గుర్తుకొస్తున్నాయి-- బ్యాంకు వరలక్ష్మి;--సత్యవాణి కుంటముక్కుల 8639660566

   కాకినాడ భానుగుడి జంక్షన్ కొచ్చి వరలక్ష్మి లేదా, వరాలమ్మ ఎక్కడుంటుంది అని అడిగితే,వారిమొఖంమీదన ఒక్కసారి పువ్వులా నవ్వు వెల్లివిరిసి, వారికిపక్కనున్న,లేక ఎదురుగావున్న ఒక బ్యాంకిని చూపించి ,"ఇంకెక్కడుంటుంది వరాలు?ఆఫలానా బ్యాంకిలో వుంటుంది ."అని చటుక్కున చెపుతారు.
     ఆ ఫలానాబ్యాంకు ఆఫీసు స్టాఫ్ కీ, కష్టమర్లకు వరలక్ష్మి పేరు నాలుకచివరనుంటుంది.
     ఆబ్యాకులో వరలక్ష్మి ఎప్పుడుచేరిందో ,ఆమె అక్కడచేసే అటెండరు,కమ్ సర్వెంట్ మెయిడ్ ఉద్యోగం
గవర్నమెంటు నియామకమో కాదోకూడా,ఎవరికైనా తెలుసునులేదోకానీ ,నాకుమాత్రం తెలియదుకానీ ,బ్యాకి షట్టరు ఎత్తిందిమొదలు,దించేదాకా బ్యాంకిలోనే వుంటుంది."వరాలూ"అనో,"వరలక్ష్మీ !"అనో ఎవరో ఒకరు ఎందుకోఅందుకు ఆమెని పిలుస్తూనే వుంటారు.విసుగూ విరామం లేకుండా బొంగరంలా తిరుగుతూనేవుంటుంది.
      ఇప్పుడు బ్యాంకిలో పనిచేసేవార్ల పేర్లూ,వాళ్ళ పెళ్ళిరోజులు,వాళ్ళవాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఆమెకచ్చాలోవుండే డైరీలో రాయబడివుంటాయి.ఇప్పుడు చేస్తున్నవాళ్ళవేకాదు,ఇంతకు ముందు చేసి వెళ్ళిపోయినవాళ్ళ వివరాలన్నీ కూడా ఆ డైరీలో వుంటాయి.చెపితే ఆశ్చర్యంగా వుంటుందిగానీ,ఆ బ్యాంకి స్టాఫ్  ఫోను నంబర్లతోపాటు ,మూడొంతులమంది కష్టమర్ల పుట్టినరోజు,పెండ్లిరోజు,వాళ్ళపిల్లల పుట్టినరోజుల విషయాలు ఫోన్ నంబర్లసహా డైరీలో వుండడమేకాదు నోటి చివరనుంటాయి. 
     ప్రతిరోజు ఉదయాన్నే, చీరకచ్చాలో గలగల్లాడేలా,ఇంత చిల్లరవేసుకొని,ఆ రోజు ఎవరెవరి,పుట్టినరోజులో,పెళ్ళిరోజులో వాళ్ళందరికీ క్వాయిన్ బాక్స్ నుంచి చకచకా ఫోన్ల్ చేసి విష్ చేసేస్తుంది.అలాగే ఆ కచ్చాలో చాక్ లెట్స్ కూడా వుంటాయి ఎప్పుడూ.  బ్యాంకికి వచ్చినవారిలో ఆరోజు పుట్టినరోజు వాళ్ళో ,పెళ్ళిరోజు వాళ్ళో తనకు తెలిసినవారు వస్తే,చక్కగా విష్ చేసి,చేతిలో చాక్ లెట్ పెడుతుంది. అయితే "పుట్టినరోజనో,పెళ్ళిరోజనో ఫోన్ చేస్తే కొందరు విసుక్కుంటారనుకో శారదా! అలాని తెలిసుండీ విష్ చేయడంఎలా మానగలను?"అని వరాలు అన్నప్పుడు ఆమెను చూస్తే జాలేస్తుంది.అప్పుడప్పుడు నా గూప్పెట్లోకూడా విషయం ఏమీ లేక పోయినాసరే, గుప్పెడు చాక్లట్లు పెట్టి గబుక్కున వెళ్ళిపోతుంటుంది.
