గుడ్మార్నింగ్ ;-తుమ్మేటి రఘోత్తమరెడ్డి(507 వ రోజు)

 మనిషి స్వభావం ఏమిటి అంటే,
నెపాన్ని అవతలి వైపు నెట్టడం!
నెట్టిన తరువాత,ఇక ఫరాగతుగా సిద్దాంతాలు కూడా చేస్తారు. వాటికి చేర్పులు కూడా చేరుస్తారు.
నిజానికి నగరాలన్నీ వలస కేంద్రాలే!
మొదటి నుండి నగరాలు పాలనా కేంద్రాలు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెదుకుతూ, గ్రామాల్లో 'మట్టిని పిసుక్కుని' బ్రతకలేక, 'చేతికి మట్టి  అంటకుండా' బ్రతకడానికి అవసరమయ్యే చదువులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని,గ్రామ సీమల నుండి అనాదిగా మనుషులు పట్టణాలకు వలస వస్తున్నారు.
లక్షలాది కోట్లాది మంది అలాగే వచ్చారు.మరెందరో ఉపాధి లేక కూడా వస్తారు. వచ్చిన తరువాత , వాళ్ల వాళ్ల ఆర్థిక స్థితిగతులను బట్టి, చిన్నా పెద్దా కాలనీల్లో, అపార్ట్మెంట్లలో,గేటెడ్ కమ్యూనిటీలలో ఇళ్లు కొనుక్కుని స్ధిరపడతారు.ఇదంతా లక్షలాది కోట్లాది మంది తీరుతెన్నులు. కానీ, ఇందులో ఒక ప్రత్యేక తెగ ఉంటుంది.
అటు ధనవంతులు కాలేకా,ఇటు పేదవారు కాలేకా,మధ్యస్తంగా ఒక వర్గం ఉంటుంది. అందులో మళ్లీ మేధావుల టైప్ ఒకటి ఉంటుంది. దాని జీవితం ఆలోచనలు ఆచరణ పరస్పర విరుద్ధంగా ఉంటాయి.
ఆ వర్గంలో కొందరు కథలు నవలలు కవిత్వం రాస్తారు. వీలైతే చిన్నపాటి సినిమాలు కూడా తీస్తారు. ఏమని రాస్తారు? ఏమని తీస్తారు? ఉదాహరణకు ఒక్క విషయం తీసుకుందాం!
'అబ్బ నగరాల్లో ఊపిరి ఆడటం లేదు! మనం రాన్రాను ఏమయ్యాం? ఎక్కడి నుండి ఈ నరక కూపాల్లోకి వచ్చి పడ్డాం? మన మూలాలు ఏమిటి? మనం మరిచే పొయ్యాం.ఈ ఇరుకిరుకు మురికి బ్రతుకు ఏమిటి? ఇక బ్రతికిన కాడికి చాలు.తిరిగి గ్రామాలకు వెళ్దాం!
ఇంక ఈ దిక్కుమాలిన నగరాలలో ఉండే కర్మ మనకు ఎందుకు? అని, 'గో టూ విలేజ్' క్యాంపేయిన్ తాలూకా కథలు నవలలు 'సన్నపాటి సినిమాలు' వగైరా ద్వారా ప్రచారం చేస్తారు.పాపం కొందరు మధ్యతరగతి పాఠకులు అది నిజమే అని, మనమూ గ్రామాలకు వెళ్తే బాగుంటుంది, ఒకప్పుడు మన చిన్నప్పుడు గ్రామాలు ఎంత బాగుండేవి?
మనుషుల్లో దండిగా ఆదరాభిమానాలు ఉండేవి. ఊరంతా ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది.ఈ నగరాల్లోకి వచ్చి మనం ఎన్నో పోగొట్టుకున్నాం.ఈ చివరి దశకైనా కాస్తా ప్రశాంతంగా బ్రతకాలని గట్టిగా అనుకుంటారు.
పాపం, వీళ్లు ఇలా అనుకోగానే,సదరు మధ్యతరగతి మేధావులు తిరిగి తమ సిద్దాంతాన్ని మరింత విస్తరిస్తారు. ' అబ్బే , గ్రామాలు మునుపటి లాగా లేవు.అలనాటి ఆప్యాయతలు అభిమానులు ఇప్పుడు లేవు.గ్రామాలు కూడా పట్టణాల లాగే చెడిపొయ్యాయి.మనం వెళ్తే , ఒక్కరోజు కూడా అక్కడ ఉండలేం.అంతకంటే ఈ పట్టణాలే నయం ' అని, తమ బంగారు పళ్లెం వంటి సిద్దాంతానికి , గోడ చేర్పు లాగా కొన్ని మాటలు చేరుస్తారు. అప్పుడు మిగతా మధ్యతరగతి పాఠకులు కూడా ' ఔనా? అలాగానా?? ముందే చెప్పారు.మంచిదైంది.మేం అపార్ట్మెంట్ అమ్మాలని కూడా అనుకున్నాం.థాంక్స్ ' అని కూడా అంటారు.ఊపిరి పీల్చుకుంటారు.రిస్క్ తప్పిందని హమ్మయ్య అనుకుంటారు. లోకం చెడిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు.
మారదలుచుకోని మనుషులు, రిస్క్ తీసుకోని మనుషులు,
దరిదాపుల్లో కార్పోరేట్ హాస్పిటల్ ఉన్నచోట , ఫరాగతుగా ఉండదల్చుకున్న వారి ఆలోచనలు మాటలు చేతలు పరస్పరం పొంతన లేకుండా ఉంటాయి.
పట్టణాలలో, పారిశ్రామిక ప్రాంతాలలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత, కొందరు తిరిగి తమ తమ గ్రామాలకు వెళ్లి స్ధిరపడుతున్నారు.అలా చెయ్యలేని వారు, నగరాలలో సర్దుకుంటున్నారు.తమకు చేతనైన సామాజిక సేవల్లో కూడా కొందరు పాల్గొంటున్నారు.ఇళ్ల మీద కూడా కూరగాయల సాగు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు.
ఈ మధ్యతరగతి మేధావుల వలె అపసోపాలు పడరు.ఉన్నదేదో ఉన్నట్టు ఉంటారు.వాస్తవిక జ్ఞానం ఉంటుంది సామాన్యులకు.
జీవితం అనాదిగా ఎలా సాగుతూ వస్తోందో,ఇప్పుడు అలాగే సాగిపోతోంది.ఎటు వెళ్లేవారు అటు వెళ్తున్నారు.
తాము తమ పని చేసుకుని బ్రతుకుతూ కూడా, కొందరు సమాజం గురించి,అందులో దిక్కు లేని వారికి దిక్కు అవడం గురించి,జీవకారుణ్యం కలిగి బ్రతకడానికి, పర్యావరణ పరిరక్షణ కోసం ,తమకు వీలైనంత వరకు చేస్తూ ఉంటారు. సామాజిక మార్పుకు కృషి చేస్తుంటారు.
వారు ఏ సిద్దాంతాలూ చేయరు.
ఏదీ చెయ్యదల్చుకోని వారే,లోకం చెడిపోయిందని సిద్దాంతాలు చేస్తారు. ఎందుకు?
తాము కూడా అలాగే చెడిపోవడానికి ,గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి!
ఉన్నచోట జీవితాన్ని బాగు చెయ్యలేని వారు,
ఎక్కడికి వెళ్ళినా ఏమీ చెయ్యలేరు కూడాను!

కామెంట్‌లు