రుద్రమ కావాలి;-కాటేగారు పాండురంగ విఠల్;-కలం స్నేహం
బాల్యంలో చూపులతో పొడుస్తున్నారు
పాలని నమ్మితే విషం చిమ్ముతున్నారు
పక్కపక్కనేవుండి పామై కాటేస్తున్నారు
కసితో పసి కాయలనే తెంపేస్తున్నారు
బంధువులే రాబంధులౌతున్నారు

కరకు కోరలతో కామాంధులై కాటేస్తున్నారు
తోడుండే వాళ్లే తోడేళ్ళై చీల్చి చెండాడుతున్నారు
గుంటనక్కల్లా నక్కి నయవంచన చేస్తున్నారు
గతి మతి తప్పి అత్యాచారాలు చేస్తున్నారు
అడుగడుగున కాలనాగులు చరిస్తున్నవి

పనిచేసేచోట పాపపు పురుగుల చూపులు
ప్రయాణంలో పరమ దుర్మార్గపు చూపులు
దారి పోడూతా దయే లేని దుష్ట చూపులు
గడపదాటితే గమనించే కామపు చూపులు
అవి తూపులై అణువణువు రక్కుతాయి

అన్నా అంటే అనుభవించాలని చూస్తాడు
తమ్మీ అంటే ఒళ్ళు తడుమాలని చూస్తాడు
బాబాయ్ అంటే భంగపరచాలని చూస్తాడు
మామయ్య అంటే ఏదోచేయాలని చూస్తాడు
బంధుత్వం కూడా భయం గొల్పుతున్నది

సప్తవర్ణ సీతాకోక చిలుక కాదు బాకు కావాలి
పంచరంగుల రామచిలుక కాదు చాకు కావాలి
నవ్యవన్నెల సుందరపుష్పం కాదు కత్తి కావాలి
చెడును చీల్చి చెండాడే అపర కాళికవు కావాలి
నిన్ను నీవు రక్షించుకునే రుద్రమ కావాలి


కామెంట్‌లు