వెంటాడే పద్యం; మీసాల సుధాకర్.-తెలుగు అధ్యాపకుడుఖిలాషాపురం, జనగామ జిల్లా.
సీ. ధరణిలో వేయేండ్లు – తనువు నిల్వగబోదు
ధన మెప్పటికి శాశ్వ – తంబు గాదు
దారసుతాదులు – తనవెంట రాలేరు
భ్రుత్యులు మృతిని ద – ప్పింపలేరు
బంధుజాలము తన్ను – బ్రతికించుకోలేరు
బలపరాక్రమ మేమి – పనికి రాదు
ఘనమైన సకల భా – గ్యం బెంత గల్గిన
గోచిమాత్రంబైన – గొనుచుబోడు
తే. వెఱ్ఱి కుక్కల భ్రమలన్ని – విడిచి నిన్ను
భజన జేసెడివారికి – బరమసుఖము.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

ఓ జగన్నాథా!పరమాత్మా!నరశింహా!ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై నిల్వజాలదు.ధనమెప్పటికీ స్థిరముగాదు. భార్యాబిడ్డలు తన వెంటరారు. భృత్యులు మృతువును తప్పించలేరు. బంధువులు బ్రతికించలేరు. బలపరాక్రమములు పనికిరావు.గొప్ప సంపదకల్గియున్నను ఇసుమంతైనా వెంటబెట్టు కొని పోడు. వెఱ్ఱికుక్కల వంటి అనగా పనికిమాలిన తలంపులు(ఆలోచనలు)మాని నిన్నే మనఃస్ఫూర్తిగా భజించెడు వారికి ఇహపర సౌఖ్యములిచ్చి కాపాడే దాతవు నీవేగదా!

కామెంట్‌లు