ఉమ్మ నీటిలో చిమ్మ చీకటిలో తొమ్మిది నెలలున్న నీకు ఇదొక లెక్కా?
నడక నేర్చు సమయాన పలుమార్లు కిందపడి లేచిన నీకు ఇదెంత?
చదువులు, ఉద్యోగాల పేరిట ఎత్తుపల్లాలను చూడలేదా?
వరదలు, భూకంపాలు ముంచెత్తిన వేళ వాటికి ఎదురొడ్డి నిలవలేదా?
ఎన్ని ఆటుపోట్లను ఎదిరించలేదు
ఎన్ని కష్టాలను దాటలేదు
ఇప్పుడెందుకు ఇంత దుఃఖం
ఎందుకంత నిరాశ నిస్పృహ
పడినా లేచే కెరటమే నీకు ఆదర్శం
అస్తమించినా ఉదయించే సూర్యుడే ప్రోత్సాహం
లే లే భయాలు వీడు అపోహలు వదులు
కరోనా రక్కసికి నీ మనోధైర్యమే మందు
నీ మానసిక శక్తియే నీ శరీరానికి రక్ష
నీ ఊపిరికి ఆయువుపోసేది నీ వజ్ర సంకల్పమే
నీ తెగువే నీ సత్తువ
నీ గుండె నిబ్బరమే రోగానికి శిక్ష
ఒక్కసారి నిన్ను నీవు పరికించు
ధైర్యంగా కరోనాని ఎదిరించు
గెలిచి నువ్వెంటో నిరూపించు
ఉక్కు సంకల్పంతో బతికి సాధించు
*********************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి