చక్కని చుక్క;-సంధ్యా శ్రీనివాస్;-కలం స్నేహం
చక్కనైన చిన్నది నా మనసే దోచేస్తూ
చిరునవ్వులు మోమున చిందిస్తూ
చిత్ర విచిత్రమైన సైగలేవో చేస్తూ
చురకత్తుల్లాంటి చూపులతో నా మది దోచేసింది

చిన్ననాటి నా ప్రియ నిచ్ఛెలి వలె
చిలిపి మాటలు మాట్లాడుతూ
చొరవతో నా మది గదిలో చొరబడి
చేరువై చెంత చేరి ఊసులెన్నో చెప్పింది

చెలియ నగుమోము చూసినంతనే
చీకట్లు అమాంతం తొలిగిపోయినట్లుగా
చేయి నా మేనికి తాకగానే వేయి ఏనుగుల 
బలం వచ్చినట్లుగా తోచింది నా మనసుకు

చెంపకు చారడేసి కన్నులతో నన్నే చూస్తుంటే
చోద్యంగా నా మదిలో వెన్నెల వెలుగులు నిండినట్లుగా
చిరుజల్లుల తుంపరలు మేనికి తాకినట్లుగా
చిత్రాలేవో జరుగుతున్నాయి నా ఎదలో

చెలి మృదువైన తేనె వంటి మాటలు
చెవులకు ఇంపుగా సంగీత స్వరంలా తోస్తూ
చక్కని చుక్క తోడుంటే ఏమైనా చేయొచ్చు అనిపిస్తూ
చాలా అద్భుతాలు చూపిస్తోంది నీ సాహచర్యం చెలీ !


కామెంట్‌లు