:అమ్మ;---లతా శ్రీ9666779103
 అనురాధ లక్ష్మి రాజేష్ ల గారాల పట్టి ,కొత్తగా పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఒక్కతే కూతురు కావడంతో కష్టమనేది తెలియకుండా పెంచారు దాంతో చాలా పెంకి గా తయారైంది. అన్వేష్ అను భర్త. చాలా నెమ్మదస్తుడు . పెళ్లయిన వారానికి వేరు కాపురం వెళ్లాలన్నా అనురాధ పట్టుదలతో బెంగళూరులో అద్దెకు ఇల్లు తీసుకున్నాడు .సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న అన్వేష్ కి సంపాదన బాగానే ఉంది. అనురాధ ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ చూపకపోవడంతో తనను బలవంతం చేయలేదు ఎప్పుడు చూసినా సెల్ పట్టుకు కూర్చునేది ఇంట్లో పనులు పట్టించుకునేది కాదు సమయానికి వండి కూడా పెట్టేది కాదు. అయినప్పటికీ సహన వంతుడైన అన్వేష్ ఏమీ అనలేక నిట్టూర్పు సెగలు వెళ్ళగక్కుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇలా ఉండగా అనురాధ నీళ్లోసుకుంది. ఇక చూడు అప్పటి నుండి మంచం దిగేది కాదు ప్రతి చిన్న విషయానికి గొడవ పడేది.అన్నీ చీత్కారాలే..పెడసర సమాధానం చెప్పేది. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి సర్దుకుపోయే వాడు రోజురోజుకు ‌అనురాధ గొంతెమ్మ కోరికలు తీర్చ లేక తనకు మేలుకొలుపులు పాడలేక నానా అవస్థలు పడే వాడు. ఇలా ఉండగా లక్ష్మీ రాజేష్ లు తన బిడ్డను చూసి పోదామని బెంగళూరుకు వచ్చారు. అనురాధ అన్వేష్ ల మధ్య ఏదో వెలితి ఉందని లక్ష్మి గ్రహించింది. అల్లుడు టిఫిన్ ఆర్డరు చేయడం మధ్యాహ్నం భోజనం జొమాటో లో ఆర్డర్ చేయడం గమనించింది .ఇంత చేస్తున్న కూతురు మంచం దిగకుండా ఫోన్లో గడపడం విచిత్రంగా అనిపించింది పైగా అతని పైన కేకలు వేయడం అంత సబబుగా తోచలేదు. అదే విషయం చిన్నగా కూతురుతో కదిపింది. మంచివాడని బాగా సంపాదిస్తున్నాడు అని పెళ్లి చేసి అనవసరంగా నా గొంతు కోశారు అమెరికా సంబంధం చేయమంటే నన్ను వదిలి ఉండలేను అని నానా యాగీ చేసి ఎన్నో పోరాటాలు నాపై ప్రకటించి చివరకు మీరు అనుకున్నట్లు ఇతనితో పెళ్లి చేశారు అంటూ గయ్ మంది. ఒక ముద్దు లేదు ...ముచ్చట లేదు... నా ఫ్రెండు రవళిని చూడు నౌకర్లు చాకర్లు తో మహారాణిలా ఉంది .అలా సరదాగాఊటి కొడైకెనాల్ వెళ్ళొద్దాం అంటే వాళ్ళ చెల్లెలు చదువుల బాధ్యత తనపై ఉందట. వృధా ఖర్చులు పెట్టలేడటా..పెళ్ళాం సరదా తీర్చలేని భర్తకూడ భర్తేనా అంటూ మూతి విరిచింది. అంతా విన్న లక్ష్మి కి తన కాళ్ళ కింద భూమి కంపించి నట్టు అనిపించింది నా బిడ్డవు కనుక నిన్ను ఏమీ అనలేకున్నాను. ఒక బిడ్డ వని గారాబం చేసి తప్పు చేశాను అనిపిస్తుంది. మేము పడిన కష్టాలు జీవితంలో నిలబడడానికి చేసిన ఎన్నో పోరాటాలు నీకు తెలియకుండా దాచి పొరపాటు చేశాను. మేము కర్షకులం రెక్కాడితేగాని డొక్కాడని మేము పడిన శ్రమ,పాడిన శ్రమ గీతాలు నీ చెవిన చిన్నప్పుడే పడి ఉంటే నీకు మనిషి విలువ ,మనసు విలువ తెలిసి ఉండేది. నీవు రవళి సంపద మాత్రమే చూస్తున్నావ్ తన భర్త పెట్టే హింస గురించి నీకు తెలియదు .అనూ! దూరపు కొండలు నునుపు గానే కనబడుతాయి. నీవు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఒక్క మాట కూడా నిన్ను అనకుండా చూసుకుంటున్నా నీ భర్త స్థానంలో కాసేపు నిలబడి ఆలోచించు. చుట్టుపక్కల ఆడవాళ్ళని గమనించావా ఉదయం లేచి ఎన్ని పాట్లు పడుతున్నారో. అర్థం చేసుకో నీ భర్త హృదయంలో నీవే రాణివి డాబులకు పోయి పచ్చని సంసారాన్ని పాడు చేసుకోకు. నిన్ను సంతోషంగా ఉంచడం కోసం నీ భర్త ఎంత బాధను దిగమింగుతున్నాడో ఆలోచించుకో. తల్లిని నీ మంచి కోసమే చెప్తానని అర్థం చేసుకో అంటూ అనునయంగా చెప్పడంతో అనురాధ ఆలోచనలో పడింది. భార్య ప్రవర్తన లో వచ్చిన మార్పు చూసి అన్వేష్ ఆనందించాడు అత్తమామలకు మనసులోనే నమస్కరించాడు.
సి.హేమలత

కామెంట్‌లు