కృష్ణగారితో పరిచయం;-- యామిజాల జగదీశ్
 నేను పత్రికా రంగంలోకి రావడానికి ముఖ్యకారకులు జి. కృష్ణగారు. అఫ్ కోర్స్ నేను ఫెయిల్యూర్ జర్నలిస్టునే. 
ఉదయం, కొంత కాలం ఆంధ్రజ్యోతి, వార్త, జెమినీ న్యూస్ ఛానెల్, సాక్షిలలో పని చేసానని చెప్పుకోవచ్చేమోగానీ ఏ మేరకు రాణించానో అని సమీక్షించుకుంటే పూజ్యమనే జవాబే వస్తుంది. ఏదో సాధించెయ్యాలనుకుని పత్రికా రంగంలోకి అడుగుపెట్టినా విఫలమవడానికి కారణం భాషమీద పట్టులేకపోవడమే. మరి మూడు దశాబ్దాలపాటు ఈ రంగంలో ఎలా నెట్టుకురాగలిగానంటే అది ఆయా సంస్థల సంపాదకుల కరుణేతప్ప మరొకటి కాదు. 
సరేకానీ, ఇంతకూ కృష్ణగారి ప్రస్తావన ఇప్పుడెందుకొచ్చిందంటే గోవిందరాజు చక్రధర్ గారు మంచి పుస్తకం శీర్షికన ఓ లింక్ పంపారు.  ఆయన పరిచయం చేసిన పుస్తకం  కృష్ణగారు రాసిన పుస్తకం - "కన్నవీ విన్నవి". ఇందులో యాభై నాలుగు వ్యాసాలున్నాయి. వయోధిక పాత్రికేయ సంఘం వారు తాజాగా ప్రచురించిన పుస్తకమిది. 
చక్రధర్ గారు పరిచయం చేసిన తీరు బాగుంది. పుస్తకంలోని ఒకటి రెండు విషయాలను ప్రస్తావిస్తూ కృష్ణగారి శైలి మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నారు. నిజమే. 
1982 ఆగస్టు 12వ తేదీన మా రెండో అన్నయ్య ఆనంద్ నన్ను కృష్ణగారింటికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి దాదాపు పంతొమ్మిదేళ్ళపాటు ఆయనతో నా పరిచయ ప్రయాణం  కొనసాగింది. ఎన్నెన్ని కబుర్లు చెప్పేవారో. ఆయన దగ్గరకొచ్చిన ప్రముఖులెందరో. వారి మధ్య జరిగిన మాటల ముచ్చట్లను వినే భాగ్యం కలిగింది. ఆయన వెంట తిరిగేవాడిని. కొందరు ప్రముఖులను కలిసి అవీ ఇవీ మాట్లాడిన రెండు మూడు రోజుల్లో వారి గురించి ఓ వ్యాసం రాసేవారు. ఆయన తన రాతప్రతిని పత్రికలవారికి పంపేముందర ఎవరితో ఒకరితో చదివించడం అలవాటు. వాళ్ళ అమ్మాయి ఇంద్రాణి ఎక్కువగా చదువుతుండేది. నేను చదివిన సందర్భాలు తక్కువే. కానీ చదివేటప్పుడు తడబడితే ఎలా చదవాలో చెప్పేవారు. 
కాళోజీ, సదాశివ, గద్దర్, కొండపల్లి శేషగిరిరావు, చీమకుర్తి శేషగిరిరావు, సురమౌళి, తిరుమల రామచంద్ర, డాక్టర్ ఎ.పి. రంగారావు, భండారు పర్వతాలరావు, ఎన్. గోపి (వేమన), అలిశెట్టి ప్రభాకర్, సంజీవ దేవ్, వజ్రేశ్వరమ్మగారు తదితరులెందరినో కృష్ణగారి వల్లే చూడగలిగాను. మాట్లాడగలిగాను. కొందరిళ్ళకు ఆయనతో కలిసి వెళ్ళాను. 
ఆయన రాసిన పుస్తకాలలో నా దగ్గరున్నవి రెండే రెండూ. అవి రెండూ కావ్యకంఠ గణపతి మునిగారి గురించిరాసినవే. ఒకటి గుంటూరు లక్ష్మీకాంతంగారు నాయన అనే శీర్షికతో తెలుగులో రాసిన పుస్తకానికి కృష్ణగారి అనువాదం. మరొకటి కూడా గణపతిమునిగారి గురించే. బుల్లి పుస్తకం. ఈ రెండూ ఇంగ్లీషులోవే. ఏ పనిమీదన్నా బయటకు వెళ్ళేటప్పుడు లక్ష్మీకాంతంగారి నాయన పుస్తకంలో ఒకటి రెండు పంక్తులు తప్పనిసరిగా చదివేవారు. ఈ పుస్తకం ఆయన పక్కనే ఉండేది. 
కృష్ణగారి దగ్గర ఓ టైప్ రైటర్ ఉండేది. రెండు వేళ్ళతో మాత్రమే టైప్ చేసేవారు. ఈ టైప్ రైటర్ పైనే టైప్ చేసి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు వ్యాసాలు పంపడం ఎరుగుదును. తెలుగులోవి మాత్రం రాసేవారు. 
నేను ఒకానొకప్పుడు పని చేసిన బాలభారతి పిల్లల మాసపత్రికకోసం రాయమని కోరితే గాంధీజీ గురించి ఓ మూడు నాలుగు సంఘటనలు రాసిచ్చారు. 
మా నాన్నగారి (యామిజాల పద్మనాభ స్వామిగారు) పోయినప్పుడు ఆయనతో ఉన్న అనుబంధం గురించి కృష్ణగారు ఓ పత్రికలో వ్యాసం రాశారు. అందులో వారి కుమార్తె రేణుకతో నా పెళ్ళిసంగతి ప్రస్తావించారు. 
మా నాన్నగారికి, కృష్ణగారికి మధ్య పరిచయం ఏర్పడడానికి కారకులు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు. మద్రాసులో మల్లాదివారు, కృష్ణగారు తిరుమూర్తి స్ట్రీట్లో ఒకే ఆవరణలో అద్దెకు ఉండేవారు. ఈ ఇంటికి దగ్గర్లోనే మేముండే వాళ్ళం (తిలక్ స్ట్రీట్). 
కృష్ణగారితో నేను కన్నవీ విన్నవి అనేకం. వాటిలో ఒకటీ అరా చెప్పుకున్నానంతే. 


కామెంట్‌లు