*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౨౧- 021)*
 *విద్వత్ పద్ధతి*
కందం:
*సుకృతాత్ములు రససిద్ధులు*
*సుకవీంద్రులు విజయనిధులు, సుమ్ము తదీయా*
*ధికకీర్తిశరీరంబులు*
*ప్రకటజరామరణజన్మ భయరహితంబుల్*
*తా:*
మంచి మనసు కలవారు, మంత్రసిద్ధి పొందినవారు, మంచి రచనలు చేయగలిగిన వారు, చేపట్టిన ప్రతి పనిలోనూ జయమును పొందేవారు, వీరందరూ వారికి వచ్చిన కీర్తి వలన పుట్టుక మరణాలతో సంబంధం లేకుండా, ఏ విధమైన భయము లేకుండా శాస్వతముగా ఈ నేలమీద వారి పేరు నిలిచి వుంటుంది. వారి కీర్తి శరీరానికి మరణ భయం లేదు ...... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"కాకి లాగా కలకాలం బ్రతికే కన్నా, కోకిల లాగా కొంతకాలం బ్రతికినా మేలు" అని నానుడి కదా! మనం ఈ భూమి మీద వున్నప్పుడు ఎవరూ పలుకక పోయినా నష్టం లేదు. కానీ మనం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తరువాత మనం చేసిన పనుల గురించి, మాటాడిన మాటల గురించి వారు మాట్లాడుకో గలిగితే, మనం మరణంలోనూ జీవించి వున్నట్టే కదా! మనం చేసే పనులు మన గురించి మాట్లాడాలి. మన వునికిని చెప్పుకోవడానికి మనం మాట్లాడే అవసరం లేదు. అందుకే, పెద్దవారు చెప్పేవారు కదా! చేసేపనిలో, మాట్లాడే మాటలో ఎప్పుడూ ఎదుటి వారి మంచి కోరుకోవడం లోనే గొప్పతనం వుంది. నేను, నా, నాది అనుకున్నంత సేపు, మనం, మనకి కూడా పనికి రాము. అందుకే మనం మన తరువాతి వారికి పరిచయం చేయవలసినది ఒక వావిలాల, ఒక పొట్టి శ్రీరాములు, ఒక సర్దార్ పటేల్, ఒక ఆదిశంకరాచార్యులు, ఒక చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఇటువంటి వారిని. వీరందరూ కూడా మనకు ప్రాతః స్మరణీయులే.....*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు