మరుదకాశి పాటల ప్రస్థానం;-- యామిజాల జగదీశ్
 ఎంజిఆర్, శివాజీ గణేశన్ తదితరులకు అద్భుతమైన పాటలు రాసిన తమిళ కవి మరుదకాశి! 
తిరైకవి తిలకం అనే బిరుదు పొందిన ఈయన సినిమా చరిత్రలో నాలుగు వేల పాటలు రాసారు.
 తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మేలక్కుడికాడు గ్రామంలో 1920 ఫిబ్రవరి 13న అయ్యంపెరుమాళ్ ఉడయార్, మిళగాయి అమ్మాళ్ దంపతులకు జన్మించారు మరుదకాశి.
ప్రాథమిక విద్య స్థానికంగానే చదువుకున్న మరుదకాశి కుంభకోణం ప్రభుత్వ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశారు.
1940లో ఆయనకు పెళ్ళయింది. భార్య పేరు ధనకోడి అమ్మాళ్.
మరుదకాశికి చిన్న వయస్సు నుంచే కవితలు రాయాలనే ఆసక్తి ఉండేది.
కాలేజీ చదువు తర్వాత కుడందై అనే ప్రాంతంలో ఉండిన దేవి నాటక సభ వారి నాటకాలకు పాటలు రాస్తూ వచ్చారు.
ఆ సమయంలోనే ఈయనకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని కలిసే అవకాశం కలిగింది. ఆ తర్వాత కరుణానిధి రాసిన మంత్రికుమారి వంటి నాటకాలకు మరుదకాశి పాటలు రాశారు.
మరోవైపు తిరుచ్చి లోకనాథన్ నేపథ్యగాయకుడిగా ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి.
వానవిల్ అనే నాటకంలోని పాటకు ఆయన సంగీతం సమకూర్చినప్పుడు మరుదకాశి కవితా శక్తిని ప్రత్యక్షంగా చూసిన లోకనాథన్ ఆయన గురించి మోడర్న్ థియేటర్ అధిపతి టి.ఆర్. సుందరంతో ప్రస్తావించారు.
వెంటనే టి. ఆర్. సుందరం మరుదకాశిని సేలం రమ్మనమని కబురుపెట్టారు. ఆ సమయాన మరుదకాశితో కలిసి కా. ము. షరీఫ్ పని చేస్తున్నారు. కనుక మరుదకాశి షరీఫ్ తో కలిసి సేలం వెళ్ళారు.
అది 1949వ సంవత్సరం. 
మోడర్న్ థియేటర్స్ (సేలం) వారు మాయావతి అనే సినిమాను నిర్మిస్తున్నారు.
టి. ఆర్. మహాలింగం, అంజలీదేవి నటిస్తున్న ఈ సినిమాకు టి. ఆర్. సుందరం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకే మరుదకాశి తొలిసారిగా పాట రాశారు. ..."పెన్ ఎనుం మాయ పేయాం పొయ్ మాదరై ఎన్ మనం నాడుమో...." అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పాటకు జి. రామనాథన్ సంగీతం సమకూర్చారు.
ఈ విధంగా మరుదకాశి సినీ ప్రయాణం మోడర్న్ థియేటర్స్ వారి మాయావతి సినిమాతో శ్రీకారం చుట్టుకుంది.
అభ్యుదయ కవి భారతిదాసన్ రాసిన ఎదిర్ పారాద ముత్తం అనే కావ్యాన్ని పొన్ముడి అనే పేరుతో మోడర్న్ థియేటర్స్ వారు ఓ సినిమా తీశారు. ఈ సినిమాకు భారతిదాసన్ మాటలు రాశారు. జి. రామనాథన్ సంగీతదర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నింటినీ మరుదకాశి రాశారు.ఈ చిత్రంలో నరసింహ భారతి కథానాయకుడిగాను, మాధురీదేవి కథానాయికగా నటించారు. 1950లో పొంగల్ (సంక్రాంతి) పండుగనాడు విడుదలైందీ సినిమా. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్టవడంతో మరుదకాశిళని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అనంతరం కరుణానిధి కథ, వచనంతో మోడర్న్ థియేటర్స్ వారు నిర్మించిన మంత్రికుమారి సినిమా విజయవంతమైంది. ఈ సినిమాకు మరుదకాశి రాసిన పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. ప్రత్యేకించి వారాయ్....నీ వారాయ్.....పోగుం ఇడం వెగు దూరమిల్లయ్....అంటూ మరుదకాశి రాసిన క్లయ్ మాక్స్ పాట, ఉలవుం తెండ్రల్ కాట్రినిలే అనే పాటసూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈ యుగళగీతాలను తిరుచ్చి లోకనాథన్, జిక్కి పాడారు.
