ఓ చెట్టు విన్నపం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మానవా ఓ తెలివైన మానవా
మేము ఏమి అపకారం చేశామయ్యా
మా జీవితాలతో ఆటలేలాగయ్యా
మీతోడుగా మహిలో జీవించనీయవయ్యా

ఆకులనుకోసి మాబతుకులు చిధ్రంచేస్తావా
ఆరోగ్యమని కూరలుచేసుకొని తింటావా
ఆహారంగా మీపశువులకు మేపుతావా
అయినా అర్ధంచేసుకొని చిగురిస్తున్నా

కొమ్మలను ఎదగకుండా కత్తిరిస్తావా
పొయ్యిలో పెట్టుకొని బూడిదచేస్తావా
గుంజలుగావాడి మాపైబరువులేస్తావా
అయినా కొత్తపిలకలుకొమ్మలు పుట్టించుకుంటున్నా

పూలను తెంచుతావా
పడుతుల తలల్లో తురుముతావా
పరమాత్ముని పూజల్లో వాడుతావా
పట్టించుకోకుండా మళ్ళీమళ్ళీ పూస్తున్నా

పండ్లను తెంపుకుంటావా
ఆరోగ్యమని తింటావా
ఆకలి తీర్చుకుంటావా
అయినాకాచి విత్తనాలై విస్తరిస్తున్నా

మానుతోసహా నరికేస్తావా
మావేళ్ళతోసహా పెకిలిస్తావా
మాప్రాణాలు తీసేస్తావా
మరలా ఎరువై మొక్కనై పుట్టుకొస్తున్నా

పక్షులకు నివాసమిస్తున్నా
పశువులకు నీడనిస్తున్నా
పయోధరాలను పిలిచి వానలు కురిపిస్తున్నా
ప్రేమించి మమ్ముపెంచవయ్యా మానవా

అరణ్యాలను అంతంచేస్తున్నావు
ఆవాసాలు కట్టుకొంటున్నావు
ఆహారపంటలు వేస్తున్నావు
ఆలోచించి అర్ధంచేసుకొని నడుచుకో మానవా

ప్రకృతిని పరవశింపజేస్తున్నాం
పుడమికి పచ్చదనమిస్తున్నాం
ప్రాణులతో కలసిమెలసిజీవిస్తున్నాం
ప్రాణవాయువును వ్యాపిస్తున్నాం

మానవులారా
మహిలో తెలివైనవారా
మమ్మలను బూడిదచేయకయ్యా
మమ్ము మట్టిలోకలపకయ్యా

ఆలోచించు మానవా
అడుగులు జాగ్రత్తగావెయ్యవయ్యా
అవనిని కాపాడుకుందామయ్యా
అందరంకలసి మనుగడసాగిద్దామయ్యా


కామెంట్‌లు