ఇంగ్లీషులో రాసిన తొలి భారతీయ రచయిత్రి ! ;- - యామిజాల జగదీశ్
 మన భారతదేశం బహు భాషలతో కూడిన సువిశాల దేశం. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో భారతీయులలో అధికశాతం మంది ఇంగ్లీషు చదువులు చదివి రకరకాల ఉద్యోగాలు చేసారు. అటువంటి వారిలో కొందరు కాలక్షేపంకోసం ఆ భాషలో ఉన్న కథలు చదువుతుండేవారు. బాగున్నవి చుట్టుపక్కాలతో చదివించేవారు. 
స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ పాఠాలు చెప్పిన ఐరోపియా ఫాదర్లు తమ విద్యార్థులను పాఠ్యపుస్తకాలుతప్ప మిగిలినవి చదవకూడదని, అవి సముచితం కాదని, తప్పుడు పనులు చేయడానికి రెచ్చగొడతాయని చెప్పేవారు.
అయినప్పటికీ కథలు చదువుతూ వచ్చిన పలువురు స్త్రీలు, పురుషులు వాటి గురించి చర్చించుకునేవారు. కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న తర్వాతకూడా ఇటువంటి కథలను చదవడం మానలేదు. పురుషులకన్న స్త్రీలే కథల పుస్తకాలను గుట్టుగా చదివేవారు. వారిలో కొందరు ఇంగ్లీషులో చదివిన నవలలు, చిన్న కథలలా తమ దేశ ప్రజల కథలను రాయాలని ఆరాటపడ్డారు. మాతృభాషలో కాకుండా ఇంగ్లీషులో రాస్తే ఒక్క మన దేశంలోనే కాకుండా ఇంగ్లండులోనూ అనేకమంది చదువుతారని అనుకున్నారు. పత్రికలలో సమీక్షలు వస్తాయని, తమ రచనలకు బహుమతులు వస్తాయని ఆశించారు. ఈ ఉద్దేశంతో వారితో కలం పట్టించింది.
మన దేశంలో పందొమ్మిదో శతాబ్దంలో ఇంగ్లీషు భాషలో సగుణ, కమల అనే నవలలను రాసి ప్రసిద్ధి చెందిన రచయిత్రి కృపాబాయి సత్యనాథన్. మన భారత దేశంలో ఇంగ్లీషులో మొట్టమొదటగా నవలలు రాసిన మహిళగా చరిత్ర పుటలకెక్కారు.
తన సొంత కథను చెప్తున్నట్టుగానే సగుణ నవలను రాసిన కృపాబాయి చెన్నైలో ఉండేవారు. ఈ నవల రాస్తున్నప్పుడు ఆమె వయస్సు ఇరవై అయిదేళ్ళు.
ఆమె 1862లో ముంబైలో మరాఠీ భాషను మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి క్రైస్తవ మతంలోని ప్రాటెస్టంట్ శాఖలో చేరిన మొదటగా చేరారు. విద్యావంతులు. ఆయన పేరు హరిబంధు. తల్లి రాధాబాయి. ఈ దంపతులకు కృపాబాయి పదమూడో సంతానం.
మద్రాస్ మెడికల్ కాలేజీలో మొదటిసారిగా ఆడవాళ్ళకు ప్రవేశం కల్పించిన కాలంలో కృపాబాయికి అక్కడ చదివే భాగ్యం కలిగింది. అయితే ఎక్కడ బస ఛేయడమనేది సమస్యగా మారింది.
 చెన్నైలో తమిళం మాట్లాడే హిందువుల కుటుంబంలో జన్మించిన తిరువేంకట నాయకర్ క్రైస్తవులుగా మతం మారి ఓ పాఠశాల నడుపుతున్నారు. ఆయన భర్య అన్నల్ మాణిక్యంతో కలిసి క్రైస్తవ ప్రచారం చేస్తుండేవారు. వారితో కృపాబాయి కుటుంబానికి మంచి పరిచయమే ఉండేది. దీంతో వారికి ఉత్తరం రాశారు. దానికి జవాబు రాస్తూ తిరువేంకట నాయకర్ కృపాబాయి తమ ఇంటే ఉండి మెడికల్ కాలేజీలో చదవవచ్చని చెప్పారు. ఓ అతిథికి ఇవ్వవలసిన గౌరవం, రక్షణ తామిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఉత్తరంతో కృపాబాయి ముంబై నుంచి ఒక్కరే చెన్నై వచ్చారు. ఆమెకు చెన్నై వాతావరణం నచ్చింది. చెన్నై మెరీనా బీచ్, దేవాలయాలకూ తరచూ వెళ్తుండే కృపాబాయి చక్కగా చదువుకున్నారు. ఆమెకు ఇంగ్లీషులో మంచి పట్టుండేది. ప్రథమ సంవత్సరంలో తోటి విద్యార్థులకన్నా అనేక పాఠ్యాంశాలలో ఎక్కువ మార్కులు సంపాదించారు. బహుమతులూ అందుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యం తరచూ దెబ్బతినేది. దాంతో ఆమె కాలేజీకి సక్రమంగా వెళ్ళలేకపోయారు. 
మరోవైపు తిరువేంకట నాయకర్ మనవడు సామ్యువేల్ సత్యనాథన్ అప్పట్లో లండన్లో చదువు పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్నారు. తమ ఇంట గుణవంతురాలై అతిథిగా ఉంటున్న కృపాబాయితో సన్నిహిత సంబంధాలు పెంచుకున్నారు సత్యనాథన్. వీరి మధ్య ప్రేమ చిగురించిందీ.
