కాంతి కిరణం;-కాకరపర్తి పద్మజ;-కలం స్నేహం
అక్షరాల ఒడిలో పాపాయిని
పదాల బడిలో నిత్య విద్యార్థిని
వర్తమానపు పలకపై…
భవిష్యత్ బలపంతో కాలాన్ని దిద్దుతున్నా

ఎగిసి పడే కలల కెరటాల సందళ్ళతో
మిడిసి పడే బాల్యపు గమనంతో
వెలుగు పూల పల్లకిలో ఊరేగేందుకు
తలపుల విత్తు నాటి తరువుగ ఎదిగేందుకు

ఆడపిల్లగా ఒదిగి ఉండే స్వభావాలను పుణికిపుచ్చుకోవాలని
ఓర్పుకు నేర్పు నేర్పి..
అమ్మకు మారుగా మరో తరుణిగా మారేందుకు


విజ్ఞాన వీచికలకు అంతరంగ శుద్ది చేసి
జ్ఞాన పటిమను సాధించేందుకు
ఉనికి కి ఊపిరి పోసి…
ఊహల కన్య లాలనలో…
నింగి అంచున కీర్తిని అందుకునేందుకు
మరలా మరలా దిద్దుతూనే ఉంటాను
బడి బాటలో వెలుగు దిశల జవ్వనిగా
చీకటిని తరిమేసే కాంతి కిరణంగా మెరిసేందుకు..!!

కామెంట్‌లు