ప్రక్షాళనం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  విశేషపురం రాజు విజయసింహునికి అప్పుడప్పుడు వింత ఆలోచనలు వస్తుండేవి! అటువంటి ఆలోచనే బలహీనుల సమావేశం ఏర్పాటు చేయడం! రాజ్యంలో ఉన్న శారీరక బలహీనులందరినీ తన కోట దగ్గర ఉన్న మైదానంలో  సమావేశ మవుతే వారిని పరీక్షించి వైద్యులు తగిన సలహాలు ఇస్తారని చాటింపు వేయించాడు.
      రాజుగారి పిలుపుగనుక శారీరక బలహీనులు మైదానానికి వచ్చారు.రాజుగారి ఆస్థాన వైద్యులు బలహీనత పోవడానికి తగిన చిట్కాలు చెప్పి మందులు కూడా ఇచ్చారు.చిత్రంగా ఆ సమావేశానికి కండలతో ఉన్న బలవంతులు కూడా వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి, " మీ ఆరోగ్యం బాగానే ఉంది,మరి మీరు ఎందుకు వచ్చారు?" అని అడిగారు.
      "భవిష్యత్తులోబలహీనత రాకుండా మీ చిట్కాలు పాటించేందుకు" చెప్పారు వారు.వారి మాటలు విని వైద్యులు సంతోషించి తగిన సూచనలు ఇచ్చి పంపారు.
       మరి కొద్ది కాలానికి  రాజుగారికి మరొక ఆలోచన వచ్చింది.రాజ్యంలో పాపం చేసినవారందరూ మైదానంలో సమావేశం అవుతే రాజగురువు తగిన సూచనలతో వారి పాపాలను ప్రక్షాళనం చేస్తారని చాటింపు వేయించాడు.
      చిత్రంగా మైదానానికి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు,మరి ఇతరులెవ్వరూ రాలేదు! రాజుగారు తన రాజ్యంలో పాపు లెవ్వరూ రాలేదని ఆశ్చర్య పోయాడు.వచ్చిన వ్యక్తిని "ఏంపాపం చేశావు?" అని అడిగాడు.
     ఆ వ్యక్తి దిగులుగా, " నాతల్లి బతికి ఉన్నప్పుడు ఒక విషయంలో ఆమెను విసుక్కున్నాను,అదే నేను చేసిన పాపం" అని చెప్పాడు.
      తల్లి మీద ప్రేమకు రాజు ఆశ్చర్య పోయాడు.
      రాజుగారితో ఉన్న రాజగురువు ఏవో మంత్రాలు జపించి," నీ పాపం ఈరోజుతో ప్రక్షాళనమై పోయింది,నీవు సాధ్యమైనంతవరకు వయసు మళ్ళిన వాళ్ళకు సహాయం చాలు" అని చెప్పి పంపివేశాడు.
       "అప్పుడు బలహీనులను పిలుస్తే ఎక్కువ మంది వచ్చారు,పాపులను పిలుస్తే ఒకడే వచ్చాడేమిటి?" అని రాజ గురువును అడిగాడు.
      "అది మానవ నైజం శరీరానికి రోగంవస్తే జనం వైద్యంకోసం,అదిగాక ఉచిత వైద్యానికి పరుగెత్తుతారు. చేసిన పాపం నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని తమ పాపాలను గురించి ఎవరితో చెప్పుకోరు.కానీ తల్లిని విసుక్కున్న వ్యక్తి అసలు పాపినే కాదు,అతని పశ్చాత్తాపంతో అతని పాపం ప్రక్షాళనం అయిపోయింది,అందుకే అతని తృప్తికొరకు వయోవృద్ధులకు సేవ చేయమని చెప్పాను" అని చెప్పాడు రాజగురువు.
       అప్పటినుండి రాజ్యంలో ఈ   విషయాలమీద  విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజలలో వైద్యపరంగా,పాపాలు పరంగా కొంతమార్పు వచ్చింది.
             ********

కామెంట్‌లు