కవితాదినోత్సవ శుభాకాంక్షలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితలను
మందారమకరందముతో వ్రాసినారేమో
మధురముగానుండి
మనసుల నాకట్టుకొనుచున్నవి

కవితలపై
మల్లెలపరిమాళాలను చల్లినారేమో
సౌరభాలనువిరజిమ్ముతూ
ఉల్లాల నుత్సాహపరుస్తున్నాయి

కవితలకు
కుసుమాలసౌందర్యాల నంటించారేమో
సుందరముగానుండి
తనువును తృపిపరుస్తున్నాయి

కవితలకు
సుమాలసుకుమారాన్ని చేర్చినారేమో
మెత్తమెత్తగాతగులుతూ
మయిని మురిపిస్తున్నాయి

కవితలను
చంద్రునివెన్నెలతో స్నానంచేయించారేమో
చక్కగాచల్లచల్లగానుండి
హృదికి హాయినిస్తున్నాయి

కవితలను
సూర్యునికిరణాలతో పూరించినారేమో
వెలుగులుచిమ్ముతూ
పుటలపై ప్రకాశిస్తున్నాయి

కవితలను 
కన్నెపిల్లలకులుకులతో కూర్చినారేమో
అందముగానుండి
అంతరంగమునుతట్టి ఆనందపరుస్తున్నాయి

కవితలను
పవిత్రగంగాజలముతో నింపినారేమో
మనోదాహాన్నితీరుస్తూ
మదిని ముచ్చటపరుస్తున్నాయి

కవితలను
అమృతమునద్ది లిఖించారేమో
చిరంజీవులై
సాహితీలోకమున వర్ధిల్లుచున్నాయి

కవితలు
కవితాదినోత్సవమని కాబోలు
కళకళలాడుతూ
పాఠకులను పరవశింపజేస్తున్నాయి

కవులకు
వందనాలు అభివందనాలు
అందరికి కవితాదినోత్సవ 
శుభాకాంక్షలు


కామెంట్‌లు