కెపిఎస్, కొన్ని ముచ్చట్లు!;-- యామిజాల జగదీశ్
 మొదట మూకీ చిత్రాలు....
అనంతరం టాకీ చిత్రాలు...చలనచిత్ర పరిశ్రమలో వచ్చాయి. మూకీ చిత్రాల కాలంలో అందరికీ అర్థమయ్యేరీతిలో మన దేశంలో ఎక్కువగా తీసినవి భక్తిరస ప్రధాన చిత్రాలే. అయితే టాకీ చిత్రాల తర్వాతకూడా భక్తిరస చిత్రాలు అనేకం వచ్చాయి.
1950 వరకూ మన దేశంలో దాదాపుగా అన్ని భాషలలో పౌరాణిక చిత్రాలు నిర్మించారు. 
వెండితెరపై భక్తిని ప్రదర్శిస్తూ ప్రజలను ఆకట్టుకుని ఎందరో నటీనటులు తమ పాత్రలద్వారా ప్రశంసలందుకున్నారు. వారిలో ఒకరు కొడుముడి కోకిలం అని అరిజ్ఞర్ అన్నా (దురై) తో కొనియాడబడ్డ కె.పి. సుందరాంబాళ్!
స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుని గాంధీజీ దృష్టిని ఆకర్షించి, కాంగ్రెస్ విజయంకోసం పాటుపడి నాస్తికుల విమర్శలను తన భక్తి పాటలతో తీప్పికొట్టిన ప్రముఖ తమిళ నటి, గాయని కె.పి.ఎస్. 
తనకిచ్చిన పాత్రకు జీవం పోయడంలో కెపిఎస్ నటన సహజత్వానికి పెట్టిందిపేరు.
ఆమెను అవ్వయారుగా కారైక్కాల్ అమ్మయారుగా భక్త నందనారాత్తాళుగానే ప్రేక్షకులు ఊహించుకునే వారు. అందుకొక సంఘటన ఉంది....
కె.పి. సుందరాంబాళ్ భక్త నందనారులో నటిస్తున్నప్పుడు అందులో విశ్వనాథ అయ్యర్ కూడా నటించారు. అందులో ఓ సన్నివేశంలో విశ్వనాథ అయ్యర్ తను పోషించిన పాత్రలో కథాపరంగా నందనారుని క్షమాపణ కోరాలి.
"నందనార్! నీ గొప్పతనం తెలియక దగాపడ్డాను." అంటు నందనార్ కాళ్ళపై పడాలి. అయితే విశ్వనాథ అయ్యర్ అందుకు ఏమాత్రం అభ్యంతరం తెలుపలేదు.
ఈ సినిమా విడుదలైనప్పుడు కొందరు లేనిపోని చర్చలకు పూనుకున్నారు. విశ్వనాథ అయ్యర్ లాంటి నటుడు ఓ స్త్రీ కాళ్ళపై పడటమేమిటీ? అలా చేరడం సబబేనా? అని అడిగారు. 
అప్పుడు విశ్వనాథ అయ్యర్ చెప్పిన జవాబు....
కెపిఎస్ ఆ సినిమా మొత్తం నడయాడే నందనారుగా కనిపించారు. కెపిఎస్ నా ముందర ఓ దైవంలా నిల్చున్నారు. అందుకే మరుక్షణమే ఆ సన్నివేశంలో నన్ను నేను మరచిపోయి కాళ్ళపై పడి నమస్కరించాను.
నటీనటులుగా మా మధ్య ఎలాంటి తేడాలు ఉండవు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేరడమే మా వంతు" అని ఆయన చెప్పారు.
కెపిఎస్ ఓ గొప్ప నటి. 
ఆమెను అవ్వయారుగా ఊహించుకుని కళ్ళు మూసుకుంటే మనముందు కనిపించేది అవ్వయార్ రూపంలో ఉండే కెపిఎస్సే....
ఇది ఎవరూ కాదఞలేని నిజం.
ఇలా భక్తిరస ప్రధాన చిత్రాలలో నటించి పాటలు పాడి అందరి మెప్పు పొందిన సుందరాంబాళ్ వైరాగ్యం గమనించతగ్గది.
