మన మహా యోధులు:నాలుగేళ్ళ పోరాట ఫలితం!;-- దోర్బల బాలశేఖరశర్మ
 కాలం కొందరిని 'కావాలని' తన కోసమే కంటుందేమో. ఎందుకంటే, ఆ రోజుల్లో ఎందరో జన్మించినా కేవలం కొందరు మాత్రమే అత్యంత కఠినమైన సదరు కాలపరీక్షకు తట్టుకొని నిలబడి, అనేక కష్టనష్టాలతో తలపడి, పోరాడి విజయం సాధిస్తారు. అటువంటి అరుదైన మన తెలుగు మహా యోధులు అప్పట్లో ఎందరో. వారిలో నూతి శంకరరావు ఒకరు. ఒకవైపు దేశ స్వాతంత్య్ర పోరాటం, అదే సమయంలో ఇండియన్ యూనియన్ లో కలువకుండా మొండికేసిన నిజాం నిరంకుశ పాలకుల నుండి విముక్తి కోసం, మన హైదరాబాద్ రాష్ట్ర విమోచనే ధ్యేయంగా ప్రాణాలకు తెగించి ఉద్యమించిన అనేక మంది యోధులను కాలం ఆనాడు తెలుగు నేలపై పని కట్టుకొని కన్నది. అందుకే, అటువంటి మహానుభావులను తరువాతి తరాలు 'కారణజన్ములు'గా ఆరాధిస్తారు.
నూనూగు మీసాల వయసులో, పుస్తకాలు పట్టుకొని బుద్ధిగా బడికి వెళ్ళి చదువుకోవాల్సిన రోజుల్లో, ఉడుకు రక్తం అగ్నిజ్వాల వలె మారడానికి అప్పుడప్పుడే వేడిని పుంజుకుంటున్న దశలో.. ఉద్యమాన్నే ఊపిరిగా ఆనాడు వాళ్లంతా శ్వాసించారు. ఫలితం మనలను బంధించిన సంకెళ్లు తెంచుకొన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ నుంచి హైదరాబాద్ నడిబొడ్డులోని కేశవ మెమోరియల్ హైస్కూలుకు చదువుకోవడానికి వచ్చిన శంకరరావు, ఎనిమిదో తరగతిలో వుండగానే స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధమయ్యారు. సనాతన వైదిక స్మార్త బ్రాహ్మణ దంపతులైన నూతి కృష్ణశర్మ - భాగీరథమ్మలకు 1930 ఫిబ్రవరి 13న అయిదో సంతానంగా జన్మించిన శంకరరావు, 1942 లో హైస్కూలు చదువుకోసం హైదరాబాద్ వచ్చారు. కానీ, 1944 నుంచి 1948 చివరి వరకు (సుమారు నాలుగేళ్లపాటు) పోరాటానికే అంకితమయ్యారు. 
హైదరాబాద్, గుల్బర్గాలలో దాదాపు తొమ్మిదిన్నర నెలలు (1948 జనవరి - అక్టోబర్) ఆయన జైలు జీవితం గడిపారు. శంకరరావు పోరాటం కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదు. టేక్మాల్ గ్రామంలో ఆర్యసమాజ్ స్థాపన వీరి నాయకత్వంలోనే జరిగింది. అప్పట్లో ఆ ఊరు ఆయన వంటి పలువురు యువ దేశభక్తులతో అట్టుడికి పోయింది. ఆర్యసమాజ్ తొలితరం అగ్రశ్రేణి నాయకులైన వినాయకరావు విద్యాలంకార్, పండిత నరేంద్రజీలతో వారికి 15 ఏళ్ల వయసులోనే సన్నిహిత పరిచయం ఏర్పడింది. 1944లో ఒకానొక రోజు పండిత నరేంద్రజీని ఆయన మెదక్ సమీప గ్రామం సర్దెన (తల్లిగారి ఊరు) కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మెదక్ లోని ఒక మర్రిచెట్టు వద్ద వున్న ఇంట్లో ఏర్పాటైన సభలో పండిత నరేంద్రజీ ఉద్విగ్న భరిత దేశభక్తి పూరిత ప్రసంగానికి సుమారు యాభై మంది విద్యార్థులు ప్రభావితం కావడమే కాక, అదే సమయంలో వారి స్వగ్రామం టేక్మాల్ లోకూడా ఆర్యసమాజ్ స్థాపన జరిగింది.
యువ శంకరరావులో ఉద్యమ స్ఫూర్తిని రగిలింప చేసిన సంఘటనగా 'సర్దెన' గ్రామ సంఘటనను చెప్తారు. ఆనాడు శంకరరావు తనతోపాటు ఆర్యసమాజ్ అగ్రనాయకుడు పండిత నరేంద్రజీని కూడా ఊరుకు తీసుకు వస్తున్నందువల్ల తమకు నిజాం సర్కారు నుంచి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్న భయంతో గ్రామస్తులు ఎవరూ వారికి ఆశ్రయం ఇవ్వలేదు. దానితో ఇద్దరూ ఆ రాత్రి ఊరి వెలుపల గల ఒక గుడిలో తలదాచుకోవలసి వచ్చింది. కానీ, అప్పటి పోలీసు పటేల్ అనంతరావు ధైర్యంతో రాత్రి పొద్దు పోయాక వారికి భోజనం అందించారు. దాంతో నిజాం అధికారులు ఆ గ్రామాధికారిని కొన్నాళ్లపాటు విధుల నుంచి తప్పించారు కూడా. ఈ రకంగా నిజాం క్రూరత్వం నరేంద్రజీకి సొంతంగా అనుభవంలోకి రావడమే కాక శంకరరావులోనూ కొత్త ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని రేకెత్తించింది. 
టేక్మాలులో ఆర్య సమాజ్ స్థాపన అప్పట్లో ఒక పెద్ద సంచలనం. వినాయకరావు విద్యాలంకార్, పండిత నరేంద్రజీ, గంగారాం వంటి ప్రముఖ నాయకులను చూడటానికి జనం వేల సంఖ్యలో ఆ ఊరు వచ్చారు. బహిరంగ సభకు అనుమతి లేకున్నా ఆరేడు వేల మంది ప్రజల సమక్షంలో దిగ్విజయమైంది. ఈ సభ అనంతరం హైదరాబాద్ కు వెళుతున్న నాయకులపై బొడమల్లి గ్రామం వద్ద ఏకంగా కాల్పులే జరగడంతో గంగారాం కు స్వల్ప గాయాలై, మిగిలిన వారు సురక్షితంగా బయటపడ గలిగారు. శంకరరావు ధైర్య సాహసాలు ఆనాటి టేక్మాలు గ్రామ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాక, వారిలో పలువురు స్వాతంత్ర్యోద్యమంలో 'ప్రాణత్యాగానికైనా సిద్ధమే' అంటూ ప్రతినలు బూనారు.
1947 నుంచే శంకరరావు ప్రభృతుల అరెస్టులు మొదలైనాయి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో చేర్చకుండా నిజాం సర్కారు ప్రజలపై చేసే దౌర్జన్యాలు ఒకవైపు శ్రుతి మించడం, మరోవైపు నరేంద్రజీ వంటి ఆర్య సమాజ్ నాయకులు  జైళ్ల పాలు కావడంతో ఆ తర్వాత పరిస్థితులు అట్టుడికి పోయాయి. జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్న వేలాది మందిపై లాఠీ చార్జీలు, జరిమానాలు, జైలు శిక్షలు సహజమై పోయాయి. ఖాసిం రజ్వీ ప్రవేశం తర్వాత హిందువులపై అణచివేత ఎక్కడికి దారి తీసిందంటే, చివరకు హైదరాబాద్ ను కొందరు 'దక్షిణ పాకిస్తాన్' గా చేయాలన్న డిమాండ్ ను ముందుకు తెచ్చారు. 
దీంతో ఉద్యమం దావానంలా వ్యాపించింది. ఆనాటి ప్రజల సహాయ నిరాకరణ దేశంలోనే చరిత్రను సృష్టించింది. వేలాది మంది విద్యార్థులు స్కూళ్లను బహిష్కరించారు. ఈ 'క్విట్ స్కూల్ ఉద్యమం' సందర్భంగా సుమారు ఆరు వేలమంది గ్రామోద్యోగులు సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. 'క్విట్ స్కూల్ ఉద్యమం'లో సమర సింహాలవలె పాల్గొన్న శంకరరావు ప్రభృతులు పోరాట పటిమను, ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం పాటు కాపాడుతూ, కొనసాగించడమే లక్ష్యంగా, 1947 అక్టోబర్ నుంచి నిజాం పోలీసులకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలూ పడ్డారు. షోలాపూర్, పుణె, బెజవాడలలో కొన్నాళ్ళు వుండి మళ్లీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ రెడ్డి హాస్టల్ కేంద్రంగా అనేక రోజులు నిత్యం ఉద్యమాలలో పాల్గొన్నారు. 1948 జనవరి, ఫిబ్రవరి కల్లా చాలామంది అగ్రనేతలు అరెస్టు కాగా, కొందరు సంస్థానం వదిలి వెళ్లారు. ఇక, మిగిలింది శంకరరావు వంటి విద్యార్థి ఉద్యమకారులే. 
'సత్యాగ్రహం'లో భాగంగా రోజూ మన నగరంలోని రాయల్ టాకీస్ నుంచి సుల్తాన్ బజార్ చౌరస్తా వరకు జరిగే ఊరేగింపులలో పాల్గొనేవారు. అలాంటి వారిని పోలీసులు అరెస్టు చేసి రాత్రికి వదిలేసేవారు. 1948 ఫిబ్రవరిలో ఒకరోజు 'సత్యాగ్రహం' చేస్తుండగా అరెస్టయిన శంకరరావుపై రాజ్యధిక్కార నేరానికిగాను న్యాయాధికారి 10 రూపాయల జరిమానా విధించారు. ఆ సొమ్ము కట్టనందుకు ఆయన్ను మళ్లీ అరెస్టు చేశారు. కానీ, ఆనాటి సాయంకాలానికి విడుదల చేశారు. కారణం, శ్యామ్ రావు దేశ్ పాండే అనే వ్యక్తి ఆ జరిమానా సొమ్ము కట్టేశారు. ఈ సంగతి శంకరరావుకు చాలా రోజులకు కానీ తెలియలేదు. విడుదలై రాగానే మళ్లీ అదే ఉద్యమబాట. మార్చి (1948) లో మరో పెద్ద ఆందోళన జరిపారు. మళ్లీ పలువురితో పాటు ఆయనా అరెస్టయ్యారు. 
ఈసారి వారిపై ప్రభుత్వ ఆస్తులు (వీధిలైట్లు వంటివి) ధ్వంసం చేశారన్న ఆరోపణ. వీరెవరినీ పోలీసులు వదల్లేదు. రిమాండ్ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరందరినీ బ్యారక్ నంబర్ 8 లో ఉంచారు. అక్కడి నిర్బంధ జీవితం శంకరరావు ప్రభృతులకు నరకాన్ని చూపించింది. అయినా, స్వాతంత్ర్య సాధనే ధ్యేయంగా గల వారి ముఖాల్లో భయం, దిగులు ఏ కోశానా కనిపించలేదు. దాదాపు 75 మంది రాజకీయ ఖైదీలు ఆ వార్డులో వుండేవారు. మరోవైపు టేక్మాల్ లో స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు రైతులు త్రివర్ణ పతాకాలు ఎగురవేసి అరెస్టయ్యారు. జైలులో వుండగానే శంకరరావు 'పయాం నౌ' (కొత్త సందేశం) అనే లిఖిత పత్రికలో మూడు వ్యాసాలు ప్రచురించారు. ఈ పత్రికకు బి.సత్యనారాయణ రెడ్డి (బడే భాయ్/ పెద్దన్న) సంపాదకులు, బోనాల కృష్ణారావు సహసంపాదకుడు, కాగా జి.హనుమంత రావు, రఘువీరరావు, టి.వెంకట్ రావు, వసంత్ రావు సంపాదక మండలి సభ్యులు. అదే పత్రికలో మరోమారు ఘనమైన త్యాగజీవి, అరివీర జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ పైనా ఉద్విగ్నపూరిత వ్యాసం రాశారు.
