వీరికి నమస్సులు!;-- జగదీశ్ యామిజాల
 మా ఆవిడ ఏదో కావాలంటూ ఎక్కడ పెట్టానో తెలీలేదు నీకు తెలుసా అని అడగడంతో నేను వెతకడం మొదలుపెట్టాను అటకమీద.
అయితే తను అడిగింది దొరకలేదుకానీ కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. వాటిని కిందకు తీసాను. ఫోటోలు తనవంతు పని చేశాయి. రంగుల ఫోటోలకంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చెప్పే కథలెన్నో ఉంటాయి. ఆరోజుల్లో అంటూ వాటిని చూస్తూ జ్ఞాపకానికి తెచ్చుకునే విషయాలనేకం. మంచివి గుర్తుకొస్తాయి. అలాగే కొన్ని చేదు అనుభవాలూ జ్ఞప్తికొస్తాయి. కొన్ని ఫోటోలలో ఉన్నవారు ఇప్పుడు మా మధ్య లేరు. ఇంకొందరేమో స్వరూపాలే మారిపోయి నేను గుర్తు పట్టలేకపోతే మా ఆవిడ వాళ్ళ గురించి చెప్పగా జ్ఞాపకం చేసుకున్నాను. ఓ మాట చెప్పాలంటే నాకు జ్ఞాపకశక్తి తక్కువే. అలాగనీ పూర్తిగా అనను. వద్దనుకున్నవీ మలచిపోవాలనుకున్నవీ మాత్రం పదే పదే జ్ఞాపకానికి వచ్చి ఇబ్బందిపెట్టక మానవు.
ఇలా అలనాటి ఫోటోలన్నీ చూస్తున్నప్పుడు ఒక ఫోటో దగ్గర నా చూపులన్నీ ఆగిపోయాయి. ఆ ఫోటోలో ఉన్న దంపతులలో ఆయన పేరు ప్రసాద్ గారు. నాకంటే పెద్దవారు. మాకు పరిచయమయ్యేనాటికే ఆయన రిటైరయ్యారు. రాంనగర్ (హైదరాబాద్) లో మేమున్నప్పుడు మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవారు. మా అబ్బాయిని చిక్కడపల్లిలోని అరోరా కాలేజీలో డిగ్రీలో చేర్పించినప్పుడు పద్దెనిమిది వేలు కట్ఃవలసి వస్తే మా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ప్రసాద్ గారిని కలిసి పరిస్థితి చెప్పుకున్నాను. చెప్పినదంతా విన్న ఆయన వెంటనే పద్దెనిమిది వేలు ఇచ్చారు. మొదటి సంవత్సరమే కాదు, తర్వాతి రెండు సంవత్సరాలుకూడా ఆయన డబ్బులిచ్చారు. మేము ప్రతి నెలా పదిహేను వందలు ఆయన ఖాతాలో కడుతుండేవాడిని. అలా వాడి డిగ్రీ పూర్తయ్యేసరికి ఆయన దగ్గర మూడేళ్ళపాటు తీసుకున్న యాభై నాలుఖు వేల రూపాయల బాకీ తీర్చేసాను. ఇక్కడే మరొక విషయం చెప్పుకోవలసి ఉంది. నేను ఆఖరి వాయిదా కట్టేసిన తర్వాత ఇక మీరు వచ్చే నెల నుంచి నాకు డబ్బులు కట్టక్కర్లేదని చెప్పడం. 
మా అబ్బాయి డిగ్రీ ప్యాసయ్యాక స్వీట్స్ కొనుక్కుని ఆయన దగ్గరకు వెళ్ళాం నమస్కరించి ఇవ్వడానికి!
అప్పుడు ఆయన చెప్పిన మాటలు...
"ఇచ్చిన డబ్బులు సద్వినియోగమై మీ అబ్బాయి ప్యాసైనందుకు సంతోషంగా ఉందండి. అదే నాకు స్వీట్ తిన్నంత ఆనందం" అని.
నా జీవితంలో మరచిపోలేని వారిలో ప్రసాద్ గారొకరు. ఆయనకు మనఃపూర్వక వందనాలు.

కామెంట్‌లు