తప్పక చదవాలి కేవలం నువ్వే!;-- యామిజాల జగదీశ్--ఫోన్ : 9959839446
 ఆకాశం గొడుగులా ఉన్నట్లు
ఉంటుందో కానీ శూన్యం
సూర్యుడిని, చంద్రుని, చుక్కల్ని 
అతికించుకుని ఉన్నట్లు కనిపిస్తుంది
నువ్వు కూడా అంతేనా?
అనే పంక్తులతో ముగిసిన కేవలం నువ్వే అనే కవితల పుస్తకం చదువుతుంటే నన్ను నేను ప్రశ్నించుకుంటున్నట్టు, నాకు నేను జవాబు చెప్పుకుంటున్నట్టు, నన్ను నేను సమర్థించుకుంటున్నట్టు, నాకు నేను కొన్ని సూచనలు చేసుకుంటున్నట్టు అనుభూతి చెందాను. బహుశా ఈ పుస్తకం చదివే ప్రతి పాఠకుడూ అలానే ఫీలవుతాడని నా అభిప్రాయం.
వాడ్రేవు చినభద్రుడు చిత్రించిన చిత్రాన్ని ముచ్చటగా సింగారించుకున్న కేవలం నువ్వే కవితా సంపుటి రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణి. మొత్తం ఆరు ఖండికలైన నువ్వు నేను, నీతో నేను, నాలో నేను, కేవలం నువ్వే, సమాజంలో నేను, మహిళగా నేనులతో కూడిన ఈ పుస్తకంలో మొత్తం 264 చిన్న చిన్న కవితులున్నాయి. కవితల పరమాణపరం చిన్నవి కావచ్చు కానీ వాటిలోని భావాలన్నీ ఘనమైనవి. మనసుని నిలదీస్తాయి. మనసుని నడిపిస్తాయి. మనసుకి రెక్కలిచ్చి ఎగరనిస్తాయి. మనసుకి ఊరటనిస్తాయి. ఎన్నెన్ని భావాల సమాహారమో చెప్పలేను.
ఏ పేజీకా పేజీ ప్రధానమే....ప్రతి పేజీలోనూ ఓ వెలుగు కనిపిస్తుంది.
పుట్టినిల్లేమో రైతువారీ కుటుంబనేపథ్యం కలిగిన వసుధారాణిగారి మెట్టినిల్లేమో న్యాయవాదుల నేపథ్యం.  రాజారామ్మోహన్ రాయ్ కన్నా ముందుగా భారతదేశంలో ఆత్మకథ వ్రాసిన (చేతివ్రాత) వ్యక్తిగా పేరుప్రతిష్ఠలు గడించిన వెన్నెలగంటి సుబ్బారావు గారి వంశమే వీరు మెట్టినిల్లు.
రాణెమ్మ కథలతో తనకంటూ ఓ గుర్తింపు పొందిన వసుధారాణిగారి జీవితానికి సాహిత్యానికి తొలి గురువు ఆమె మాతృమూర్తే. అందుకే అమ్మకే ఈ కవితాసంపుటిని అంకితం చేసిన రచయిత్రి అంతులేని ఆలోచనలను మొదట ప్రశ్నలుగా మార్చుకుని చిన్నగా తనలో తాను సమాధానాలు వెతుక్కుంటూ కలంపట్టారు. ఈమెను ఠాగూర్, చలం గీతాంజలి వంటివి ప్రభావితం చేసాయి. 
జీవితం, కవిత్వం విడదీయలేనంతగా ఆమెలో కలిసి ప్రవహించి పాఠకుడి చేతులకి ఓ మంచి కాన్కగా చేరిందే "కేవలం నువ్వే" కవితా పుస్తకంలోంచి కొన్ని కవితలు....
నేను నీకు  ఒక పూలమాలని అర్పించి పొంగిపోయాను
నీవు నాకోసం పూలతోటనే సృష్టించావు
అడవిపూలలో సుగంధం నింపి పంపావు నాకొరకై
నీవు నా సత్కారాలకై చూస్తావని అనుకోవటం నా అవివేకమంటావా?
నాకోసం ఇంత ఇచ్చిన నీకు మనసైనా అర్పించనీ
ఇవ్వటం నీకేనా? నాకూ తెలుసు...
.......
నువ్వొచ్చాక నాకు వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు
నాకు నేను 'గతం' అయ్యాను అంతే
......
హృదయాన్ని బయటకు తీసి
నీ పక్కన ఉంచాను
స్వీకరించక పోయినా పర్వాలేదు
కాలరాయకు ప్రియా
.........
నీవున్నప్పుడు ఊసలాడ మాటలు రావు
నీవు లేనపుడంటావా చాలా చెప్పాలనిపిస్తుంది
మొత్తానికి మౌనం మన మధ్య కొత్త వారధి ఇప్పుడు
........
సంతోషం దుఃఖం
కోపం విచారం
ప్రేమ ద్వేషం
అన్నీ మనసు
ఊదుకునే గాలిబుడగలే
.........
అన్నిటా నీవు ద్వంద్వాలే సృష్టించావు కానీ
కొన్నిట మేము ఇంకా ఎక్కువగానే విడిపోయాము
--------
పోగొట్టుకున్న చోటనే
వెతుక్కోమన్నారని
నేను నాలోనే
వెతుక్కుంటున్నా
మరి నేను పోగొట్టుకున్నది
నన్నే కదా
---------
ఇస్తూ పోతే బాగానే
ఉంటుంది
హృదయాన్నీ ప్రేమనీ దయనీ
అయితే
తీసుకోవడమైనా
రావాలి కదా
నీకైనా
--------
ఇలా ఆమె మాటలు చెప్పుకుంటూ పోతే మొత్తం పుస్తకాన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కనుక ప్రతి కవితా ప్రియుడే కాదు మంచి మాటలు చదివి హాయిగా ఫీలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ "కేవలం నువ్వే"ని చదవాలి.
పుస్తకంలో అక్కడక్కడా కనిపించే రత్న పోచిరాజు గారి చిత్రాలు మనసుని హత్తుకుంటాయి వసుధారాణి భావాలలాగే. 
ప్రతులకు : వెన్నెలగంటి విజయ శ్రీనివాసమూర్తి
ధర : రూ. 350

కామెంట్‌లు