అప్పుడు కృపాబాయి వయస్సు పంతొమ్మిదేళ్ళు. అటూ ఇటూ పెద్దలు, మిత్రుల అంగీకారంతో సత్యనాథన్, కృపాబాయిలు పెళ్ళి చేసుకున్నారు.
సామ్యువేల్ సత్యనాథన్ కి చెన్నై మాగాణంలో ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగం లభించింది. ఉదకమండలంలో ప్రధాన అధికారిగా నియమితులయ్యారు.
కృపాబాయికి ఉదకమండలంలోని పర్వతాలు, చెట్లు, అక్కడి ప్రశాంతవాతావరణం ఎంతగానో నచ్చాయి. 
అక్కడి గిరిజనులతో సన్నిహితంగా మెలగిన కృపాబాయి వారి జీవితవిధానాలను సంప్రదాయాలను ఆచారవ్యవహారాలను మాట్లాడే తీరును తెలుసుకున్నారు. వాటి గురించి ఇంగ్లీషులో రాసి పత్రికలకు పంపుతూ వచ్చారు.
ఆమె స్త్రీ విద్య, వారి పురోగతిపట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఆ దిశలో రచనలు చేసారు.
స్త్రీలు సొంతంగా చదువుకోవాలని, ఎవరి మీదా ఆధారపడకూడదని అంటుండేవారు.
అప్పట్లో ఉదకమండలంలో ఇస్లాం మహిళలు చదువుకోకుండా ఉండటం చూశారు. దాంతో వారి చదువుకోసం ఇస్లాం పురుషులుకానీ చర్చికానీ మదరసాలుకానీ ముందుకు రాకపోవడంతో ఆమె బాధపడ్డారు. ఇక లాభం లేదనుకుని తనే సొంతంగా ఇస్లాం స్త్రీలకోసం ఒక చిన్న పాఠశాల ప్రారంభించారు. ఆమె భర్త ఉద్యోగం నిమిత్తం రాజమండ్రి తదితర ప్రాంతాలలో వెళ్ళివస్తుండేవారు. దాంతో ఆమెకు ఎంతో సమయం లభించడాన్ని ఒకవైపు ఇంగ్లీషులో నవలలు చదువుతూ మరోవైపు స్త్రీలకు విద్య ప్రాధాన్యాన్ని చెప్తుండేవారు. ఈళక్రమంలో ఆమెకు తనే సొంతంగా ఒక నవల రాయాలనుకున్నారు. తన జీవితాన్నే ఆధారంగా చేసుకుని సగుణ అనే నవల రాశారు. తన జీవితానుభవాలతోనే ఇందులోని కథనం నడిపించారు.ఈ నవలను చెన్నై క్రైస్తవ కాలేజీ పత్రిక 1887, 1888 సంవత్సరాలలో సీరియల్ గా ప్రచురించింది. 
కృపాబాయికి ఓ ఆడబిడ్డ జన్మించింది. కానీ ఆ పాప చిన్నవయస్సంలో చనిపోయింది. ఆమె బంధువులలోనూ పలువురు మరణించారు. తనూ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. మెరుగైన చికిత్సకోసం ఆమెను పుణె తీసుకుపోయారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఇక చేయడానికేమీ లేదంటూ చెప్పేసారు. దీంతో మళ్ళీ సత్యనాథన్ దంపతులు చెన్నై వచ్చేసారు. కానీ కృపాబాయి తన జబ్బు గురించి ఏమాత్రం లెక్కచేయకుండా నవల రాయడంపై దృష్టిపెట్టారు. అప్పుడు రాసిన నవలే "కమల". ఇది ఒక స్త్రీ జీవిత గాథ. మనసూ ఆరోగ్యం సహకరించకపోవడంతో కలం పట్టుకోలేకపోయారు. ఆమె చెప్తుంటే భర్త సామ్యువేల్ సత్యనాథన్ రాస్తుండేవారు. 1894లో కమల నవల పూర్తయింది. దీనినికూడా చెన్నై క్రైస్తవ కాలేజీ పత్రికే ప్రచురించింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ తన ముప్పై రెండో ఏట మరణించారు.
ఆమె చనిపోయిన రెండేళ్ళకు సగుణ, కమల నవలలు పుస్తక రూపంలో అచ్చయ్యాయి.
ఈ రెండింటికీ విశేష ఆదరణ లభించింది.
 ఈ పుస్తకాలను ప్రచురించిన వారే బ్రిటీష్ రాణి విక్టోరియాకు కానుకలుగా పంపారు.
ఈ రెండింటినీ చదివిన రాణి కృపాబాయి ఇతర రచనలుంటే పంపమని కోరారట.
1890లో  కమల నవల కమలం అనే పేరిట లండన్లోనూ, చెన్నైలోనూ నడుస్తున్న క్రైస్తవ సాహిత్య సంస్థ తమిళంలో అనువదించి ముద్రించింది. మరో రెండేళ్ళకు సగుణ నవలనుకూడా తమిళంలో అనువదించి ప్రచురించారు. తమిళంలో ఎస్. పాల్ అనువదించారు. ఈయన తిరునల్వేలి క్రైస్తవులు. కనుక నవలలో తిరునల్వేలిలో మాట్లాడే తమిళ పదాలే ఎక్కువగా ఉన్నాయనుకునేవారు. కమల, సగుణ నవలలం తమిళంలోకి అనువదించబడి నూరేళ్ళు దాటింది. కానీ ఈ రెండింటికీ తమిళ నవలా సాహిత్యంలో ఇప్పటికీ ఆదరణ ఉండటం విశేషం.
కామెంట్‌లు