       ఈవరలక్ష్మి,అదే, వరాలు మాకైతే ఇంచుమించుగా నలభై ఐదేళ్ళ పైగానే తెలుసు. ఎలాగంటే అప్పుడు మా కాకినాడకి సిటీ బస్ లువుండేవి. నం.ఒన్ లూ, నంబరు ఫైవ్ లూ,నంబరు టూలూ. ఆ సిటీ బస్ ల్లోనే వరాలు పరిచయం. ట్రాఫిక్ ఇనస్పేక్టర్లకు ఇచ్చినంత విలువిచ్చేవారు సిటీబస్ డ్రైవర్లూ ,కండక్టర్లూ వరలక్ష్మికి.వరాలు చెయ్యెత్తిందంటే ,బస్ ఆగి తీరాల్సిందే. కండక్టర్లప్రక్కన కూచుని కబుర్లు చెప్పి నవ్విస్తుండేది. కండక్టర్లే కాదు, పాసింజర్లూ నవ్వుల్లో మునిగి పోయేవారు.కిక్కిరిసిన బస్ ల్లో వరలక్ష్మి కనిపిస్తేచాలు,ఒకరినొకరు తోసుకోడాలు,తిట్టుకోడాలూ వుండేవికాదు.ఎందుకంటే ,వరాలు మాటలు మిస్సవుతామని.
          అదిగో అలాంటి సమయాల్లోనే, కాలేజీ అమ్మాయిలను "కవితా!శారదా! ఏకాలేజీలో చదువుతున్నారు?"అంటూ కాలేజీ అమ్మాయిలతో స్నేహం కలిపేది. మొదట ఆమె మాటలకూ, చొరవకూ అమ్మాయిలు భయపడ్డా,తరువాత బాగా అలవాటైపోయి, ఆమె బస్ లోకనిపించక పోతే,హీరోయిన్ లేని సినీమాచూసినట్టు   ,బోర్ ఫీలైయ్యేవారు.                         ఇక ఆమె కట్టుబొట్టు విషయానికి వస్తే,మోకాళ్ళపైకి మడచి గొచీపోసికట్టుకుంటుంది. అది చీరో ,లంగా ఓణీయో తెలియదు.వదులుగా,బురకాలావున్న రవిక,మెడలో ఒక సిల్వర్ గొలుసు ,చేతికి మటుకు ఒకటో రేండో గాజుగాజులు,ఒత్తైన జుట్టును అస్తమానూ దులిపి వేలుముడి వేసుకొంటుంది. బొట్టుపెట్టుకోగా ఎపుడూ చూడలేదు..అంతేగానీ,వేరే అలంకరణ ఏమీ చేసుకోగా ఎప్పుడూ చూడలేదామెని.చామనఛాయకంటే పైనే రంగుగా వుంటుంది .
     తనలో తను గొణుక్కుంటుందిగానీ,అదేమీ పైకి వినిపించదు.ఆడవాళ్ళైనా,అమ్మాయిలెవరైనా సరే, ,వాళ్ళుతనకు నచ్చితే, తెలిసుండవచ్చు,తెలియకపోవచ్చు,అందర్నీ "కవితా!"అనో "శారదా!" అనో ఎంతో ఆత్మియంగా,బాగా తెలిసివున్నట్లు మాట్లాడుతుంది.మళ్ళిీ ఏవరినీ,సావిత్రనో,వాణిశ్రీ అనో వేరే వేరే తారలపేరులతోమటుకు పిలవదదేమిటో. పైగా మనని మొదట ఏ పిలుపుతో పిలుస్తుందో అదేపిలుపు తో పిలుస్తుంది.శారదా అని పిలిస్తే శారదే, కవితా అని పిలిస్తే కవితే.మగవాళ్ళను అయితే చాలామందిని "తమ్ముడూ!"అనేపిలుస్తుంది.మళ్ళీ "అన్నా!"అనిఎవరినీ పిలచినట్లు వినలేదు.
