సిక్కిల్ సిస్టర్స్ వేణునాదం; - జగదీశ్ యామిజాల
 తమిళనాడులో వేణునాదం అనగానే ప్రముఖంగా స్ఫురణకు వచ్చే పేర్లు టి.ఆర్. మహాలింగం, ఆయన శిష్యుడు, సంగీత కళానిధి ఎన్. రమణి, జంటగా కచేరీలు చరిత్ర సృష్టించిన  సిక్కిల్ సిస్టర్స్. సిక్కిల్ సిస్టర్స్ లో కుంజుమణి అక్క. నీల చెల్లెలు. సిక్కిల్ సిస్టర్స్ సంగీత కుటుంబం నుంచి వచ్చినవారు. కుంజుమణి 1927 జూన్ పదో తేదీన జన్మించారు. 2010 నవంబర్ 13న మరణించారు. నీల 1940 సెప్టెంబర్ 9న జన్మించారు.
"అదిగో ఓ చిన్నమ్మాయి (కుంజుమణి) ఫ్లూట్ వాయిస్తోందిరా. వెళ్ళి చూసొద్దాం" అని అనుకునేవారు. మొదట్లో ఆమె ఒక్కతే వేణునాద కచేరీలు చేసేవారు. ఆరోజుల్లో వేణువు అనగానే పురుషులదే ఆధిపత్యం. అటువంటి కాలంలో కుంజుమణి వేణువుతో వేదికలపై కనిపించడంతోనే అందరూ విడ్డూరంగా చెప్పుకునేవారు. 
కుంజుమణి పెదనాన్న అయియూర్ నారాయణస్వామి అయ్యర్ వేణువు విద్వాంసుడు. 
నారాయణ స్వామి సోదరులది ఉమ్మడి కుటుంబం. వారి మధ్య పెరిగారు సిక్కిల్ సిస్టర్స్. ఇంట్లో ప్రతి ఒక్కరికీ సంగీతంతో ఏదో విధంగా బంధముండేది. 
సిక్కిల్ సిస్టర్స్ తండ్రి నటేశ అయ్యర్ గాత్రకచ్చేరీలు చేయడంతోపాటు మృదంగం వాయించేవారు. ఆయన మరొక సోదరుడు రామనాథయ్యర్ కూడా మృదంగ విద్వాంసుడే. ఈయన మద్రాసువాసి.  హరికథలు చెప్తుండే సరస్వతీ బాయి కార్యక్రమాలలో రామనాథ అయ్యర్ మృదంగం వాయించేవారు.
కుంజుమణి తొలి గురువు పెదనాన్న నారాయణస్వామి. ఆయన దగ్గర రెండేళ్ళు సంగీతం నేర్చుకున్నారు. అయితే కీర్తనలు రాగాలు వంటివి తండ్రి పాడుతుంటే విని ఆమె వేణువుపై వాయించేవారు. కొన్ని పాటలేమో పెదనాన్న నుంచి నేర్చుకున్నారు. కాళక్కాడ్ రామనాథ అయ్యర్ నుంచి బ్రోచేవారెవరురా (మైసూరు వాసుదేవాచార్య) కీర్తనను కుంజుమణి నేర్చుకున్నారు.
నాగూరులో నిర్వహించే రాధాకళ్యాణం, శ్రీరామ నవమి ఉత్సవాలకు తండ్రి నటేశ అయ్యర్ సిక్కిల్ సిస్టర్స్ ని క్రమం తప్పక తీసుకువెళ్తుండేవారు. అక్కడ సాయంత్రాలు కచ్చేరీలు జరిగేవి. రాత్రిపూటేమో కథాకాలక్షేపాలుండేవి.
ఓమారు నాగూరులో హార్మోనియం విద్వాంసుడు సుబ్రమణ్య దీక్షితరు కచేరీలలో తండ్రి నటేశ అయ్యర్  మృదంగం వాయించేవారు. ఆ వెంటనే జరిగిన కార్యక్రమంలో కుంజుమణి మొదటిసారిగా వేణువు కచేరీ చేయడం విశేషం. కుంజుమణికి  వేణునాద కచేరీలో తిరువారూర్ సుబ్బయ్యర్ వాయులీనంతోనూ,  తండ్రి నటేశ అయ్యర్ మృదంగంతోనూ సహకరించారు. 
 
ఇక నీలకు వేణునాద గురువు కుంజుమణే.  అయితే పెళ్ళయ్యాక కుంజుమణి తన భర్త ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో  నివసించవలసి వచ్చింది. అయినప్పటికీ ఎప్పుడు పుట్టింటికి వచ్చినా ఆమె చెల్లెలు నీలూకి వేణువు నేర్పిస్తుండేవారు. ఏడాదిన్నరలోపే నీలు వేణువుపై రాగాలు, స్వరాలు పలికించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
కుంజుమణి తొమ్మిదో ఏట నుంచీ,
నీల ఎనిమిదో ఏట నుంచీ కచేరీలు చేయడం మొదలుపెట్టారు. సిక్కిల్ సిస్టర్స్ ఆలిండియా రేడియో కళాకారులుగా అనేక కార్యక్రమాలు చేశారు.
పద్మశ్రీ (2004), కళైమణి (1973), సంగీత నాటక అకాడమీ అవార్డు (1989), సంగీత చూడామణి (1994), సంగీత కళా శిఖామణి (1997), సంగీత కళానిధి (2002) తదితర పురస్కారాలు పొందిన సిక్కిల్ సిస్టర్సులో చిన్నవారైన నీలకి నాలుగో ఏడు వచ్చేవరకూ మాటలే రాలేదు. వీరింట ఓ కృష్ణుడి బొమ్మ ఉండేది. ఆ బొమ్మంటే నీలకు ఎంతో ఇష్టం. కృష్ణుడి బొమ్మలో ఉన్న వేణువు చూసి తానూ వాయించాల నుకునేవారు. ఓమారు వచ్చీరాని మాటలతో కృష్ణుడికి సంబంధించిన ఓ కీర్తనను పాడిన నీలలోని సంగీంపట్ల ఉన్న ఆసక్తిని గ్రహించి
ఆమె ఏడ ఏట అక్క కుంజుమణి వేణువు నేర్పించడం మొదలుపెట్టారు. 
 
నీల అరంగేట్ర కచేరీ సిక్కిల్ సింగారవేలర్ ఆలయంలో జరిగింది. ఆమె తొలి కచ్చేరికి రామభాగవతార్ వయోలిన్ పైనా తండ్రి మృదంగంపైనా సహకారమందించారు. ఆ తర్వాత స్థానికంగా చిన్న చిన్న కార్యక్రమాలలోనూ, స్కూల్లోనూ నీల సోలోగా వేణువు వాయిస్తూ వచ్చారు.
తిరుత్తురైపూండిలో ఓ ధనవంతుడు కృష్ణజయంతి ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించి నీలను స్వర్ణపతకంతోను,  అపూర్వ వేణుగాన బాలకృష్ణ అవతార అనే టైటిల్ తోను సత్కరించారు.
 
కుంజుమణి, నీల జంటగా వేణునాద కచేరీ మొదటిసారిగా తంజావూరులోని కాశీ విశ్వనాథ ఆలయంలో చేశారు. 1953 నుంచి వీరిద్దరూ కలిసి అనేక వేదికలపై కచేరీ చేశారు. దేశ విదేశాలలో జంటగా వేణువు వాయిస్తూ తిరుగులేని సంగీత విద్వాంసులుగా వినుతికెక్కారు.
నీల కుమార్తె మాలా చంద్రశేఖర్ కూడా వేణువిద్వాంసురాలే కావడం విశేషం. 1963 ఆగస్టు 23న జన్మించిన మాలా అయిదో ఏట తల్లి (నీల), పెద్దమ్మ (కుంజుమణి)ల నుంచి వేణునాదం నేర్చుకున్నారు. అయితే మాలా తొలి కచేరీ మాత్రం పదిహేనో ఏట ఏర్పాటైంది. ఆధ్యాత్మిక గురువు మణిస్వామిగళ్ నివాసమైన శక్తివేళ్ (మైలాపూర్, మద్రాసు)లో మాలా వేణువు వాయించారు. మాలా వేణునాద కచేరీలో ఎస్.డి. శ్రీధర్ వయోలిన్, ఎస్. వి. రాజారావు మృదంగం వాయించారు. అనంతరం ఈమె కూడా రేడియో కళాకారిణిగా అనేక కచేరీలు చేశారు. 
ఇక కుంజుమణి మనవడు, సిక్కిల్ సి. గురుచరణ్ కి కూడా సంగీత విద్వాంసుడిగా రాణిస్తుండటం గమనార్హం. ఆలిండియా రేడియోలో ఈయన "ఎ" గ్రేడ్ కళాకారుడు. గురుచరణ్ తల్లి మైధిలి.
కామెంట్‌లు