గుర్తుకొస్తున్నాయి--మా అన్నారం డాక్టారు--సత్యవాణి 8639660566
 మా అన్నారం డాక్టారు
సుమారుగా అరవైఅదు, అరవైఆరు సంవత్సరాల క్రితమే మా రౌతులపూడికి వచ్చేరు. డాక్టరుగారు మాఊరు వచ్చేసరికి ,వరహాలమ్మ,భక్తవత్సలం,సత్యనారాయణ అని మగ్గురు పిల్లలను తీసుకొని వచ్చేరు.మాఊరికి వచ్చేకా మరో ఇద్దరాడపిల్లలూ,ఇద్దరు మగపిల్లలు కలిగారు. బహుశా అన్నవరంనుండి వచ్చి కాపురం పెట్టినమూలంగా అనుకొంటానుఆయనకు  అన్నారండాక్టారు అని పేరొచ్చివుంటుంది. .ఆయన అసలు పేరేమిటో మా ఊళ్ళో ఎవరికీ తెలియదేమోకానీ,బహుశా వాడ్రేవు రామక్రిష్ణ గారేమోనని చిన్న జ్ఞాపకం.ఇంటిపేరు చూసి,వెజిటేరియన్ అనుకోకండి.డాక్టరుగారు పక్కా మాంసాహారి."
     సుమారు ఆరున్నర అడుగులపొడుగు,పొడుగుకు తగ్గ లావు,మంచి రంగూ, తెల్లటి ఖాదీ నిక్కరు, తెల్లని ఖాదీ బుష్ కోటూ, జుట్టుకు మధ్యల తీసిన పాపిడి,నుదుటను ఎర్రని కుంకంబొట్టుతో చూడగానే గౌరవం వుట్టిపడేలా వుండేవారు.'
     అన్నారండాక్టరుగారు మాఊరు రాకముందునుంచీ,మాఊరిలో తాటికొండ సూన్నారాయణగారని కోమటి డాక్టరుగారు వుండేవారు.
ఆయనరూపం,చాలామటుకు అన్నారండాక్టరుగారికి పూర్తిగా వ్యతిరేకంగా వుండెేది.అయితే ఆయన ఊరిలో కొందరిళ్ళకు ఆస్థానడాక్టరుగా వైద్యంచేస్తే,మా అన్నారండాక్టరుగారు మరికొందరిళ్ళకు ఆస్థానవైద్యలు.  మరీ ప్రాణమీదకు వచ్చినప్పుడు  ఈ ఆద్దరిలో ఏఒక్కరో అందుబాటులో లేకపోతెతప్ప ,ఎవరి ఇళ్ళు వారివే.ఆయన వైద్యంచేసే ఇళ్ళకు ఈయన వెళ్ళరు.ఈయన వైద్యంచేసే ఇళ్ళకు ఆయన వెళ్ళరు.  వాళ్ళిద్దరూ అలా ఏమన్నా ఒప్పందాలు కుదుర్చుకొన్నారో ఏమోమరి మనకు తెలియదు..
   అయితే మా ఇంటివైద్యం మటుకు అన్నారండాక్టరుగారే చూసేవారు. నాన్నావాళ్ళూ ఆయన వైద్యంచేసినందుకు బహుశా ధాన్యంబస్తాలు తోలేవారనుకొంటాను.డబ్బు ప్రసక్తి బహు తక్కువగా వుండేరోజులవి.
     డాక్టరుగారు ప్రతి రోజూ క్రమంతప్పకుండా,ఎనిమిదిన్నర,తొమ్మిది గంటల మధ్యన విజిట్ చేయడానికి ఊళ్ళోకి వచ్చేవారు.అలాగే మాయింటికీ వచ్చేవారు.ఇంట్లో కనిపించినవాళ్ళనందరినీ ఏదో ఒకటి పలకరించేవారు. పిల్లల్నైతే మరీ ఆప్యాయంగా పలకరించేవారు.ఆయనవచ్చిన  సమయంలో అన్నయ్యేనా,చిన్నాన్నేనా తారసపడితే, రాజకీయాలూ మాట్లాడేవారు.ఆయనకు చదువుకొనే పిల్లలంటే బాగా ఇష్టంమూలంగా,మా ఇంట్లో పిల్లలంతా బాగా చదువుకుంటున్నారని ఆయనకు బాగా ఇష్టం. మాడాక్టరు గారికి,వాళ్ళపిల్లలలో ఎవరినైనా డాక్టర్ని చేయాలన్న కోరిక ఎందుచేతనో ఫలించలేదు.             ఆయన  ఉదయం తొమ్మిదిగంటలలోపుగా వచ్చెేసరికే  వంటప్రయత్నంలో వున్న మా అమ్మని ,"ఈ రోజు కూరలేమిటి చేస్తున్నారు?" అని అడిగేవారు.అమ్మ ఏంవొండుతోందో చెప్పేది.ఆయనకి ఇష్టమైనకూరఅయితే,"మాసత్తి బాబునో,చంద్రబాబునో పంపిస్తాను.కూర పంపించండి"అని చెప్పివెళ్ళేవారు.సాధారంగా ఆయన కిష్టమైన కూరలేమిటో  మా అమ్మకీ ,పిన్నికీ తెలుసు.ముక్కలపులుసు,మజ్జిగపులుసు, పనసపొట్టు ఆవకూర,అరటికాయ ఆవకూర,బీరకాయ కారంపెట్టినకూర,వంకాయకారంపెట్టినకూరా ఇలాంటివి ఏవైనా వండినప్పుడు ఆయన వాటా ముందుగానే వెనక్కిపెట్టేసేవారు.ఒకవేళ ఆయనకు ఫలానాకూర తినాలనిపిస్తే,"ఫలానా కూరొండి పంపించండి "అని  చెప్పేంత చనువుండేది ఆయనకు మాఇంటిలో.
     డాక్టరుగారికి చిక్కటి,చింతగింజ వేసినా ములగని పుల్లమజ్జిగ అంటేఇష్టం.అందకని ప్రతిరోజూ పుల్లమజ్జిగ ఆయనకోసం తీసిపేట్టవలసిందే.వాళ్ళమొగపిల్లలో,మా పాలికాపులో మజ్జిగ ,పట్టికెళ్ళి ఇవ్వాలి.మా  ఇంటినుండిమజ్జిగ వచ్చేకానే ఆయన భోజనంచేసేవారట.
    చెప్పటం మరచేను మా డాక్టారి చొక్కాజేబులో, బయటకు వచ్చేటప్పుడుఒక సబ్బుపెట్టిలాంటి, చిన్న స్టీలు పెట్టి ఒకటి ఎప్పుడూవుండేది.దాన్నిండా ఒకటి రెండు సైజులలో తెల్లటి మాత్రలుండేవి.ఆయన దారంట వెళుతున్నప్పుడు,ఎవరు తమ,ఏ శరీరబాధలు చెప్పుకొన్నా,ఆ పెట్టిలోంచి,చిన్నవో పెద్దవో,ఒకటిరెండు మాత్రలు తీసి ఇచ్చేవారు.ఎవరూ ఆమాత్రలకి ఆయనకు డబ్బులిచ్చినట్లుగానీ ,ఆయన పుచ్చుకొన్నట్లగానీ మటుకు మాకు తెలియదు.సాధారంణంగా రౌతునిచూసి గుర్రం కుంటినట్లు,మా ఇంట్లో మా అమ్మో ,పిన్నో,ఏదో కంప్లైంట్ ,తలనొప్పిగావుందనో,కణతలు లాగుతున్నాయనో,మోకాళ్ళు నొప్పులనో ఇలా  ఏదో ఒకటి చెప్పినప్పుడు జేబులోంచి మాత్రలపెట్టి తీసి తెరవబోతుంటే,మాఅమ్మమటుకు "పాలికాపును పంపిస్తాను ,కాస్త మంచిమందిద్దురూ!"అనేసేది నిర్మొహమాటంగా.ఎందుకంటే,ఆ మందులపెట్టిలో వుండేవి సోడామెంట్ మాత్రలే అని మాఅమ్మకు గట్టి నమ్మకం.అవును,మా అమ్మ బాగా తెలివైనదికనక."ఆయన నవ్వుతూ ,సరేపంపండి అనేవారు.నిజంగానే ,వెంటనే పనిచేసే మంచిమందిచ్చి పంపేవారు. 
