*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౨౫- 025)*
 *మానశౌర్య పద్ధతి*
తేటగీతి:
*ప్రాణిలోకంబు సంసార పతిత మగుట*
*వసుధపైఁగిట్టిపుట్టని వాఁడు గలఁడె*
*వానిజన్మంబు సఫలమె వ్వానివలన*
*వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు*
*తా:*
ఈ భూమి మీద పుట్టిన వారు, సంసార చక్ర బంధములో చిక్కుకుని వుండటం, చనిపోవడం సహజమైన విషయం. ఇలా చనిపోయిన వారు తిరిగి పుట్టడం అనేది కూడా అంతే సహజం. కానీ, పుట్టాలి కనుక పుట్టి, సహజం కాబట్టి మరణించినందువల్ల ఎవరికీ ఏమాత్రం ఉపయోగము వుండదు కాక వుండదు.  అలా పుట్టుక పొందిన వారి వల్ల, ఎవరి వంశానికి మంచిపేరు వస్తుందో, ఏ సమాజానికి గుర్తింపు వస్తందో వారి పుట్టుక గొప్పగా వుండి ఎంతో వున్నతము అయినది అవుతుంది....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*"జాతస్యహి ధృవో మృత్యుః! ధృవం జన్మ మృతస్య చ!" ఇది భగవానుడు శ్రీ కృష్ణుని వాక్యం.  చెప్పింది పరాత్పరుడు కనుక దీనిని ధృవపరచ వలసిన అవసరం లేదు. నిత్య సత్యం కదా! ఒక మనిషి స్థానం ఈ ప్రపంచంలో ఏమిటి అంటే, అది అతని మరణం లో తెలుస్తుంది.  ఎలా అంటే, ఆ మనిషి చనిపోయినట్టు, ఆయన ప్రక్కన వున్న వారికి కూడా తెలియదట. ఆ చనిపోయిన మనిషి కోసం సమాజం కదలి వస్తే, నివాళులు అర్పిస్తే, ఆ మనిషి చేత చేయబడిన పనుల గురించి మాట్లాడుకుంటుంటే, అప్పుడు, అప్పుడు కదా, ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు, అతని వంశానికి, అతను తిరుగాడిన ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చేది.* 
*అందుకే మనమందరం, మన నిత్య భగవన్నామ స్మరణంలో భాగంగా, ఈ శ్లోకం చేర్చుకుంటే, ధన్యులము అవుతాము అని పెద్దల వాక్కు......*
*"అనాయాసేన మరణం! వినాదైన్యేన జీవనం!!
దేహాంతే తవ సాన్నిధ్యం!!! దేహిమే పరమేశ్వర!!!"*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు