ఊర్మిళ. పురాణ బేతాళ కథ .;-డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్.
 పట్టువదలని విక్రమార్కుడు శవంలో ఉన్న బేతాళుని బంధించి భుజంపైన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు'మహారాజా నీపట్టుదల అభినందనీయం. నాకు ఊర్మిళ గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు. 
'బేతాళాఊర్మిళ రామాయణంలో జనకమహారాజు కూతురు, లక్ష్మణుని భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు. సీతను రాముడికిచ్చి పెళ్ళి చేసినప్పుడు సీత చెల్లెలయిన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్ళి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరాముడు, సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితోపాటు ఊర్మిల కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధంకాగా, తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవటానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు.భర్త అరణ్య వాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రివేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో 'తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని, అన్నావదినల సేవకోసం వచ్చిన తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని' నిద్ర దేవతని వేడుకుంటాడు. నిద్ర దేవత అంగీకరించి 'నిద్ర ప్రకృతి ధర్మమని, తన నిద్రను ఎవరికైనా పంచాలని' కోరడంతో 'తన పద్నాలుగేళ్ళ నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి, ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని' లక్ష్మణుడు చెప్తాడు. భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది..ఈ పద్నాలుగేళ్ళ నిద్ర ఊర్మిళాదేవి నిద్ర అంటారు' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగంకావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు. కామెంట్‌లు