గుర్తుకొస్తున్నాయి--అమ్మ అచ్చొచ్చినగొలుసు;- సత్యవాణి కుంటముక్కుల8639660566
 మా అమ్మకు ఏడువారాల నగలేమీ లేవు. మా అమ్మమ చాగంటి శేషమ్మగారికి మా అమ్మ నలుగురాడపిల్లల్లో, మా అమ్మ భాషలో చెప్పాలంటే కడసారపుది.
మా పెద్ద దొడ్డమ్మ బాలాత్రపు సుబ్బమ్మ,చిన్నదొడ్డమ్మ పులుగుర్త నరసమ్మ,మూడవదొడ్డపేరు బుధ్ధవరపు సూర్యకాంతమ్మ,మా అమ్మ పూళ్ళ భానుమతి.
ఈ ఆడపిల్లలు నలుగురు గాకుండా,చాగంటి గోపాలకృష్ణగోఖలే,చాగంటి భాస్కర్రావుగారూ మా అమ్మమ్మ మగసంతానం.మాకు మేనమామలూను.మా అమ్మమ్మ కడసారపుకూతురు,మా అమ్మ అయిన పూళ్ళభానుమతికి ,అత్తగారైన మా మామ్మయ్య అంటే, మా నాయనమ్మ పోరుఅధికమని,మా అమ్మని, పాండురంగమహత్యం సినీమాలో,అంజలీ దేవి పడ్డకష్టాలన్నీ మా నాయనమ్మ వల్ల,మా అమ్మపడుతోందనీ,పైగా మానాన్న మా అమ్మ విషయంలో,వాళ్ళమ్మని ఏమీ అనలేక, అసలేమీ అమ్మగురించి పట్టించుకోరనీ, పైగా ఏడుగురు ఆడపిల్లలకు తల్లనీ,కడసారపు పిల్లైన మా అమ్మకు మా అమ్మమ్మ తన బంగారమంతా ఇచ్చేసిందట.వీసమెత్తు బంగారానికి వీధులకెక్కుతున్న అక్కచెల్లెళ్ళ వంటివారు కాదుకనుక, మాదొడ్డమ్మలు  కిమ్మనలేదు మా అమ్మమ్మ బంగారం విషయంలో.. పైగా మా చిన్నమావయ్య భాస్కర్రావూ, మా జగన్నాధగిరి దొడ్డ అంటే,బుధ్ధవరపు సూర్య కాంతమ్మ భర్త,మా జగన్నాధగిిరి పేద్దనాన్నగారు,డా.బుధ్ధవరపు సూర్యనారాయణగారు,మా దొడ్డతో సమానంగా,  మా అమ్మకు ఏడాదికి సరిపడే చీరలు,రవికలూ కూడా ఇచ్చేవారు. అలాగే పెద్దననాన్నగారు ఆర్మెంపీ డాక్టరు కనుక,మందుకొప్పెలూ,ఏవేవో లవణాలు,లేహ్యాలూ వైగైరా మందులు కూడా తయారుచేసి మా పిల్లలకోసం ఇస్తూంవుండేవారు.అదేదో ఎర్రగాసింధూరంలా వుండే పౌడరులో వెన్నా, పంచదారా కలిపి తినేమందు బహుబాగా రుచిగా వుండేది.లొట్టలేసుకొంటూ తినేవాళ్ళం.
    ఇకపోతే,మా నాన్నా అమ్మల పెళ్ళిలో అయిన పెద్దపెద్ద గొడవలమూలంగా,మా నానమ్మ మా అమ్మకి పిసరంత బంగారంకూడా పెట్టలేదట పెళ్ళిలో. కానీ,మా నాన్న కరణంగారు మూలంగా,  పెళ్ళితరువాత జరిగే సత్యన్నారాయణవ్రతంనాడు,ఊళ్ళోవాళ్ళు రూపాయి రూపాయి చొప్పున చదివించిన కట్టేతలలో వచ్చిన ఆరువందలరుపాయలకి,శ్రావణమాసంలో వరలక్ష్మీపూజకి మటుకు మా అమ్మకు ఇరవైకాసుల రేకు వఢ్ఢాణం చేయించిందిట.మువ్వలు పెట్టించడానికి చదివింపులలో డబ్బులు సరిపోలేదు.తనచేతి డబ్బులు వేయదు కనుక మువ్వలు లేకుండానే బెల్టులాంటి రేకు వడ్డాణం చేయించిందిట.అంతకు తప్ప మా అమ్మకు మా నాయనమ్మకానీ,మానాన్నకానీ గోరెడు బంగారం మా అమ్మకు కొనలేదంటూండేది.
       ఇక అచ్చొచ్చిన అమ్మగొలుసు విషయానికి వస్తే,మా అమ్మమ్మిచ్చిన బంగారంతో నాలుగైదుపేటల చంద్రహారం,నక్షత్రాల్లా వుండే,పెద్దపెద్ద తెల్లరాళ్ళనెక్లీసు, (మా అమ్మ అలాగే అనేదిమరి) నాలుగు మూడుజతల బంగారంగాజులు వుండేవి.
