"అనాధ బావులు-మిథేన్" (మొదటి భాగం);-ఎం బిందుమాధవి
 నా ఈ రచనలని కధలనుకున్నా..వ్యాసాలనుకున్నా ఫరవాలేదు.
సాధారణంగా వార్తా పత్రికలు  చదివేటప్పుడు శాస్త్ర..సాంకేతిక విషయాలున్న పేజీలు సామాన్య పాఠకులు తిప్పేస్తారు. ఆసక్తి ఉన్న వారు అందుకు సంబంధించిన జర్నల్స్ ద్వారా తెలుసుకుంటారనుకోండి.                                         
చదివి మీరు కూడా ప్రకృతి మనకిచ్చిన అద్భుతాలని తెలుసుకుని అబ్బురపడతారని, వీలైతే మీ పిల్లలకి చెప్పి వారిలో ఆయా రంగాల పట్ల ఆసక్తి కలిగిస్తారని ఆశిస్తున్నాను.
                                           @@@@@
తక్షశిల... ఊళ్ళో బాగా పేరున్న కార్పొరేట్ జూనియర్ కాలేజి. అంతర్ కళాశాలల్లో  జరిగే పోటీలకి విద్యార్ధులని తీర్చి దిద్దటంలో అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు కృష్ణ సాగర్. విద్యార్ధులతో అనుక్షణం గడపటం అంటే ఇష్టమున్నందున, జాతీయ సంస్థలో పదవీ విరమణ చేశాక, జూనియర్ కాలేజిలో చేరాడు.
కృష్ణ సాగర్ కి పూర్వపు ఉద్యోగ రీత్యా... జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీల ప్రొఫెసర్స్ తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల వల్ల సిటీలో జరుగుతున్న "పర్యావరణం-కాలుష్యం" అనే అంతర్జాతీయ సదస్సు జూం మీటింగ్ వీక్షించే అవకాశం తన విద్యార్ధులకి సంపాదించాడు.
కాలేజి యాజమాన్యం అసెంబ్లీ హాల్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభమయింది.
అప్పటి దాకా రణగొణ ధ్వనితో మాట్లాడుకుంటూ...పరస్పరం జోకులేసుకుంటూ సందడి చేస్తున్న విద్యార్ధులు ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు.
ఒక వక్త లేచి "వాతావరణ కాలుష్యం గురించి ఇప్పుడు అన్ని దేశాలు ఘాటుగా చర్చిస్తున్నాయి. ఈ సమస్య గురించి ఒక దేశం మరొక దేశాన్ని, ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వాన్ని విమర్శించటం పరిపాటి అయిపోయింది."
"అభివృద్ధి చెందిన దేశాలు, వెనకబడిన దేశాలని కర్బన ఉద్గారాలని తగ్గించాలని సలహాలిస్తూ ఉంటారు. వెనకబడిన దేశాలు పాటించే  వ్యవసాయ విధానాల వల్లే కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని వారి భావన. వాతావరణంలోకి ఎక్కువగా విడుదల అవుతున్న 'మిథేన్ '  వల్ల వాతావరణం కలుషితమవుతున్నదని మనందరికీ తెలుసు. దీనికి ముఖ్య కారణం సంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు ద్వారా విద్యుదుత్పత్తి జరగటం! బొగ్గు స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులని వాడాలి.  'సోలార్ ' ద్వారా విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలి" అని ముగించారు.
మరొక వక్త మాట్లాడుతూ
"పెద్దలు అనుకుంటున్నట్లు అభివృద్ధి చెందుతున్న దేశాలు పాటించే వ్యవసాయ విధానాల వల్ల వాతావరణంలోకి  విడుదల అయ్యే కర్బన ఉద్గారాలు, మిథేన్  వల్ల భూతాపం పెరుగుతున్నది అనే వారి వాదన సరైనది కాదు. అసలు వ్యవసాయం ద్వారా ఉత్పన్నమయ్యే మిథేన్ అతితక్కువ, అసలు చెప్పుకోతగినదే కాదు. co2 వల్ల వాతావరణం కలుషితమయ్యే మాట నిజమే. కానీ దాని కంటే చాప కింద నీరులాగా ఉన్న మరొక సమస్యని మనం విస్మరిస్తున్నాం!"
