వసంతం....;- - ప్రమోద్ ఆవంచ 7013272452

 శిశిరాన్ని అప్పుడే తాకింది గ్రీష్మ తాపం.
వసంతమేదీ...
ఆకులు రాలుతూనే వున్నాయి, ప్రాణాలై!
అమావాస్య దాటితే కానీ చైత్రం రాదు.
కన్నీళ్లు కలిసికట్టుగా చీకట్లో ప్రవహిస్తున్నాయి.
తాపంతో నాలుక పిడుచకట్టుకపోతుంది.
ఆలోచనలు చెమట వాసన పడుతున్నాయి.
ఎన్నో ఏళ్లుగా చూస్తూనే వున్నాం,వింటూనే వున్నాం
నేడెందుకో వ్యక్త పరచలేనీ ఒక సందిగ్ధ స్థితి చుట్టూ
ఆవహించింది.
                            2
అవును వసంతాన్ని ఊహించుకోవాలి 
చల్లని గాలి వీస్తూ, నన్ను తడుముతుంది
అప్పటి వరకు మోడుగా వున్న కొమ్మకు అందమైన
లేత మొగ్గ ప్రాణం పోసుకుంటుంది.
ఒక కొత్త జీవితం వెలుగు చూసింది
అది స్వచ్చమైన ఊపిరి పీల్చుకుంటుంది.
శిశిరంలో రాలిపోయిన తన తరం ఆనవాళ్లను తలుచుకుంటుంది.
ఒక్కసారిగా తన గుండెను పిండేసింది.
పుట్టడం అంటే ఏదో ఒక రోజు జీవితానికి ముగింపు 
ఉంటుందనేది సత్యం.
                                3
వ్యర్థమైన ఆలోచనలు వసంతాన్ని తాకితే ఒక కొత్త ఒరవడికి స్వీకారం చుట్టినట్లే!
అందుకే వసంతం ఒక వికాసం... వసంతం పసి తనపు బోసి నవ్వు
ఆనందం మనసును తాకే నింగి, విషయం ఏదైనా కొత్తగా వుంటుంది, ఏదో శక్తి నిన్ను మేల్కొలుపుతుంది.
                                   4
 స్వేచ్ఛ నిచ్చే వసంతం వుంటుందా? ఋతువులన్నీ
ఈ  స్తబ్ధతను తొలగిస్తాయా?
అందుకే వసంతాన్ని ప్రాణంలో నింపుకోవాలి
ఎగిరేందుకు ఆ లేత రెక్కలకు కొత్త ఉత్సాహాన్ని
ఇవ్వాలి.
వినూత్న ప్రణాళికలకు ఊపిరి పోయాలి......
                                   
కామెంట్‌లు