ఆనాడు నిజాం ప్రభుత్వ యంత్రాంగం అంతా దాదాపుగా ఖాసిం రజ్వీ హయాంలోకి వెళ్ళిపోయింది. లాయక్ అలీ ప్రభుత్వం అంటే రజ్వీదే అన్నట్టుగా మారాయి పరిస్థితులు. రజ్వీ మతోన్మాదం వెయ్యి నాల్కులతో విషం కక్కింది. పరిస్థితులు బాగా విషమించడంతో గత్యంతరం లేని స్థితిలో సెప్టెంబర్ 13న భారత యూనియన్ హైదరాబాద్ పై సైనిక చర్యను ప్రారంభించింది. భారత సైనిక దళాలు హైదరాబాద్ రాష్ట్ర పొడవునా 2,580 మైళ్ళ దూరంలో అయిదు వైపులనుంచీ ప్రవేశించారు. 1,200 మంది రజాకార్లు హతం కాగా, మరో 500 మంది వరకు ఆనాడు పట్టుబడ్డారు. పోలీసు చర్య అనంతరం రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేయగా, అక్టోబర్ 9న (1948) నూతి శంకరరావు ప్రభృతులపై పెట్టిన కేసులను ఉపసంహరించారు. 
విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నష్టపోకుండా 'క్విట్ స్కూల్ ఉద్యమం'లో పాల్గొన్న వారికి హెచ్ ఎస్ సి సప్లిమెంటరీ పరీక్షకోసం కేశవ మెమోరియల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ (ఖండేరావు కులకర్ణి) ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. అలా, శంకరరావు హెచ్ ఎస్ సి తోపాటు వివేకవర్ధనిలో ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణులైనారు. 1951 లో రెవిన్యూ శాఖలో రెవిన్యూ ఇన్ స్పెక్టర్ గా ఉద్యోగంలో ప్రవేశించిన శంకరరావు, 1988 ఫిబ్రవరి 28న డిప్యూటీ కలెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆనాటి విద్యార్థి నాయకులు ఎందరో తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించగా, ఆయన మాత్రం ఒక సగటు ఉద్యోగిగానే కొనసాగారు. 'ఆయనది ఎవరినీ ఏదీ అడిగే స్వభావం కాదు. అనేకులకు వారు చేతనైన మేర సహాయం చేశారు. ఎప్పుడూ ఎవరి ముందూ తలవంచింది లేదు. చేయి చాచలేదు' అని ప్రసిద్ధ పత్రికా రచయిత జి.వెంకట రామారావు తాను గ్రంధస్థం చేసిన 'స్వాతంత్ర్య సమరశీలి నూతి శంకరరావు' బయోగ్రఫీలో అభిప్రాయపడ్డారు. జాతీయతా వాదాన్ని, దేశభక్తిని, సామాజిక సేవా దృక్పథాన్ని శంకరరావు నేటికీ చెక్కు చెదర నీయలేదు. ఇటువంటి మన మహా యోధుల కాలంలో జీవిస్తున్నందుకు మనమంతా గర్వించవలసిందే.
- దోర్బల బాలశేఖరశర్మ
(92 సంవత్సరాలు నిండిన నూతి శంకరరావుకు ఈ నెల 12వ తేదీన హైదరాబాద్, సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో 'జీవన సాఫల్య పురస్కార' ప్రదానం జరగనున్న సందర్భంగా..)

కామెంట్‌లు
Sharma DB చెప్పారు…
మంచి స్ఫూర్తిదాయక కథనాన్ని ఈ తరం పిల్లలకు అందించారు. ధన్యవాదాలు.