*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౨౩- 023)*
 *మానశౌర్య పద్ధతి*
ఉత్పలమాల:
*స్నాయువసావసేకమలి నమ్మగునెమ్ముగ్రహించి జాగలం*
*బాయతమోదమందుఁ జన దాఁకలి దానికిఁ జెంత నున్నగో*
*మాయువు దానిఁ జూచి పరిమార్పక సింగము దంతిఁగూల్చునే*
*చాయల నెల్లవారు నిజ సత్త్వసమానఫలార్థులే కదా!*
*తా:*
ఆకలితో వున్న కుక్క, తనకు మాంసము పెద్దగాలేకపోయినా, ఎంగిలి చేయబడిన సన్నని నరములతో వున్న ఎముక దొరకగానే సంతోష పడుతుంది కానీ, దాని ఆకలి తీరదు. కానీ, సింహము ఆకలిగా వున్నప్పుడు, తన ఎదరుగా అందుబాటులో ఒక నక్క, ఏనుగు వుంటే, ఏనుగు కుంభ స్థలమును చీల్చి మాంసమును తినడానికే ఇష్ట పడుతుంది తప్ప నక్క మీదికి వెళ్ళదు. ఆ విధంగా కష్టకాలంలో ఎవరైనా తమ శక్తి సామర్థ్యాల మేరకు మాత్రమే పోరాడగలగుగు తారు...... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత కష్టలలో వున్నా, మనం ఏమి చేయగలము, మనవల్ల ఎంత వీలు అవుతుంది అని ఆలోచించుకుని, తమ శక్తి మేరకు ఆ కష్టాల నుండి బయట పడే మార్గం తెలుసుకుని, చూచుకుని గట్టెక్కే ప్రయత్నం తప్పకుండా చేయాలి. మహాభారతం లో, నిండు సభలో ద్రౌపది, కీచకుడు తన వలువలు ఊడుస్తుంటే, తన గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది ద్రుపదరాజపుత్రి. తన వల్ల కాదు, అని తెలిసినప్పుడు, "నీవు తక్క ఇతః పరంబెరుగ" అని భగవంతుని ప్రార్ధిస్తుంది. తరువాతి కథ మనకు తెలిసిందే. అలాగే, గజేంద్ర మోక్షం లో మదించిన గజేంద్రుడు, మడుగులో దిగినప్పుడు, మొసలి తనను చంపే ప్రయత్నం చేసినప్పుడు కూడా, గజేంద్రుడు తనను తాను కాపుడుకునే ప్రయత్నం చేస్తాడు. వల్ల కానప్పుడు, "రావే వరదా! కావవే!" అని ఎలుగెత్తి అడుగగానే, తనపరివారంలో ఎవరికీ చెప్పకుండా, అమ్మవారి చెంగుకూడా వదలకుండా, గంజేద్రుని రక్షిస్తాడు తన చక్రాయుధంతో.  మానవవ మాత్రలం కాబట్టి, మన ప్రయత్నం మనం చేసి, ఆపైన, "అయ్యా నీవే దిక్కు" అని ఏభక్తడు ఎప్పుడు పిలుస్తాడా వెళ్ళి కాపాడుదాము అని పరాత్పరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి సర్వమంగళుణ్ణి, సర్వ శుభాలు ఇచ్చి వదిలేయకుండా, చివరకు మోక్షమును కూడా ప్రసాదించమని వేడుకుంటూ .....*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు