*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *- విద్యేశ్వర సంహిత - (౬౫ - 65)*
 *రుద్రాక్ష ధారణ మహిమ - వివిధ భేదములు - ౩*
*నియమ పూర్వకముగా రుద్రాక్ష ను ధరించాలి. శుభములను కోరుకునే వారు, అన్నివిధాలా చక్కగా వున్న రుద్రాక్ష నే ధరించాలి. రుద్రాక్ష పరమశివుని యొక్క మంగళమయ రూపం. మనుష్యులు అందరూ, అన్ని కులముల వారు, స్త్రీలు, శూద్రులు అందరూ కూడా పరమశివుని ఆదేశముగా రుద్రాక్ష ధరించాలి. నుదుటి మీద విభూతి రేఖలతో, రుద్రాక్ష మాల ధరించి, మృత్యంజయ మంత్రము పఠించుచున్న మానవుడు కనిపించినప్పుడు, ఆ వ్యక్తిని చూచిన వారికి ఆ రుద్రభూవిహారిని చూసిన ఫలితం లభిస్తుంది.*
*రుద్రాక్ష భోగమును, మోక్షమును ఇస్తుంది. ౧. ఏకముఖి - సాక్షాత్తు శివ స్వరూపము. సకల భోగములు, మోక్షమును ఇస్తుంది. రుద్రాక్ష పూజింప బడిన చోట లక్ష్మీ దేవి తిష్ట వేసుకుని వుంటుంది. ఉపద్రవములు అన్నీ తొలగి పోతాయి. అందరి కోరికలు ఫలిస్తాయి.   ౨. ద్విముఖి - దేవదేవేశ్వర స్వరూపము.  ౩. త్రిముఖి - సాధన ఫలమును ఇస్తుంది. అన్ని విద్యలు మన సొంతం అవుతాయి. ౪. చతుర్ముఖి - సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము.  ౫. పంచముఖి - కాలాగ్ని రుద్ర స్వరూపము. ౬. షణ్ముఖి - కార్తికేయ రూపము. దీనిని కుడి చేతికి ధరిచినవారు, బ్రహ్మ హత్యాది దోషాలనుండి ముక్తి పొందుతారు, నిస్సంశయముగా.   ౭. సప్తముఖి - అనంగ స్వరూపము. దీనిని ధరించిన దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు. ౮. అష్టముఖి - అష్టమూర్తి యగు భైరవ స్వరూపము. అష్టముఖి రుద్రాక్ష ధరించినవాడు పూర్ణాయుష్కుడై, అంతకాలమున శూలమును ధరించిన శివుడగును. ౯. నవముఖి - భైరవ మరియు కపిలముని స్వరూపము. నవముఖి రుద్రాక్ష ను ఎడమచేతికి ధరించినవారు, పరమశివడే అవుతారు. ౧౦. దశముఖి - విష్ణు స్వరూపము. అన్ని కోరికలు సిద్ధింప చేస్తుంది. ౧౧. ఏకాదశముఖి - రుద్ర రూపము. విజయ సిద్ధి కోసం దీనిని ధరించాలి. ౧౨. ద్వాదశముఖి - దీనిని ధరించడం వలన ద్వాదశాదిత్యులు మన శిరస్సుపై వున్నట్లు,  మన ముఖం దేదీప్యమానంగా వెలిగి పోతుంది. ౧౩. త్రయోదశముఖి - విశ్వదేవతల స్వరూపము. ౧౪. చతుర్దశముఖి - పరమశివ స్వరూపము.*
*నిద్ర, అలసత్వము వదలి శ్రదధా భక్తులతో అన్ని కోరికలు తీరడానికి సమంత్రకంగా ఈ పద్నాలుగు రుద్రాక్ష లను ధరించాలి. రుద్రాక్ష ధరించిన వారిని, భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకినీ, రాక్షసులు ఏమీ చేయలేరు. రుద్రాక్ష ధరించిన వానిని చూచి సకల దేవతలు ప్రసన్నం అవుతారు.*
*||విద్యేశ్వర సంహిత సంపూర్ణము||*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు