జయ విజయులు . పురాణ బేతాళకథ.;- డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర రావు , , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు జయవిజయుల గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు అన్నాడు.
జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది.
ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు.
దాంతో వారిరువురూ వెళ్ళి శ్రీ మహా విష్ణువు సంగతి నివేదిస్తారు. సర్వాంతర్యామినైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ వారి నిర్ణయాన్ని తప్పు పడతాడు. తరువాత తానే స్వయంగా వెళ్ళి తీసుకు వస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. వారికి పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో ఆయనకే వదిలి వేస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు.
అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.
దాని ప్రకారమే వారు కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా, త్రేతాయుగం లో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగం లో శిశుపాల దంతవక్త్రులు గా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కలియుగంలో వారికి శాపవిమోచనం కలిగింది. కాబట్టి చాలా విష్ణు దేవాలయాల్లో జయ విజయులు ద్వారపాలకులు గా చెక్కి ఉండటాన్ని గమనించవచ్చు'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టుపైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.

కామెంట్‌లు