"సహజ వాయువు వాడకం వల్ల విడుదల అయ్యే "మిథేన్", వాతావరణంలో అతి తక్కువ సమయం మాత్రమే ఉన్నా... దాని వల్ల భూ తాపం పెరిగే అవకాశం 34 రెట్లు ఎక్కువ. అంటే మానవ జనిత కాలుష్యంలో నాలుగింట మూడు వంతులు అన్నమాట."
"వాతావరణంలోకి విదుదల అయ్యే "మిధేన్" .....సహజ వాయువు వల్ల 24% అయితే, వ్యవసాయం వల్ల విడుదల అయ్యేది 3% మాత్రమే! ఇక దేశాలు విస్మరించిన అతి ముఖ్యమైన మరొక విషయం ఉన్నది."
"అదేంటంటే అందరూ  బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్ తో కలిగే పర్యావరణ హాని, కాలుష్యం గురించే మాట్లాడతారు. అంత కంటే పర్యావరణానికి ప్రమాదకరమైన అంశం మరొకటి ఉన్నది. దాని గురించి చర్చించే ముందు ఇంకొక విషయం పెద్దల ముందు ప్రస్తావించదలిచాను. ప్రపంచవ్యాప్తంగా అసంపూర్ణంగా వదిలివేయబడిన నూనె (oil) మరియు సహజ వాయు బావులు ఎన్నో ఉన్నాయి. ఆ బావుల అడుగున ఎంతో కోల్ ఫైర్ ఉన్నది.  అలా అసంపూర్ణంగా వదిలేసిన బావులని పూర్తి గా ఉపయోగించగలిగితే ఎంతో విద్యుదుత్పత్తి చెయ్యవచ్చు."
"అలాంటి వదిలివేయబడిన అనాధ, అసంపూర్ణ బావులు మెక్సికో లోని గల్ఫ్ దేశాల్లోనే షుమారు 27000 దాకా ఉన్నాయి. అలాగే అమెరికా లోని టెక్సాస్ లో షుమారు 21000 దాకా ఉన్నాయి. న్యూయార్క్ లో 1800 సం లో తవ్వి వదిలేసిన బావులు షుమారుగా 2200 వరకు ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఉన్న 106,687 బావులు, ఇంకా మరికొన్ని చోట్ల ఉన్న బావులన్నీ కలిపి అమెరికా మొత్తంలో 3.1 మిలియన్ల  వరకు ఉన్నాయంటే ఆశ్చర్యం గా ఉండచ్చు. వాటిని "plug" చెయ్యటానికి అవుతున్న ఖర్చు షుమారుగా కాలిఫోర్నియాలోబావులకి  9.1 బిలియన్ డాలర్స్ ఉంటే, న్యూ యార్క్ బావులకి 435 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఆశ్చర్యంగా ఉంది కదా!"
"అమెరికా పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అంచనాల ప్రకారం ఆ బావులనించి వాతావరణంలోకి విడుదల అయ్యే మిథేన్ 281 కిలో టన్స్. అందులోఒక్క  కాలిఫోర్నియాలోని 313,000 బావుల నించి విడుదల అవుతున్న మిథేనే షుమారుగా 10 టన్నులు. అది 16 మిలియన్ బారెల్స్ ముడి చమురు వాడకంతో సమానం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇలా వదిలివేయ బడిన బావులు, వాటి నించి విడుదల అవుతున్న మిథేన్ గురించి చెప్పాలంటే అది మన ఊహకి అందదు."
"ఈ బావుల్లో ఎక్కువ భాగం 80 సం ల క్రితం తవ్వినవి. వాటి లోతు షుమారుగా 2.5 కిలో మీటర్స్.  సముద్రపు ఒడ్డున ఉన్న బావుల కధ ఇది. ఇక సముద్రం లోపల తవ్వి వదిలేసిన బావులు కూడా తక్కువేమీ కాదు. వాటి నించి విడుదల అవుతున్న మిథేన్, దానివల్ల కలుగుతున్న వాతావరణ కాలుష్యం అనూహ్యం!"
(ఇంకా ఉంది)
Information is provided by Professor D ChandrasEkharam  from the articles of James P. Williams, Amara Regehr, Mary Kang.

కామెంట్‌లు