త్రిపురాశురులు. పురాణ బేతాళ కథ.;- డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వర రావు , , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు త్రిపురాసురుల గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు అన్నాడు.
' బేతాళా విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు. వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుడి కొడుకులు. (త్రిపుర + అసురులు = త్రిపురాసురులు
వీరి తండ్రి కుమార స్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా వారు కామగమనం కలిగిన బంగారం, వెండి, రాగితో చేసిన మూడు నగరాలు నిర్మించి ఇమ్మని; అవి అంతరిక్షంలో తిరుగుతూ వేయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు; అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. బ్రహ్మ ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలు ఒక్కొక్కటీ యోజన విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు.
దేవతలు వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు మొరపెట్టుకున్నారు. ధర్మ బద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి నిరాకరిస్తారు. వారు విష్ణువును ప్రార్థించగా త్రిపురాసుర సంహారానికి ఉపాయం అలోచించి వారిని ధర్మభ్రష్టులను చేయగలందుకు, మాయలు తెలిసిన అరిహుడు అనే పురుషుణ్ణి సృష్టించాడు. వానిని వేదదూరమూ, ప్రత్యక్ష ప్రమాణ వాచకమూ అయిన శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నియమిస్తాడు. అతడు నలుగురు శిష్యులను సంపాదించి, వారికి మాయామతాన్ని ఉపదేశించి శిష్య సమేతుడై త్రిపురాలకు వెళ్ళి మత ప్రచారం చేయసాగాడు. నారదుని ప్రోత్సాహం వలన త్రిపురాసురులు అరిహుని వద్ద దీక్ష గైకొన్నారు, నాస్తికులయ్యారు. అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపవలసిందని దేవతలు శివున్ని ప్రార్థించారు. శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రథాన్ని, ధనుర్బాణాలనూ నిర్మించవలసిందని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.
విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించాడు. దానికి సూర్యచంద్రులు చక్రాలయినారు. బ్రహ్మదేవుడు సారథి అయి పగ్గాలు చేతబట్టాడు. మేఖలాచలం గొడుగుగాను, మందరగిరి పార్శ్వదండంగాను మారాయి. మేరు పర్వతం విల్లుగానూ, అనంతుడు వింటి నారిగాను మారారు. శారదాదేవి వింటికి కట్టిన చిరు గంటలుగా మారినది. విష్ణువు మహాతేజస్సుతో బాణంగా మారాడు. అగ్నిదేవుడు బాణపుమొన అయినాడు. నాలుగు వేదాలు నాలుగు గుర్రాలైనాయి.
శివుడు ఆ రథాన్ని ఎక్కి పార్వతీదేవితో బయలుదేరాడు. కాంచన, రజత, తామ్ర పురాలు మూడూ ఒక దానిని ఒకటి సమీపిస్తుండగా, శివుడు ధనుర్బాణాలు చేతబట్టి రథంలో నిలబడ్డాడు. త్రిపురాలు ఏకమైనాయని బ్రహ్మ శివున్ని హెచ్చరించాడు. వెంటనే శివుడు వింటితో బాణాన్ని సంధించి విడిచాడు. అది త్రిపురాలను తాగి భస్మంచేసి, శివుని వద్దకు వచ్చింది. త్రిపురాసురులు పరివారంతో సహా దగ్ధమైపోయారు'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికొరకు వెనుతిరిగాడు.


కామెంట్‌లు