వ్యాపారం లో సేవ;- కంచనపల్లి వేంకట కృష్ణారావు.CELL:9348611445.
 "రాజా అన్ని వ్యాపారాలు, సేవలు ఒకటిగా ఉండవు. కొందరు కేవలం డబ్బు కోసం లాభాల కోసం వ్యాపారం చేస్తారు.మరి కొందరు వ్యాపారం చేస్తున్నా లాభాలు ఆశించకుండా ఎందరికో మేలు జరిగే సేవ చేస్తుంటారు" అని వజ్రకీర్తి మహారాజు తో మంత్రి సుమంతుడు చెప్పాడు.
     "మీరు ఎవరిని గురించి చెబుతున్నారు? ఏమిటి ఆ విషయం?"అని రాజు గారు అడిగారు.
        "మహారాజా రేపు మనిద్దరం కావలి పురం అనే ఊరు వెళ్లి అక్కడ ఉన్న పూటకూళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేద్దాము. నేను చెప్పడం కన్నా మీరు అక్కడి విషయం చూస్తే మీకు వారి సేవ అర్ధం అవుతుంది" చెప్పాడు సుమంతుడు.
         రెండవరోజే రాజుగారు,మంత్రి కావలి పురానికి మారు వేషాల్లో సుబ్బాయమ్మ పూటకూళ్ళ ఇంటికి వెళ్ళారు.
          సుబ్బాయమ్మ ఇద్దరినీ ఆప్యాయంగా ఆహ్వానించి కమ్మనైన భోజనం పెట్టింది.తరువాత ఇద్దరినీ పక్క గదిలో భుక్తాయసం తీర్చుకొని వారి ఊరికి వెళ్ళవచ్చని చెప్పింది.
       భోజనం చేసిన తరువాత మంత్రి రాజుగారు ని తీసుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ చాపలు పరచి దిండ్లు వేసి ఉన్నాయి. ఇంకా విచత్రమేమిటంటే,అక్కడ గదిలోక
 అరల్లో కొన్ని తాళ పత్ర గ్రంథాలు,అనేక పుస్తకాలు,వ్రాసుకొందుకు మంచికలం,అనువైన వ్రాత బల్ల,తెల్ల కాగితాలు అమర్చబడి ఉన్నాయి.
     "అరె! ఇదేమిటి ఈ అమరిక?" అని రాజు గారు ఆశ్చర్యపోయారు.
       "అదే మహారాజా, కేవలం భోజనం పెట్టడం కాదు, మెదడుకు కొంత జ్ఞానం కూడా ఆ సుబాయమ్మ పెడుతోంది.అదే ఆమె గొప్పతనం . ఇక్కడ భోజనానికి వచ్చిన కొందరు విద్యావంతులు,రచయితలు కేవలం భోజనం చేయడమే కాదు, ఆ గ్రంథాలు చదువుతారు. కొందరు స్ఫూర్తి పొంది ఒక కవితో, పద్యమో, వ్యాసమో,మంచి కథో వ్రాస్తారు. వాటికి నకళ్ళు తయారు చేసి ఆమె గ్రంథాలయానికి ఇస్తారు.
ఆమె చేసే మంచి పనిని గమనించిన కొందరు వారి వద్ద ఉన్న గ్రంథాలను ఆమెకు ఇస్తున్నారు.  అందుకే ఆమె వద్ద అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆమె కేవలం భోజనం పెట్టడమే కాదు ఎంతో ఆలోచనతో విజ్ఞానం కూడా పంచుతోంది. ఇటువంటి మంచి కార్యాలు ఎవరో కొంతమంది మాత్రమే చేయగలరు." అని వివరించాడు మంత్రి సుమంతుడు.
      ఒక మంచి భోజనశాల అందులోఒక గ్రంథాలయం చూసినందుకు రాజు వజ్రకీర్తి ఎంతో సంతోషించి, రాజధాని చేరుకుని సుబ్బాయమ్మ కు కానుకగా కొంత సొమ్మును తన పుస్తక భాండాగారం లోని కొన్ని పుస్తకాలను పంపాడు.
       తన దగ్గర భోంచేసింది రాజు గారు,మంత్రి అని తెలుసుకుని సుబ్బాయమ్మ ఎంతో సంతోషించి, ప్రత్యేకంగా రాజధానికి వెళ్లి రాజు గారికి కృతజ్ఞతలు తెలిపింది. 
   చూశారా, కేవలం వ్యాపారం వలన డబ్బులు సంపాదించడమే కాదు,వారి పరిధిలో తోటి వారికి ఎంతో కొంత మేలు చేస్తే ఆ మంచి మరింత మంచి పేరు డబ్బు సంపాదించి పెడుతుంది.
కామెంట్‌లు