నా సిన్నతనంల
ఎండ కాలంల ఎట్లుండెనో
సెపుతున్న.... గదేనుల్లా!
రాత్తున్న . జెర సదువుర్రి.
సివరాత్రి ఎల్లినంక
ఎండ కాలంల అగ్గి దుంకేది
బగ్గ ఎండలు గొడుతున్నప్పుడు
సోపాల ఒక్క పొంటెనే ఉండేది.
బడి పోరగాండ్లం
పొద్దుగాల వోయి
పగటీలికి ఇంటికి అచ్చెటోల్లం.
ఇంటికచ్చినంక బువ్వ తిని
ఆడుకోడానికి అవుతలకి
చెంగోబిల్ల అనుడే.
మాడి కాయల్నో,
సింత కాయల్నో,
సివ సింతకాయల్నో
రాల్లతోని రాల గొట్టుకొని
తినేటోల్లం.
మాడి పండ్లు తిన్నంక
ఎండి పోయిన
మాడి పిక్కలతోనో ,
గోటీలతోనో, సెండితో లగోరి ఆటనో, సిర్ర గోనెనో
ఏదో వొక ఆట ఆడుకునేటోల్లం.
అయ్యవ్వ పనికోయి
పొద్దూకి ఇంటికచ్చేటాల్లకు
ఏమి ఎరుకలేనట్టు
ఇంట్ల ఉండేటోల్లం.
ఒగోసారి పోరగాండ్ల తోని
లొల్లి వెట్టుకునుడు,
తిట్టుకునుడు, కొట్టుకునుడు,
కయ్యం గుడ అయేది.
ఆ కోపాలు తాటాకు మంట లెక్క ఉండేవి.
జవుడం పెట్టుకున్న
పోరగాండ్లం మల్ల రెండుమూడు దినాలకే
మాట్లాడుకునేటోల్లం.
పాసి నోటితోని సదివితే సదువు మంచిగ
యాది కుంటదని పెద్దోళ్ళు అంటే
ఎగిలి వరంగనే లేసి ,
ఎక్క ఎలిగించుకోని
పాసి నోటితోనే
వయిలు ముంగట ఏసుకొని
సదువుకునేటోల్లం.
పరీచ్చలచ్చినప్పుడు
గొట్టు ప్రశ్నలకు జెవాబులను
బట్టీ పట్టేటోల్లం.
పేపర్ మొదల్ వెట్టే ముందు
పేపర్ ఎడమ పక్కకు, మీద
'శ్రీరాములు నీవే కలవు' అని
రాసినంకనే జెవాబులు
రాసేటోల్లం. ఎవరికన్నా లిపాపలు గాని, కారట్లు గానీ రాసే టప్పుడు గుడ గిట్లనే రాసెటోల్లం.
ఇగ పరీచ్చలల్ల
తప్పకుంట పాస్ అయితమని అందరికీ బగ్గ నమ్ముకం. కానీ శానా మంది హాజిరి తోనే
పాస్ అయ్యేటోల్లు.
పదో తరగతి
పరీచ్చలల్ల కొందరు చిట్టీలు సూసుకుంట నకల్ కొట్టేటోల్లు.
సార్లకు దొరికినోడు డిబార్ అయేటోడు.
ఎనిమిదో తరగతోడు
తొమ్మిదో తరగతోని దగ్గర,
తొమ్మిదో తరగతోడు
పదో తరగతోని దగ్గర
వయిలు కొనుక్కునేటోల్లం
వయి కొంచెం చినిగితే సగం దర. కొంచెం కొత్తగ ఉంటే
ముప్పావు దరకు
కొనుక్కునేటోల్లం.
వయిలు చినిగి పోకుండ
దొడ్డు పేపర్ల తోని
పుట్టలు ఏసుకునేటోల్లం.
వయిల మీద,లోపలి కమ్మలల్ల పేర్లు రాసుకుంటే
కొనుక్కునేటోల్లం కాదుల్లా!
పేర్లు రాసిన వయిలకు,
లోపల కమ్మలు చినిగినా
దర తక్కువ పెట్టేటోల్లం.
పరీచ్చలయినంక
సుట్టాల ఇండ్లల్లకు పోయి
నాలుగైదు రోజులుండి
అచ్చేటోల్లం.
ఇంట్లనన్నా,సుట్టాలింట్లనన్నా
నెలకు ఒకటో,రెండో పండుగులో,ఇందులో
అయేటివి.
దేవునికి పెట్టుకున్నా,
ఇండ్లల్లకు పోయినా,
పురుడైనా, పుట్టెంటుకలకైనా
ఏ సిన్న పండుగులకైనా
ఇంటికి సుట్టాలు అచ్చినా,
సుట్టాలింటికి పోయినా
మూడు, నాలుగొద్దులు
ఉంటేనే మనసు నిండేది.
బగ్గ సంబురమనిపిచ్చేది.
ఔ మల్ల!
ఔ మల్ల!;-- బాలవర్ధి రాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి