కన్నీటి రహస్యం;-- తమిళంలో కవికో- అనుసృజన - జయా
భగవంతుడా!
నాకు నవ్వు ఇవ్వు అని
ప్రార్థించాను

అతను 
కన్నీరిచ్చావు!!

వరమడిగాను
శాపాన్నిచ్చేసావు అన్నాను!!

భగవంతుడు చెప్పాడు

వర్షం వద్దని 
పంట మాత్రం ఇవ్వు
అని
ఏ రైతైనా అడుగుతాడా?

కానీ
నువ్వలాగే
అడుగుతున్నావు

కన్నీటిలో నవ్వు
నవ్వులో కన్నీరు
దాగి ఉండటం
నీకు తెలీలేదు!

నిజం చెప్పాలంటే
కన్నీరు
కళ్ళ నవ్వులు!

నవ్వు
పెదవుల కన్నీరు!

తెల్లవారుజామున 
పువ్వులపై 
మంచుబిందువులను
నువ్వు చూసింది లేదా?

నవ్వు
తనను కన్నీటితో
అలంకరించుకుంటుంది
అద్భుతం కదూ అది!!

వర్షమేఘాలలో
మెరుపులు కనిపించడం
నువ్వు చూసింది లేదా?

కన్నీటి నుంచి
నవ్వు పుడుతుంది
అందం కదూ అది?

ముత్యం ఆనేదేంటీ?

అల్చిప్పలోంచి
తపస్సు చేసే కన్నీటి చుక్క
నవ్వవడం అతిశయమే కదా!!

 కన్నీటిలో వికసించే
నవ్వుల పువ్వులు
వాడిపోవడం లేదనే దాన్ని
తెలుసుకో!

ఇంకా 
కన్నీరే
నిన్ను చూపుతోంది!!

నవ్వేమో
కొన్ని సమయాలలో
నీకు తెర అవుతోంది!!


కామెంట్‌లు