తమిళ సినిమాలో తొలి గాయకుడు తిరుచ్చి లోకనాథన్;-- యామిజాల జగదీశ్
 జీవితంలో తత్వాలను ఆయన గొంతులో వింటే జీవిత పాఠాన్ని చెంపలపై కొట్టి నేర్పుతున్నట్టు అన్పించక ముద్దుగా చెవులు మెలేసి చెప్తున్నట్టు అన్పిస్తుంది. అలాంటి వశీకరమైన స్వరం ఆయనది. అటువంటి గొంతుకి సొంతదారుని పేరు తిరుచ్చి లోకనాథన్. తమిళ సినిమాలో మొట్టమొదటగా నేపథ్యగాయకుడు ఈయన. అవును, అప్పట్లో నటించేవారు పాడుతుండేవారు. ఆ పద్ధతిని మార్చి నేపథ్యగాయకులతో పాటలు పాడించొచ్చు అనే దానికి బీజం వేసారు లోకనాథన్.
తమిళనాడులోని తిరుచ్చి మలైకోటకు సమీపంలోనే ఆయన ఇల్లు. ఈ మనిషి ఎత్తుకన్నా మనసులో ఉన్న సంగీతంమీది మక్కువ కొండంత.
లాగు జేబులలో ఆనాటి సంగీత జ్ఞాని అయిన జి. రామనాథన్ పాటలను నింపుకుని ఎప్పుడూ పాడుతుండేవారు.
"లోగు బాగా పాడుతారడగా.....ఏదీ ఓ పాట పాడు....లోగూ" అని అడగడంతోనే కావేరీ నదీ ప్రవాహంలా పెదవి దాటి వచ్చాయి పాటలు ఆయన లోపలి నుంచి.
అడగడంతోనే ఏమాత్రం తడబాటూ లేకుండా పాడిన లోకనాథన్ కి తండ్రీ చేసే నగల వ్యారంపట్ల ఏమాత్రం ఆసక్తి లేదు.
నటరాజన్ దగ్గర సంగీతం నేర్చుకున్న లోకనాథన్ తన స్వరానికి మరిన్ని మెళకువలు నేర్చుకున్నారు.
కాలమూ అవకాశమూ కలిసొచ్చాయి. ఏ రామనాథన్ ముందు పాట పాడారో ఆ రామనాథన్ దగ్గరే తొలిసారిగా సినిమాలో ఓ పాట పాడారు.
ఆ పాటే...." వారాయ్ నీ వారాయ్....పోగుమిడం వెగు దూరమిల్లయ్....నీ వారాయ్ "
వారాయ్ ....అంటూ తిరుచ్చి లోకనాథన్ గొంతు కోసమే థియేటరుకొచ్చి చూసిన అభిమానులెందరు ఎంతమందో....అలాగే ఆయనకు ఆ పాటతో వచ్చిన అవకాశాలూ అన్నీ ఇన్నీ కావు.
 
ఉత్సాహమైన పాట....
జీవితమంటే ఇంతేనే ఇంకేమీ లేదా ఏమిటీ జీవితమని బాధపడే పాట....ఈ రెండు రకాల పాటలూ తూర్పూ పడమరల్లాంటివి. అయితే ఈ రెండు రకాల పాటలలోని పదాలను భావాలను పలికించడంలో లోకనాథన్ తనకు తానే సాటినని అనిపించుకున్న రోజులవి.
ఆశయే అలైపోలే...నామెల్లాం అదన్ మేలే....(ఆశే అలలా...మనమందరం దానిపైనే) ఆంటూ ఈయన పాడారొక సినిమాలో....ఆరోజుల్లో టెంటులలో ఇసుకపై కూర్చుని చూస్తున్న ప్రేక్షకులను ఓ పడవలో ఎక్కించుకుని తీసుకుపోయారు ఈ పాటతో లోకనాథన్. 
పురుషన్ వీట్టిల్ వాయప్పోగుం పెన్నే....తంగచ్చి కన్నే.....(మొగుడింట ఉండటానికి పోతున్నమ్మాయీ, బుజ్జి చెల్లెమ్మ....) అంటూ లోకనాథన్ పాడిన పాటే ఆరోజుల్లో పెళ్ళిళ్ళు జరిగే ఇళ్ళల్లో వినిపిస్తుండేవి లౌడ్ స్పీకర్లలో. చెల్లెలు లేని వారు కూడా ఈ పాటను ఎప్పుడూ సన్నని రాగంలో పాడుతుండేవారు. అప్పట్లో సెల్ఫోన్లు ఉండి ఉంటే ఆశయే అలైపోలే, వారాయ్ నీ వారాయ్.....అనే పాటలను రింగ్ టోన్ గా కాలర్ ట్యూన్ గా పెట్టుకునే వారే...
 ఉలవుం తెండ్రల్ కాట్రినిలే...అనే పాటలో కలంగం అదిలుం కానువాయ్....గవనం వైత్తే పార్.....అని పాడినప్పుడు మనల్ని ఆయన తన గొంతుతో విహారానికి తీసుకుపోతున్నట్టే అనిపిస్తుంది. ఆ పాటలో ఆయన పలికిన మాటలన్నీ గులాబ్ జామ్ ని ఆస్వాదిస్తూ తింటున్నట్టే ఫీలయ్యేవారు.
పొన్నాన కైగళ్ పున్నాగలామో పోదుం పోదుం పోగలామ్ ....అనే పాట వింటుంటే పిండి వంటలు చేసే భార్యకు పోటీగా భర్త వచ్చి వంట గదిలో ఇద్దరూ కలిసి మెలసి పాడే పాట....వింటుంటే ఘుమఘుమలు ఆస్వాదిస్తున్న అనుభూతిళకలిగేదని అనుకునేవారు ఆరోజుల్లో....
ఏబీసీడీ పడిక్కిరేన్ ఇఎఫ్ హెచ్ ఎయుదురేన్ అనే సరదా పాటలోనూ ఆయన స్వరం వింటుంటే మనసుకదో ఆనందమే....
అడిక్కిర కైదాన్ అనైక్కుం ....పాట ఆ రోజుల్లో ఓ భిన్నమైన పాటలలో ఒకటిగా సూపర్ హిట్టయ్యింది.
ఇక, కళ్యాణ సమయల్ సాదం, కాయ్ గరిగళుం ప్రమాదం - అన్ద గౌరవ ప్రసాదం ఇదువే ఎనక్కు పోదు....హహహహహహహహ....హహహహహహహహ....హహహహహహహహ.... (మాయాబజార్ లోని వివాహభోజనంబు వింతైన వంటకంబుకి తమిళపాట)
అందార బజ్జి అంగే
సుందర సొజ్జి ఇంగే సందోష మీరిప్పొంగ ....హహహహహహహహ....ఇదువే ఎనక్కు తింగ ...అనే పాటను తిరుచ్చి లోకనాథన్ గొంతులో వినగానే కడుపునిండా తిన్నవారికి కూడా మళ్ళా ఓ పట్టు పడదామా తినడానికి అని అన్పించేదట....ఈ పాటను పాడుతూ అన్నం తిన్న వారు, అన్నం తినిపించినవారెందరో...
సన్నని గొంతులో సంగతులు కలుపుతూ ఉచ్చస్థాయిని తాకే స్వరం వింటుంటే ఎటువంటి శ్రోతైనా తన్మయం చెందవలసిందే....
ఎన్డ్రు తణియుం
 ఇంద సుదందిర దాగం....వంటి పాటలన్నీ ఆయన స్వరంలో జీవం పోసుకున్నవే.....ఇటువంటి పాటలు వింటుంటే మనసులోని బాధలన్నీ ఎగిరిపోయి మనిషి తేలికవుతాడు.
నటుడు తంగవేల్ ఇంట నవరాత్రి వేడుకలు. మదురై సోము పాడారు. ఆయన పాట వింటున్న తిరుచ్చి లోకనాథన్ వేగంగా మదురై సోము దగ్గరకు వెళ్ళి "అద్భుతం" అని ప్రశంసించి చేతిలో ఉన్న తమలపాకు డబ్బాను కానుకగా ఇచ్చారు. ఆ డబ్బా ఇత్తడి కాదండోయ్, వెండిది. ఓ కళాకారుడై ఉంటే అతను ఓ అభిమానిగానూ ఉండాలి. తిరుచ్చి లోకనాథన్ ఓ గొప్ప అభిమాని కూడా.
ఎం.జి. రామచంద్రన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రంలో జి. రామనాథన్ సంగీత దర్శకత్వంలో జిక్కీతో కలిసి పాడిన లోకనాథన్ హాస్యనటుడు సి.టి. రాజకాంత్ కుమార్తె రాజలక్ష్మిని పెళ్ళాడారు.
ఆయన పాడిన రెండవ పాట ఎం. కరుణానిధి కథ, మాటలతో రూపొందిన అభిమన్యు (1948)లోనిది. ఆ పాట పల్లవి...ఇని వసంతమాం వాయ్విలే!
డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు లోకనాథన్. శివాజీగణేశన్ నటించిన తూక్కి తూక్కి సినిమాలో ఎనిమిది పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు ఒక్కో పాటకు అయిదు వందలు అడిగారు. అయితే నిర్మాతలు డబ్బు తగ్గించుకోమని కోరారు. కానీ ఒక్క పైసాకూడా తగ్గనని చెప్పి మదురై నుంచి కొత్తగా ఓ గొంతు వినిపిస్తోంది...అతనితో పాడించుకోంండి అని సూచించారు. లోకనాథన్ చెప్పినట్టే ఆ యువకుడితో నిర్మాతలు పాటలు పాడించుకున్నారు. ఆ యువకుడే టి.ఎం. సౌందరరాజన్. తర్వాతి కాలంలో ఎంజిఆర్, శివాజీలకు పాటలు పాడి పేరుప్రఖ్యాతులు సంపాదించింది ఈ సౌందరరాజనే కావడం విశేషం.
1924జూలై 24న జన్మించిన లోకనాథన్ 1989 నవంబర్ 17న కాలధర్మం చెందారు.
ఇప్పటికీ ఆయన పాడిన పాటలు తమిళనాట సజీవమే.
రాత్రిపూట ఆయన పాటలు వింటే నిద్ర తానుగా ముంచుకొస్తుంది. 
తిరుచ్చి లోకనాథన్ పెద్దకుమారుడు, కళైమామణి సి.టి. రాజకాంతం మనవడు అయిన తిరుచ్చి లోకనాథన్ మహరాజన్ శాస్త్రీయ సంగీతగాయకుడు. సినిమాలలో పాటలు పాడారు. పదో ఏట మహరాజన్ వల్లలార్ అనే నాటకంలో నటించారు. పాడారు. 1967లో ఆయన సినిమాలో తొలి పాట పాడారు.
కామెంట్‌లు