గుడ్డేలుగు బల్గం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445

  చిత్రంగా ఉంది కదూ ఈ పుస్తకం పేరు! తెలంగాణాలో కొన్ని చోట్ల ఎలుగుబంటిని గుడ్డేలుగు అంటారట! మరి బల్గం అంటే బలము లేక దాని దండు అని చెప్పవచ్చని రచయిత పైడిమర్రి రామకృష్ణ గారు తన ముందు మాటలో చెప్పారు.
       ఒక బాలసాహిత్య రచయిత ఏక బిగిన చిన్న పిల్లలకు కేవలం 29 జంతు కథలు వ్రాయటమంటే ఆయన సృజనాత్మకతను తప్పక మెచ్చుకోవాలి.
       ఈ కథల్లో చాలా మటుకు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవే! కథలన్నీ చాలా సులభంగా చిన్నవిగా,తియ్యగా ఉంటాయి!
      తరచి చూస్తే ప్రతికథ ఒక నీతిని లేక ఆలోచనను తెలుపుతుంది.కొన్న్ని కథల్లో సైంటిఫిక్ టచ్ కూడా ఉంది! ఉదాహరణకు 'శాకాహారం','మృగరాజు సలహా' వంటికథల్లో విటమిన్ల ఆవశ్యకత, చెట్ల పెంపకం గురించి పిల్లలకు తెలియచెబుతాయి! అందరి మధ్యలో తిరగాలి తగినంత జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే విషయం 'లోకజ్ఞానం' అనే కథ చెబుతుంది.
       రామకృష్ణ గారికి 450 కథలు వ్రాసిన అనుభవం ఉంది.అందుకే ఆయన U-Tubeలో బాల సాహిత్యం మీద, అనేక బాల సాహిత్య రచయితల పుస్తకాల మీద తనదైన కోణంలో విశ్లేషిస్తుంటారు.ప్రతి బాల సాహిత్య రచయిత అవి వినదగినవే!
       ప్రతి కథకీ తుంబలి శివాజీ వేసిన చిత్రాలు ఎంతో బాగున్నాయి.చెట్లను పాతవలసిన,కాపాడవలసిన భాధ్యత చిన్న పిల్లలకు తెలియ చెప్పాలనే విషయం 'బుజ్జి ఏనుగు-బుల్లికోతి' కథలో తెలుస్తుంది.
       ఈ పుస్తకంలో ఈ చిన్న కథలను పిల్లలకు సులభంగా చెప్పవచ్చు,చెప్పి వాటిలో అంతర్లీనంగా దాగిన నీతిని కూడా వివరించవచ్చు.
      ప్రతి ఇంట్లో ఉండదగిన పుస్తకం ఇది.ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఈ పుస్తకం ఉంచి పిల్లల చేత చదివిస్తే మంచిది.
       పైడిమర్రి రామకృష్ణ గారు హైదరబాద్ లో ఉంటూ, ఒక సంస్థలో పనిచేస్తూ ప్రవృత్తిగా బాల సాహిత్యాన్ని కొన సాగిస్తున్నారు.
       ఈ పస్తకం వెల 80 రూపాయలు.68 పేజీలు.పుస్తకం కావాలనుకునే వారు పైడిమర్రి గారిని సంప్రదించవచ్చు(cell 9247564699).పుస్తకం 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం' వారి ఆర్థిక సహాయంతో ముద్రించబడింది.మంచి ముద్రణ, మంచి పేపరుతో పుస్తకం అందంగా అలరారుతోంది.
చదవండి,చదివించండి.
       **********

కామెంట్‌లు