అమ్మా నీకేమివ్వగలను?;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వంటిలో పాలులేక
పిల్లవాడి ఆకలి తీర్చలేక
పిండిపాలు కొనలేక
బాధపడుతున్న తల్లీ
నీకేమివ్వగలను?

ఇల్లును పోషించటానికి
పిల్లల బ్రతికించటానికి
అందముగా తయారయి
వళ్ళును అమ్ముకొనుచున్న వనితా
నీకేమివ్వగలను?

భర్తమాటల భరిస్తూ
వంటికితగిలే దెబ్బలు ఓర్చుకుంటు
మనసుకుతగిలే గాయాలను తట్టుకొనుచు
జీవితాన్ని నెట్టకొస్తున్న మాతా
నీకేమివ్వగలను?

అత్తామామల దాష్టికాన్ని సహిస్తూ
ఆడపడుచుల పెత్తనాన్ని ఒప్పుకొనుచు
రాత్రింబవళ్ళు కష్టాలుపడుతు
కుటుంభారాన్నిమోస్తున్న జననీ
నీకేమివ్వగలను?

ఎదురింటివారి వెర్రివేషాలను ఓర్చుకుంటు
ప్రక్కింటివారి పిచ్చిప్రేలాపలను వింటు
బజారుకెళ్ళినపుడు కుర్రవాళ్ళ కొంటిచూపుల భరిస్తు
జీవితాన్ని లాగుకొస్తున్న తల్లీ
నీకేమిచేయగలను?

కవితలోని ప్రతి అక్షరం
భావము తెలుపుతున్న ప్రతిపదం
అర్ధాన్నిస్తున్న ప్రతిపాదం
సందేశమిస్తున్న ప్రతిచరణం
ప్రతి ఒక్కటి నిన్నే తలుస్తుంది
ఇంతకంటె నాదగ్గరేమున్నది మాతా?
ఇంకేమి నీకు ఇవ్వగలను తల్లీ?


కామెంట్‌లు