గుప్పెడన్ని అక్షరాలు;-*శ్రీలతరమేశ్ గోస్కుల**హుజురాబాద్.*
మనసును మెలేసిన క్షణాన్నే కాదు ఎగిరి గంతేసిన క్షణాలలో కూడా
గుప్పెడన్ని అక్షరాలు గుండె గదులు దాటుకుంటూ ఇంపైన వస్తువుగా..
సరిజోడైన శీర్షికై పయణమవుతాయి..

కదులుతున్న కాలం ఒడిలో
కమనీయ *పదచిత్రమై*
కనుల ముందర కదలాడుతూ
ఊహా జగతిన ఉయ్యాలలూపుతూ
కనబడని నేస్తమొకటి కదిలిస్తుంది చేయి పట్టుకుని *నర్మగర్భంగా..*.

విధి ఆడే నాటకాలలో విచిత్ర మేముందో తెలియదు కానీ
కల్పితమొకటి కదిలే నదిలా సాగుతూ
*సృజియించే* మనసును మైమరపిస్తుంది ఆత్మబంధువుగా..

ఆశల పల్లకిలో ఊరేగినంతసేపు అంతా సవ్యంగానే కానీ
అత్యాశ ఆగనిమంటై హృదినంతటినీ తొలిచేస్తుంటే..
అందుకోక తప్పదు *మెరుపైన కవితాపంక్తి* నొకటి ఆత్రుతగా..

ఆకాశానికి సైతం అందని *ఎత్తుగడలు*
అవని అంత విస్తారమైన *వర్ణనలు*
*చతురోక్తులన్నీ* *అభివ్యక్తితో*
తేటతెల్లమై..
నురుగులు పొంగుతూ సాగే జలపాతంలా
వంకలెన్నో కలిగిన వయ్యారి నడకలాగా
సాగిపోవు కదా..

ఉన్నచోటనుండనీయక
ఉన్నపలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ
అలంకారితమై మదిని దోచే మంత్రమేదో *పదబంధ* విన్యాసాలందు దాక్కుని..
ఆలోచనామృతానందించేది కాదా *శిల్పం...*

సొబగులెన్నో అద్దుకున్న *భాషాశైలితో*
ఎల్లలెరుగని నవనవ్యతను అన్వేషిస్తూ పరిగెడుతుంటే
*భావసుకుమార* తరంగాలపై అలలై
సాగిన మనోల్లాసం చెప్పనలవి కానిదై
విశాల గగనపు వినువీధిలెంటా విహరిస్తూ
రసస్వాదన చేయును కదా..

ఒక్కో *పదలాలిత్యం* మేధో *మెరుపుగా* హృదయాంతరంగాన *విరుపుగా* తిష్టవేసి
హిమశిఖరమైన హితాన్ని *సందేశంగా* ఇస్తూ
అక్షర తాండవమంతా ఉన్నత *ప్రతీకలతో*..
సాఫీగా సాగిపోతుండగా
*సహజ సుందర పదఝరి* కంచికి చేరే వేళ
సుందర కళాఖండమై ప్రతిబింబించేదే కదా మనసైన కవిత్వం...


కామెంట్‌లు