1908 అక్టోబర్ పదకొండో తేదీన తమిళనాడులోని ఈరోడు జిల్లాలో జన్మించిన కెపిఎస్ చిన్నవయస్సులోనే తండ్రిని కోల్పోయారు. మేనమామ కనుసన్నల్లో పెరిగి పెద్దయిన కెపిఎస్ కు ఆమె గొంతే ఓ ప్లస్ పాయింట్. కుంభకోణంలో ఓ డ్రామా కంపెనీలో తరఫున ఆమె నటించడం మొదలుపెట్టారు. మొదట్లో ఆమెకు మగపాత్రలే ఇచ్చేవారు. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. అప్పట్లో మగపిల్లలేమో ఆడ పిల్లల పాత్రలో నటించారు. 
ఆధునిక తమిళ నాటకాలకు వ్యవస్థాపక పితామహుడిగా ఖ్యాతి పొందిన పమ్మల్ సంబంధ ముదలియార్ మాట్లాడుతూ సుందరాంబాళ్ తన పాటతోనే ప్రేక్షకులను కట్టిపడేసేవారు. వాయిద్యాలతో పని లేకుండా తన గాత్రంతో ఆమె శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు" అన్నారు.
అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుపొందిన సుందరాంబాళ్ ని క్వీన్ ఆఫ్ ది స్టేజ్ అనేవారు.కొందరు ప్రముఖ  నటులు ఆమెతో కలిసి నటించడానికి ముందుకొచ్చేవారుకాదు. కారణం ఆమెకున్న ఆదరణే. తమనెవరూ గుర్తించరేమోనని కొందరు మగవారు ఆమెతో కలిసి నటించడానికి మొగ్గుచూపేవారు కాదు.
1927లో ఆమె శ్రీలంక పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమె ప్రముఖ స్టేజ్ నటుడు, గాయకుడు అయిన ఎస్. జి. కిట్టప్పను కలిశారు. వీరిద్దరూ కలిసి అప్పుడు వల్లి తిరుమణం అనే నాటకంలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరు ఒక్కటయ్యారు. దంపతులుగా అనేక నాటకాలలో నటించారు.
ఆమె సంగీత కచ్చేరీలు ఆరు గంటలపాటు కొనసాగేవి. ఆమె రాగాలతో కట్టిపడేసేవారు.ఆమె వేదికలపై పాడిన అనేక పాటలను తర్వాతికాలంలో నందనార్, మణిమేఖలై, అవ్వయార్, తిరువిలయాడల్, కందన్ కరుణై తదితర సినిమాలో ఉపయోగించుకున్నారు.
తమిళనటుడు కె. సారంగపాణి ఓమారు కెపిఎస్ గురించిళచెప్తూ మైక్ అవసరం లేకుండా ఆమె పాడితో ఓ మైలు దూరం వరకూ స్పష్టంగా వినిపించేదన్నారు.
మహాకవి కాళిదాస్, పూంబుహార్, ఉయిర్ మేళ్ ఆశై, తునైవన్, కారైక్కాల్ ఆమ్మయార్ వంటి సినిమాలలోను నటించిన సుందరాంబాళ్ కొన్ని పాటలుకూడా రాశారు.  ఆమె దాదాపు ఎనిమిది వందల పాటలు పాడారు. అయితే రెండు వందల యాభై పాటలే అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆమె ఏ సినిమాలోనూ మరొకరితో కలిసి యుగళగీతం పాడనేలేదు. ఆమెవన్నీ సోలో సాంగ్సే!
భారత దేశ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న తొలి నటి కె.పి. సుందరాంబాళ్. 1935లో విడుదలైన భక్త నందనార్ సినిమాలో ఆమెకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా లక్ష రూపాయలు.
గ్రామఫోన్ రికార్డులుగా వచ్చిన ఆమె పాటలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
అలాగే 1951లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిలుకి ఎన్నికైన తొలి సినీ నటి అనే ఖ్యాతికూడా కెపిఎస్ కే దక్కింది. ఆరోజుల్లో ఆమెతోపాటు అవ్వై షణ్ముగం కాంగ్రెస్ పార్టీకీ ప్రచారం చేసేవారు. కె. కామరాజ్, ఎస్. సత్యమూర్తి తమ వేదికలపై ఆమెతో పాడించుకునేవారు. 1970లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్యగాయనిగా అవార్డు పిందిన కెపిఎస్ 1980లో తుదిశ్వాస విడిచారు.కామెంట్‌లు