చల్లని నీడన దేవకాంచనంతో;-- యామిజాల జగదీశ్
 నాది కొంచెం అత్యాశే
అందుకే
నిన్ను కోరుకున్నాను
అయితే
లోభిని కాను
నువ్వు అందరికీ
చెందుతావని తెలిసికూడా
నిన్ను కోరుకున్నాను (పుట 114)
- ఇది చూడటంతోనే వేదాంతసూరిగారితో ఈ పుస్తకం కావాలని అడగటం, ఇస్తాను కానీ సమీక్ష రాసివ్వండి అన్నారు. ఇంకేముంది...మనసుకి రెక్కలొచ్చాయి. కవయిత్రి వసుధారాణిగారి దేవకాంచనం నీడన కవితా సంపుటి నాలోకొచ్చేస్తోంద నుకుని సంబరపడ్డాను. తీరా ఇంటికొచ్చి చదువుతున్న కొద్దీ చదువుతున్నట్టు, వసుధారాణిగారెలా ఇన్ని రకాల భావాలను పొదిగారో ఆలోచించడంతోనే సరిపోయింది. ఈ పుస్తకం మీద నేనేం రాసినా అది వాడిన పువ్వే అవుతుంది. నా అభిప్రాయం వెలవెలబోతుంది అనే జంకుతో పక్కన పెట్టేశాను. కానీ మాట ఇచ్చినందుకైనా ఓ నాలుగు ముక్కలు రాసివ్వాలిగా...అది నా కనీస ధర్మం. ఏ పుస్తకం చదువుతు న్నప్పుడైనా నాలోని అజ్ఞానం ఎంతకంతకు బయటపడుతుంటుంది. అయితే ఈ దేవకాంచనం నీడనలోని భావాలు చదువుతుంటే నాలోని అజ్ఞానం మరింత అధికంగా తెలిసొచ్చింది. 
దేవకాంచనాలు, నివేదనలు, సంవేదనల పర్వాలు మూడూ పద్దెనిమిదో పేజీ మొదలుకుని రెండు వందల యాభయ్యో పేజీవరకూ సాగాయి. మొత్తం ఏడు వందలకుపైగా ఉన్న ఈ కవితా సంపుటిలో ఫలానాది బావుంది ఫలానాది సాధారణంగా ఉంది ఫలానాది తేలిపోయింది ఫలానాది అర్థం కాలేదు అనడానికే వీలులేని విధంగా ఒకదానికొకటి ఎంత చక్కగా చిక్కగా ఉన్నాయో కవితలు. 
ఠాగూర్, సూఫీ, రూమీ సాహిత్యం చదువుతున్నప్పుడు కలిగే ఆనందానికి ఏమాత్రం తగ్గకుండా వసుధారాణిగారి కవితలూ ఎంతో హాయిగా అన్పించాయి హృదయానికి. ఏ సందర్భానికైనా జవాబు చూసుకోవచ్చు ఈమె భావాలలో. 
ఈ పుస్తకంతో కలిపి వసుధారాగారి మొత్తం మూడు పుస్తకాలు తిరగేసాను. మూడూ వేటికవే గొప్పగా ఉన్నాయి. 
పుస్తకమంతా బాగున్నా అన్నింటినీ ఇక్కడ పొందుపరచలేను కనుక కొన్నింటిని మాత్రమే పేర్కొంటున్నాను....
అప్పుడెప్పుడో
ప్రేమాతిశయంతో
నిన్ను వజ్రం అన్నాను
ఇప్పుడూ అదే అంటున్నాను
విశ్వంలో అతి కఠినమైన 
రాయి వజ్రమని (పుట 101)
---------
ఎటువంటి సూచనా లేకుండా
ఈ "ప్రేమ" ఒకటి వచ్చి, 
నా ప్రణాళికా బద్ధమైన జీవితాన్ని 
భగ్నం చేసింది. (పుట 196)
ఇది చాలా చాలా కరెక్టు. అనుభవపూర్వకంకూడా.
-----------
మా పెరటి మొక్కలన్నింటిలోకీ
వానొస్తే దేవకాంచనం 
మరీ ఎక్కువ మురిసిపోతుందేమో!
రాత్రి కురిసిన వానకి ఉదయాన్నే 
మెరిసిపోతోంది (పుట 38)
- వర్షం వెలసిన తర్వాత మొక్కలన్నీ ఇంతే!
------------
మనిద్దరికీ ఎన్ని గొడవలు ఉన్నా సరే
ప్రపంచం మనల్ని ప్రేమికులంటోంది
మన గొడవ ఎన్నటికీ తీరేది కాదు
బహుశా అదే ప్రేమా? (పుట 226)
-----------
నువ్విక్కడ దాక్కుని ఉన్నావని
తెలీక
అమాయకపు యశోదమ్మలా 
ఊరంతా వెతికాను (పుట 76)
- ఇది చదివినప్పుడు ఠకీమని స్ఫురణకు వచ్చాయి చలంగారి యశోదాగీతాలు.
---------
నేనేమీ పిలవలేదు
నీ అంతట నువ్వే 
వచ్చావు
నీ అంతట నీవే
వెళ్ళిపోతావేమో అనే
భయం పట్టుకుంది ఇప్పుడు (పుట 77)
- ఇటువంటి సందర్భాలనేకం నా జీవితపయనంలో.
-----------
నిన్ను వదిలేయాలి
అంటే
నా నుంచి నేనే పారిపోవాలి
ఎలానో తెలియటం లేదు ( పుట132)
- పారిపోవానే అనుకుంటాం కానీ అది జరగని పని.
-------------
ప్రేమా, ద్వేషమా, కోపమో, భయమో
మనసుకు ఎప్పుడూ మోసే గుణమే
బరువును దించుకోవాలనుకుంటూనే
పెంచుకుంటూ పోతుంటుంది (పుట 212)
- ఏం చెప్పమంటారు, ఈ మోసే గుణంవల్లే మనసుకెప్పుడూ ఏదో ఒక గొడవ.
--------------
రత్న పోచిరాజు (చెన్నై) గారు సింగారించిన ముఖచిత్రం బాగుంది.
-------------
ప్రతులకు : 
వెన్నెలగంటి విజయ శ్రీనివాసమూర్తి
ఫోన్ నెంబర్ : 9959839446
ధర : రూ. 150.
-----------
కామెంట్‌లు