునాడు తన వద్దకు వచ్చిన జింకతో పులి తన పుట్టినరోజుకు రాని కారణం అడుగుతుంది. అప్పుడు జింక పక్కనే ఉన్న గజరాజు ఇలా అంది. "మీ పుట్టినరోజు వేడుకలకు అందరూ రాలేరుగా. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఇంకా రకరకాల కారణాలతో రాలేని వారు ఉంటారు. వారందరి గురించి జింక ఆలోచించింది. నిన్న వాళ్ళందరి నివాస ప్రాంతాలకు జింక నా సహాయం తీసుకొని వెళ్ళి అక్కడే తాను విందు ఏర్పాటు చేసింది. ఈ పనికి నక్కను కూడా సహాయం అడిగింది. కానీ నక్క "నువ్వు ఇచ్చే విందులో ఏమి ప్రత్యేకత ఉంటుంది? పులిరాజు స్వయంగా ఇచ్చే విందులో ప్రత్యేకత ఉంటుంది." అన్నది. మీ పుట్టినరోజున అన్ని జీవులూ సంతోషంగా ఉండాలని జింక నా సహాయంతో ఇలా చేసింది." అని. పులి జింకను ఆకాశానికి ఎత్తింది. నక్క అక్కడ నుంచి మెల్లగా జారుకుంది. పులి నక్కను పట్టించుకోవడం మానేసింది.

కామెంట్‌లు