భారతియార్ పాటలు;-- యామిజాల జగదీశ్
 ఎవిఎం సంస్థ మంచి సినిమాలకు, బుల్లితెర సీరియళ్ళకు పెట్టిందిపేరు. ఈ సంస్థకు  చిత్రీకరణ కోసం ఒక స్టూడియో ఉంది. ఇదంతా పక్కనపెడితే ఈ సంస్థ తమిళ జాతీయ కవి, దేశభక్తుడు సుబ్రమణ్య భారతియార్ పాటలను ప్రభుత్వపరం చేసిన వ్యవహారం తమిళ రచయిత, దర్శకుడు భారతీ కృష్ణకుమార్ వల్ల  ఈమధ్యే తెలుసుకున్నాను.
అప్పట్లో చెన్నైలోని rattan bazar రతన్ బజార్ లో ఓ గ్రామఫోన్‌ రికార్డు కంపెనీ ఉండేది. ఈ సంస్థ నుంచి భారతియార్ పాటల కాపీరైట్‌ను ఎవిఎం సంస్థ పది వేల రూపాయలకు కొనుగోలు చేసింది.  ఎవిఎం సంస్థ అప్పట్లో నామ్ ఇరువర్ అనే సినిమాలో భారతియార్ పాటలు వాడుకోవడంకోసం అంత డబ్బిచ్చింది. ఈ సినిమా 1947 జనవరి 12న విడుదలైంది. విజయవంతమైన ఈ సినిమాలో డి.కె. పట్టమ్మాళ్ భారతియార్ పాటను పాడారు. మెయ్యప్ప చెట్టియార్ దర్శకత్వంలో ఎవిఎం బ్యానర్లో విడుదలైన ఈ సినిమాలో  టి.ఆర్. మహాలింగం, కె. సారంగపాణి, జయలక్ష్మి తదితరులు నటించారు. ఆర్. సుదర్శనం సంగీతం సమకూర్చారు.
ఈ సంస్థకు సంక్రమించిన హక్కులతో అప్పట్లో భారతియార్ పాటలను మరెవ్వరూ వాడుకోవడానికి వీలులేకుండా పోయింది. అయినప్పటికీ భారతియార్ వీరాభిమాని అయిన కవి త్రిలోక సీతారాం  ఎవిఎం సంస్థ కాపీరైట్ వ్యవహారాన్ని అతిక్రమించి చెన్నై వీధులలో భారతియార్ పాటలను పాడుతూ సంచరించేవారు. సీతారాం మాతృభాష తెలుగు. కానీ ఆయన పుట్టిపెరిగిన నేపథ్యం తమిళమవడంతోనూ, తమిళ భాషపై ఉన్న మక్కువతోనూ తమిళంలో రచనలు చేశారు. భారతియార్ పాటలను పాడి జనబాహుళ్యంలోకి తీసుకువచ్చారు.
ఆయన భారతియార్ పాటలు పాడుతుండటం గమనించిన తమిళనాడు ప్రభుత్వం పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి మెయ్యప్ప చెట్టియారుతో సంప్రతింపులు జరిపింది. ఆయన ఎంత డబ్బు అడిగితే అంత డబ్బూ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. చివరకు, ఎవిఎం సంస్థ ఈ పాటల హక్కులను ప్రభుత్వ పరం చేయడమే కాకుండా  ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకపోవడం గమనార్హం.

కామెంట్‌లు