ఈ రోజుల్లోనే మోడర్న్ థియేటల్స్ వారి కథ విభాగంలో కణ్ణదాసన్, పాటల విభాగంలో మరుదకాశి పని చేస్తూ వచ్చారు.
మంత్రి కుమారి సినిమాలో మరుదకాశి రాసిన పాటలు ఎం.కె. త్యాగరాజ భాగవతారుని ఆకట్టుకున్నాయి. సురదా కథ, మాటలం, ఎఫ్. నాగూర్ దర్శకత్వంలో రూపొందిన తన సినిమా అమరకవికి పాటలు రాయవలసిందిగా మరుదకాశిని త్యాగరాజభాగవతార్ పిలిపించారు. దాంతో ఈ సినిమొలోనూ మరుదకాశి పాటలు రాశారు.
అరుణా ఫిలింస్ సంస్థ రాజాంబాళ్ అనే డిటెక్టివ్ కథను సినిమాగా నిర్మించింది. ఈ సినిమాతోనే ఆర్. ఎస్. మనోహర్ కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాకుకూడా మరుదకాశి పాటలు రాశారు. అనంతరం ఇదే అరుణా ఫిలింస్ బ్యానర్ కింద  విడుదలైన తూక్కి తూక్కి సినిమాకుకూడా మరుదకాశి పాటలు రాసే ఆవకాశం లభించింది. ఈ సినిమాలో శివాజీగణేశన్, లలిత, పద్మిని, రాగిణి, టి.ఎస్. బాలయ్య తదితరులు నటించారు. ఆర్. ఎం. కృష్ణసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జి. రామనాథన్ సంగీతరచన చేశారు. ఈ సినిమాలో శివాజీకి ఎవరితో పాట పాడించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు మంత్రికుమారిలో అన్నమిట్ట వీట్టిలే కన్నక్కోల్ సాత్తవే....అనే పాటను టి.ఎం. సౌందరరాజన్ అద్భుతంగా పాడారని, ఆయనతోనే పాడిద్దామని మరుదకాశి, దర్శకుడు కృష్ణసామి అనుకున్నారు. కానీ చిదంబరం జయరామన్ తో పాడించమని శివాజీ అడిగారు. చివరకు మూడు పాటలు సౌందరరాజన్ తో పాడిద్దాం. శివాజీకి నచ్చితే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాలనుకున్నారు. ఆ మేరకే మూడు పాటలు సౌందరరాజన్ తో పాడించి వినిపించగా అవి శివాజీకి నచ్చాయి. ఆ రోజు నుంచి శివాజీకి సౌందరరాజన్ పాడటం మొదలైంది. ఈ సినిమా 1954 ఆగస్ట్ 26న విడుదలై పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. గీతరచయిత మరుదకాశికి ఎన్నో సంస్థలనుంచి ఆహ్వానాలొచ్చాయి. 
ట్యూనుకి పాటలు రాయడంలో మరుదకాశి దిట్ట. కనుక సంగీతదర్శకులకు ఆయనంటే బాగా ఇష్టం.
ఆరోజుల్లో జి. రామనాథన్, కె.వి. మహదేవన్, ఎస్. దక్షిణామూర్తి, విశ్వనాథన్ - రామమూర్తి తదితర సంగీతదర్శకుల చిత్రాలకు మరుదకాశి పాటలు రాశారు.
రెండు వందల యాభై పైగా సినిమాలలో నాలుగు వేలుపైచిలుకు పాటలు రాసిన  మరుదకాశి అనువాద చిత్రాలకెన్నో పాటలందించారు.
1956లో మోడర్న్ థియేటర్స్ వారు నిర్మించిన  అలీబాబావుం 40 తిరుడర్గలుం సినిమాకు హిందీ సినిమాకు స్వరపరచిన బాణీలతోనే ఈ సినిమాకు పాటలు రాయించాలని ఉడుభలై నారాయణకవిని పిలిపించారు. అయితే నారాయణకవి తాను కొత్త బాణీలకే పాటలు రాస్తానంటూ మరుదకొశితో పాటలు రాయించుకోమని సూచించారు. ఈ సినిమాకు మరుదకాశి రాసిన తొమ్మిది పాటలూ హిట్టయ్యాయి.
తమిళ సినిమాలో తన పాటలతో ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న మరుదకాశి 1989 నవంబర్ 29న తుదిశ్వాస విడితారు.
కామెంట్‌లు