తల్లి ప్రేమ;- మెండె యమున---పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతగూడెం, అనుముల మండలం, నల్గొండ జిల్లా.
 లింగోటం గ్రామంలో మమత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ల తల్లిదండ్రులు చదివించకుండా పెళ్లి చేశారు. మమత తన భర్త మహేష్ తో కలిసి నల్లగొండలో జీవిస్తున్నది. మమతకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పెళ్లి అయి రెండు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు కలగలేదు. అనేక ఆసుపత్రులకు తిరిగారు. ఎందరో దేవతలకు మొక్కారు. ఫలితం లేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఎంతో ప్రేమగా చూసుకునే మహేష్ కూడా సంతానం కలగడం లేదు అన్న కారణంచేత  మమతను కోపగించుకుంటున్నాడు . మమత ఒకరోజు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ' నాన్న నన్ను ఆ రోజు బాగా చదివితే ఈ రోజు ఇన్ని బాధలు ఉండేవి కాదు కదా ' అని దుఃఖించింది. తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. మమత గర్భవతి అయింది. అందరూ చాలా సంతోషించారు. మహేష్ ఆనందానికి అవధులు లేవు. భార్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తొమ్మిది నెలలు గడిచాయి. మమత ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది.
 పరీక్షించిన డాక్టర్లు ' ఆపరేషన్ చేసిన తర్వాత తల్లి లేదా బిడ్డ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే బతుకుతారు ' అని తేల్చి చెప్పారు. అప్పుడు మహేష్ మిక్కిలి దుఃఖంతో మమతనే బతికించండి అని బ్రతిమిలాడాడు. మమత తల్లిదండ్రులు కూడా తమ బిడ్డనే బతికించమని కోరారు. మమత మాత్రం నా బిడ్డనే బతికించండి. నేను ఇన్ని రోజుల నుండి ఈ మధురమైన క్షణాల కోసం ఎదురు చూశాను. నా కళ్ళముందు నా బిడ్డ చనిపోతే నేను ఎలాగూ బతకను. కాబట్టి నా బిడ్డను బతికించండి అని చేతులు జోడించి వేడుకుంటూ డాక్టర్లను అడిగింది. మమత చెప్పినట్లుగానే డాక్టర్లు బిడ్డను బతికించారు. బిడ్డను చూసిన కొద్ది క్షణాల్లోనే మమత చిరునవ్వుతో కన్నుమూసింది. అక్కడి వారందరూ ఈ దీనస్థితిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.  బిడ్డ కోసం ప్రాణాలు విడిచిన తల్లి ప్రేమను ఎంతగానో కీర్తించారు.
( ఇటీవల తన బిడ్డను బతికించడం కోసం ప్రాణాలు విడిచిన తల్లి గురించి వచ్చిన వార్తాకథనాన్ని చూసి రాసిన కథ )
                  

కామెంట్‌లు