    ఊర్లోవారందరూ  కూడా, "అన్నారండాక్టరుగారికి కోపమెక్కువ "అనేవారు.వాళ్ళింట్లోవాళ్ళైతే, ఆయన ఇంట్లో వున్నంతసేపూ పిల్లుల్లా వుంటారట.మరి మాకు మాత్రం ఆయనకోపదారిమనిషిలా ఎప్పుడూ కనిపించేవారుకాదు.
      మా చెల్లెళ్ళు,రాజా,అరుణా,వల్లీ  మాతమ్ముడు సత్తిబాబు పురుళ్ళు ఆయన చేతిమీదుగా, ఆయనవైద్యం సహాయంతోనే జరిగాయి.
    మా పిల్లమూకకు కడుపునొచ్చినా, కాలునొచ్చినా, మందుమాకులూ చూడడం ఆయనపనే..
       నా ఇద్దరి పిల్లల (మధ్యలోవాడు సాయి ,కాకినాడ జనరల్ హాస్పటల్ లోపుట్టాడులెండి.) పురుళ్ళూ,మా చెల్లాయి ముగ్గురు పిల్లల పురుళ్ళూ కూడా,ఆయన వున్నారన్న ధైర్యంతోనే అంత పల్లెటూరైన మా రౌతులపూడిలోనే జరిగాయి. 
       ఒక్కరోజు కూడా డాక్టరుగారు చంటిపిల్లలను చూడడానికి  రాకుండా వుండేవారుకాదు. ప్రతీరోజూ,పొట్టనొక్కిచూసేవారు. నిజానికి,మా అమ్మ ,మేము బాలింతలుగా వున్నప్పుడు  మాచేత చేయించే పత్యపానాలో,మా డాక్టరుగారి హస్తవాసో తెలియదు,పిల్లలందరూ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ,హాయిగా వుండేవారు.ఏదో చిన్నచిన్న దగ్గులూ రొంపలూ తప్ప పెద్దచెప్పుకొతగ్గ రోగాలేం రాలేదనే చెప్పాలి.అలా పెరుగుతున్నపిల్లలను చూసి డాక్టరుగారు చాలా సంతోషపడుతుండేవారు ఇట్లోవాళ్ళలాగానే.
        ఒకవేళ ఏకారణంచేతో పిల్లలెవరైనా,ఏవయసువారైనా సరే ,కొంచం ఎక్కువగాపేచీలు పెడుతున్నారన్నా,అన్నం సరిగ్గా తినటంలేదన్నా,అస్తమానూ ఏడుస్తున్నారన్నారని చెప్పినా చాలు,అదేవిటో మాత్రని నూరి పొడిచేసి పంపేవారు. ఆమందు వేసిన వెంటనెే ఏడుపునాపేసి ,పిల్లలు చక్కగా అన్నంతినేసి ఆడుకొనేవారు.
ఆరోజుల్లో,ఈరోజులలోలా పిల్లలకు వాక్సిన్లూ, గీక్సిన్ లూ ఎమీ లేవు.హాయిగా,ఆరోగ్యంగా వున్నపిల్లలను                      , మూడోనెలలోనో, ఐదవ నెలలలోనో  అత్తారింటికి తీసికెళ్ళేవాళ్ళం.
      ఇప్పటికి కూడా రౌతులపూడిలో మేమందరం కలసి నప్పుడు మా అన్నారం డాక్టరుగారి ప్రసక్తి వస్తూనే వుంటుంది, ఆయన లేకపోయినాసరే.
            

కామెంట్‌లు