విషాదమే...; -- యామిజాల జగదీశ్
 "బ్యాడ్ న్యూస్..." తెలిసిందా మీకు అని చక్రధర్ ఫోన్లో అడిగారు. 
తెలీదండి అన్నాను. ఏమైందని అడిగాను.
తల్లావజ్ఝల సుందరం పోయారన్న విషాద సమాచారాన్ని తెలిపారు.
తల్లావజ్ఞల శివశంకరస్వామిగారి మనవడు, కృత్తివాసతీర్థులగారి కుమారుడు అయిన సుందరంగారితో నాకున్న పరిచయం అంతంతే. కానీ ఆయన తమ్ముళ్ళు శివాజీ, లలితాప్రసాదులతో చెప్పుకోతగ్గ, చెప్పుకోవలసిన సాన్నిహిత్యమే ఉంది. పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పరిచయముంది. 
చిక్కడపల్లిలో ఉంటున్న రామడుగు రాధాకృష్ణగారింటి ఎదురింట్లో ఉండేవారు సుందరం గారు. చిక్కడపల్లికి పని మీద వెళ్ళినప్పుడు సుధా హోటల్ పరిసర ప్రాంతాలలో సుందరంగారు కనిపించినప్పుడు ఓ పలకరింపు. అలాగే దగ్గరగా చూడటం లలితాప్రసాద్ గారింట జరిగింది. 
నటుడు, దర్శకుడు, ప్రయోక్తగా మంచి గుర్తింపుపొందిన సుందరంగారు కథలు, నవలలు కూడా రాసారన్నది లలితాప్రసాద్ వల్ల తెలిసింది. 
తనికెళ్ళ భరణిగారి నాటకాలన్నింటికీ సుందరంగారే దర్శకత్వం వహించడం విశేషం. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత గాఢమైందంటే భరణిగారు సినిమా షూటింగులు లేనిరోజుల్లో సుందరంగారితో గడిపేవారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సుందరంగారిని పలకరించకుండా ఉండేవారు కాదాయన. 
విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో సుందరం - భరణి నాటకాలకున్న ప్రేక్షకాదరణ ఇంతా అంతా కాదు. 
దేవదాస్ కనకాలగారు నటీనటులకోసం ఓ సంస్థ పెట్టిన కొత్తల్లో సుందరంగారితో నటనకు సంబంధించిన మెళకువలను పాఠాలుగా చెప్పించారు. 
అమీర్ పేటలోని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కొద్ది కాలమే పని చేసిన సుందరంగారు గాంధీనగర్లో నివాసమున్నప్పుడు ఆయన ఇల్లెప్పుడూ నటులతో పెళ్ళిసందడిలా ఉండేది.
సుందరంగారనే పేరు తలవడంతోనే నాకు గుర్తుకొచ్చేది గోగ్రహణం నాటిక. 
ఈమధ్యే శివాజీగారు సుందరంగారితో ఏదన్నా రాయించి దానికి తాను బొమ్మలు వేసిస్తానని ఒప్పించారట. పిల్లలిద్దరూ విదేశంలో ఉండి ఒంటరిగా ఫీలవుతున్న సుందరంగారింట కొంతకాలం గడుపుదామనుకున్న శివాజీ దంపతుల ఆశ నెరవేరేలోపే డెబ్బై రెండేళ్ళ ఆయన కాలధర్మం చెందడం విషాదభరితం. 
సుందరంగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ రెండు మాటలూ ఆయన కళకు అర్పిస్తున్నాను.


కామెంట్‌లు