     ఇంతకీ అచ్చొచ్చినవిషయం దగ్గరకు వస్తే, మా పక్కింటి రత్నానికి, ఎన్నిపెళ్ళిసంబంధాలు చూసినా,చూసుకెళ్ళేవాడేకానీ,చేసుకెళ్ళేవాడెవడూ కనిపించక విసిగి పోయేవారు వాళ్ళవాళ్ళు..పిల్లచూస్తే,పేరుకు తగ్గట్టు రత్నంలాగే చక్కగా ఎర్రగావుండేది.ఎందుకు పిల్లనచ్చటంలేదో తెలిసేదికాదట.రత్నంనాన్నగారిని మా అమ్మ  ఆప్యాయంగా నాన్నగారూ అని పిలిచేది.ఆయనపేరు చిట్రాప్రగడ సితారామయ్యగారు.మా నానమ్మకి తమ్ముడు.మాకు పక్కఇల్లే.ఆయనకి మా అమ్మంటే చాలా అభిమానం.తన అక్కగారైన బాపనమ్మగారి ఆరళ్ళను ఓర్పుగా తట్టుకుంటోందని.అందుకని ఆయనకు ఆరుగురు కూతుళ్ళున్నా,ఆప్యాయంగా అమ్మాయ్ అని పిలిచేవారు మా అమ్మను..మా అమ్మ కోడలిగా రౌతులపూడికి వచ్చేకానే,మా రౌతులపూడికి నీటివసతి కలిగిందనీ,అంతకుముందు,జొన్నలు,గంటిలూ,కొర్రలూ తినే వారందరం వరిఅన్నం తినగలుగుతున్నామనీ ఆయనకు బాగా నమ్మకం.ఆయనకేకాదు,మా ఉరివాళ్ళలో ఆనాటివాళ్ళు చాలామంది 
 ఆమాటంటూవుంటారు .మా అమ్మ చేతి చలవ కలదనీ,బాలింతరాళ్ళకు పత్యం పేట్టడానికి పాతబియ్యం అడిగి .పట్టికెళ్ళడం,పుట్టినపిల్లలకు పక్కపరవడానికి అమ్మ పాతచీరలు అడగడం ,కళ్ళకు పెట్టడానికి కాటుక,నుదుటికి అగులుబొట్టు అడగడం అందరూ చేస్తూవుండేవారు.అమ్మ చేతిచలువమీద అదో నమ్మకం ఊళ్ళోవాళ్ళందరికీ.అతెందుకు ,ముసిలితనంతో ఏళ్ళతరబడి మంచాలు పట్టి,ఇంక బతకాలని లేక,చావుకోసం ఎదురుచూసే ముది వరుగులు,"పెద్దబుల్లెమ్మగారినడిగి ,రెండుముద్దలు తేయే!అప్పటికికానీ ఈ పాడుపానం(ప్రాణం)పోదంటూ,మా అమ్మచేతి ముద్దతిని, బాధపడకుండా,హాయిగా స్వర్గంచేరుకొన్నవాళ్ళెందరో!
  అలాగే మా అమ్మ చేతిచలువమీద నమ్మకమో ఏమో,మా సీతారామయ్యతాతగారు,అదే మానాయనమ్మతమ్ముడు,మరొక పెళ్ళికొడుకు చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మతో,అమ్మాయ్ !ఈసారి నీ గొలుసు ఒకసారి రత్నంమెడలోవెయ్యి పెళ్ళిచూపులకు అన్నారు. వాళ్ళకు నగలు లేకకాదు.ఆయనకెందుకో అలా అనిపించింది.అమ్మ తనచంద్రహారంతోపాటు,తెల్లరాళ్ళ నక్షత్రాల నెక్లీసు కూడా పెట్టింది రత్నానికి.ఆయన అడిగినవేళో,అమ్మపెట్టినవేళో తెలియదుగానీ, రత్నానికి ఈసారి తుని నుంచి వచ్చిన గన్నంరాజువారి సంబంధం కుదిరిపోయింది.రత్నానికేకాదు,బొల్లెంకమ్మ  పెద్దకూతురు నాగరత్నానికి కూడా ఎన్నేళ్ళకూ పెళ్ళికుదరకపోతే, ఓసారి సంబంధం వచ్చినప్పుడు, "బుల్లెమ్మగారూ!ఓసారి మీగొలుసు ఇవ్వండి.మా నాగర్నాన్ని చూసుకోడానికి వచ్చారు అనిఅడిగి గొలుసు పట్టికెళ్ళింది.అలాపెళ్ళివాళ్ళు చూడడం,ఇలా పెళ్ళికుదరడం జరిగిపోయింది. బొల్లెంకమ్మ చిన్నకూతురు సూర్యాకాంతంపెళ్ళి విషయంలోకూడా అలాగే జరగటంతో,మా అమ్మగొలుసుకి 'అచ్చొచ్చిన గొలుసనే' పేరొచ్చేసింది ఊళ్ళో. 
       అదిగో అలా అమ్మ గొలుసు అచ్చొచ్చిన గొలుసైపోయింది. పేద సాదా,అన్న తేడాలు లేకుండా, కులం మతం అన్న తేడా లేకుండా,ఎందరెందరి  ఇళ్ళకువెళ్ళిందో అమ్మ గొలుసు! ఎందరెందరి పెళ్ళిచూపులకు  పెళ్ళికూతుర్ల మెడలను అలంకరించిందో!ఎన్నెన్ని,పెళ్ళిళ్ళు కుదిర్చిందో లెక్కలేదు ,అమ్మ అచ్చొచ్చిన చంద్రహారం..అదే మాఅమ్మమ్మ చాగంటి శేషమ్మ తన కడసారంపిల్లైన,మా అమ్మ భానుమతికి ఇచ్చిన అపురూపహారం.
    

కామెంట్‌లు