       వరాలు చాలా తెలివిగా,చమత్కారంగా,హాస్యంగా మాట్లాడుతుంది.ఒకసారి నేను,"అవునుగానీ వరాలూ!అంత వదులుగా జాకట్ వేసుకొంటావెందుకు?చక్కగా టైట్ గా కుట్టించుకోకూడదూ?"అంటే,సిగ్గుపడుతూ,మీబావొప్పుకోడు.జాకెట్టు బిగుతుగా వుంటే ఆయనకు నచ్చదు శారదా!."అంది.దాని సిగ్గుచిమడ,దాని సిగ్గుమాట ఏలావున్నా,నాకు చచ్చేసిగ్గేసింది. ఇంతకూ అసలా బావగారనేవాడు అసలు ఆమెను మెచ్చి ,ఎపుడన్నా వచ్చాడో లేదో,వస్తే, ఇపుడున్నాడో లేదో ఆబ్రహ్మక్కూడా తెలియదు.ఒకసారి చాలా రోజులతరువాత  వరాలూ నేనూ తారసపడ్డాం బ్యాంకికి దగ్గరలో."నన్నుచూసి గబగబా వచ్చి,"అదేంశారదా?చాలారోజులనుండి కనిపించటంలేదు. అమ్మానాన్నా,కవితా (అంటే మాచెల్లెలు మణి)వాళ్ళూ బాగున్నారా?"అని అడిగింది.నిజానికి అంతకు కొన్నిరోజులముందుగానే మానాన్న పోయారు.ఆవిషయం చెప్పానామెకు బాధపడుతూ"అవునా ?నాన్న పోయాడా? ఇంతకీ విల్లులో నాపేర్న ఏమైనా ఆస్థిరాసిపోయాడా?రాయకుండా పోయాడాకొంపదీసి?"అంది.అంతదుఃఖంలోనూ నవ్వువచ్చిందినాకు.
    ఇంతకూ ఎవరైనా కొత్తవాళ్ళు మగవాళ్ళు,ఆమెని తక్కువగా అంచనావేసి, ఆకతాయతనంగా ఆమెతో మాటకలపాలని చూసారో,వాళ్ళు చచ్చేరన్నమాటే.వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకూ తీసికెళ్ళి వదిలిపెడుతుంది.
      వరాలు జ్ఞాపక శక్తి ఒక అధ్భుతం,అమోఘం. ఆమె ఎన్టీ ఆర్ ఫావరేటు. ఎన్ .టి. రామారావు  నటించిన మొదటి సినీమా నాదేశంనుండీ,అది ఏవంవత్సరంలో వచ్చిందో ,అలాగే అతడి సినీమాలు,  ఏ ఏ సినీమా,ఏ సంవత్సరంలో వచ్చిందో కంఠో పాఠంగా చెపుతుంది అదీ తనకు నచ్చినవాళ్ళడిగితేనే. ఎన్ .టి.రామారావు  అడవిరాముడు సీనీమా  శతదినోత్సవ వేడుకకు కాకినాడ వచ్చినప్పుడు, వరలక్ష్మిని స్టేజిమీద రామారావుగారి దగ్గరకు తీసికెళ్ళి,ఆయన సినీమాల లిష్ట్  చదివింపించారట వరక్ష్మిచేత. ఆయన ఆమె అనర్గళంగా ఆపకుండా, క్రమం తప్పకుండా చెపుతుంటే, నిర్ఘాంతపోయేడట.అయితే ఆమె ప్రతిభకి మెచ్చి ఏవైనా కానుకలిచ్చాడా లేదా అన్నది మటుకు నాకుతెలియదు
      ఒకసారి కనపడినప్పుడు వేలికి ఒక బంగారు ఉంగరం పెట్టుకొని చూపించింది. "శారదా!నేను మొన్న రిటైరైపోయినప్పుడు. ఆఫీస్వాళ్ళందరూ ఈ ఉంగరంచేయించి పెట్టారు. నేను రిటైర్ అయినవిషయం పేపర్లోకూడా వచ్చింది .నువ్వు చూసావా?"అని సంబరపడుతూ అడిగింది.
    "అయ్యో!అప్పుడే రిటైరై పోయావా? మరెలా ఇప్పుడు ?"అని అడిగితే, నేను రిటైర్ అయిపోయానని బ్యాంకికి వెళ్ళకపోతే, అక్కడ పనులెలా జరుగుతాయి శారదా! నాకు రిటైర్ మెంట్ ఎమిటి?" అంది. నిజమే! పొద్దుట పావుతక్కువ ఎనిమిదికి భానుగుడి జంక్షన్ బ్యాంకి దగ్గర గనక  చూస్తే, ఇంకొక సర్వెంట్ మెయిడ్ అమ్మాయితోకలిపి, బ్యాకి షట్టర్ పైకెత్తుతూ కనిపిస్తుంది వరాలు అని పిలువబడే వరలక్ష్మి.
    ఆమె ఆనవాళ్ళు అన్నీ చెప్పేనుగదా అని గబుక్కున వెళ్ళి పలకరించేరుగనక వరాలూఅంటూ,ఆమె మూడ్ కనుక బాగ్ లేకపోతే మీపని అయ్యిందే!
   
          
కామెంట్‌లు