హార్నీ రామూ! ౼ పాలడుగు వెంకటేశ్వరావు, -- అరవై ఏళ్లనాటి బాలల కథలు( సేకరణ: డా. దార్ల బుజ్జిబాబు)
 రాధా రమణ బళ్ళోంచి వొస్తున్నారు గంతు లేసుకుంటూ. చెరువుగట్టు పక్కనే నిద్రగన్నేరు చెట్టువద్ద మలువు తిరిగేసరికి, రమణకళ్ళకి ఏదో తళుక్కుమన్నట్టయింది. “అమ్మే! అటు చూడు!" అన్నాడు. రాధారాణి పెద్దవయిన కళ్ళని అటుతిప్పి చూసింది. మట్టిలో ఒక మూల తెల్లగా మెరుస్తూ ఏదో కనిపించింది. గబాల్ని అక్కడి కెళ్ళి చూపుడు వేలుతో కెలికి చూసింది రాధ. గుండ్రంగా తెల్లగా  మెరిసింది రూపాయి సూర్య కాంతిలో  “అది నేను తీశాను నాది” అంది రాధ. పాపాం! ఎవరిదో పారేసుకున్నా వాళ్ళకి ఇచ్చేదాం” అన్నాడు రమణ.  "మా అమ్మ....!
పాపం. నాకు దొరికింది. నేను రోజూ ఈ
డబ్బులు పెట్టి పువ్వులు కొనుక్కుంటాను" అంది రాధ కళ్ళు తిప్పుతూ.
        “ఏమిటమ్మా! అది ముందర చూసింది నేను కాదా!” అన్నాడు రమణ. ఈలోగా అక్కడికి మాష్టారు వచ్చారు. “ఏమిటర్రా" అంటూ. సంగతంతా చెప్పాడు రమణ. నేనుచూశాను గనుక అది నాదండీ! కదండీ...?" అన్న రామణని అవతలికి తోసి, "దాన్ని చూసింది నేనూ...అది దొరికింది నాకు” అని కళ్ళాడించింది రాధ.
       "ఆగండి పిల్లలూ! నేను ఒక ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం చెప్పిన వాళ్ళకి ఆ రూపాయి ఇస్తాను” అన్నారు మాస్టారు. అల్లాగే అన్నారు ఇద్దరూ.
      “ఎదురుగా కాలవ ఉంది చూశారా అందులో నీళ్ళు ఒక్క చుక్కలేకుండా ఎవళ్ళు తాగితే రూపాయి వాళ్ళకిస్తాను.” అన్నారు మాస్టారు.
           “ఆ నీళ్ళన్నీ ఒక్క చుక్కలేకుండా ఎల్లానండీ!” అని ఇద్దరూ తెల్ల మొహాలు వేశారు.
         ఇంతలో అక్కడకు రాము వచ్చాడు. రాము పేదవాడు. చదువుకోటానికి పుస్తకం లేదు. వాడికళ్ళు దేన్నో వెదుకుతున్నాయ్.
      ఏమిట్రా!” అని అడిగారుమాస్టారు.
        “మా అమ్మ ఇందాక రూపాయి తీసుకొస్తూంటే పోయిందటండీ! దాని
కోసం వెదుకుతున్నాను" అన్నాడు
రాము.
       ఇల్లారారా... ! "ఈ కాలవలో నీళ్ళు ఒక్క చుక్క లేకుండా తాగితే  నీకు రూపాయి ఇస్తాను" అన్నారు మాష్టారు. క్షణం ఆలోచించిన రాము కళ్ళు సంతోషంతో మెరిశాయి. "అల్లాగేనండీ" అని వాడు కాల్వ దగ్గరకెళ్ళాడు.
      రాధా, రమణ ఆశ్చర్యంతో చూస్తున్నారు. “వాణ్ణి చూడు నీళ్ళన్నీ తాగేస్తాడా?” అన్నాడు రమణ. మాష్టారు నవ్వుతూ నిలుచుని చూస్తున్నారు.
      రాము కాల్వదగ్గర వెళ్ళి నీళ్ళలో
చూపుడు వేలు ముంచాదు. పైకెత్తి! నోరు తెరిచాడు! అంతే! వేలి చివర్నించి ఒక్క చుక్క జారి అతని నోట్లో పడింది.
          వచ్చేశాడు రాము. “ఇందాకటి
కంటే ఇప్పుడు ఒక్క చుక్క తక్కు
వండి, ఒక్క చుక్క లేకుండా  తాగేశాను” అన్నాడు రాము. రాధా, రమణ తెల్ల మొహాలు వేశారు “హార్నీ  !” అని.
       “మాష్టారు నవ్వుతూ రెండు రూపాయిలు తీసి ఇచ్చారు. "అదేమిటండీ! మనమనుకున్నది. ఒక రూపాయి గాదూ!" అన్నాడు రాము. అవును. రెండోది మీ అమ్మ పారేసుకున్నది. ఆవిడ కిచ్చే సెయ్యి. మొదటిది నీ బహుమానం. దాంతో పుస్తకం కొనుక్కుని రేపు నాకు చూపించు. ఏం అంటూ సడిచారు మాష్టారూ. ‘హార్నీ! రామూ' అని ఒకేసారి ఆశ్చర్యంగా అన్నారు రమణ, రాధా.
(ఆంధ్ర వార పత్రిక, 16.9.1959)

కామెంట్‌లు