ఆగిన విద్యా కలం;-- యామిజాల జగదీశ్
 నాకు 
కలం మిత్రుడై
కవితల మిత్రుడై
ప్రత్యక్ష మిత్రుడై
సన్నిహిత మిత్రుడై 
ఎప్పుడెక్కడ ఎదురుపడ్డా
బాగున్నావా జగ్గడూ అని 
ఆప్యాయంగా పలకరించే "విద్యారణ్య" 
"పోయాడు" అన్న నమ్మలేని నిజాన్ని  
నాకు చెప్పారు కోగంటి జమునా రాణిగారు!
నేను జమునారాణి మాట్లాడుతున్నానంటూ నిన్న సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో ఫోన్ ద్వారా చెప్పారీ చేదునిజాన్ని. మీకొచ్చిన మెసేజ్ నాకు పంపండని అడిగితే మూడింటిని పంపారు. గుండెపోటుతో సౌమ్యుడైన విద్యారణ్య దూరమయ్యాడన్న విషయాన్ని చెప్పాయి ఆ మెసేజస్.
జననంతోనే వెంట వచ్చే మరణం తన పనితనం ఎప్పుడు చూపిస్తుందన్నది తుది శ్వాస విడిచేవరకూ సస్పెన్సే! అంత రహస్యంగా ప్రతి మనిషితోనూ నడుస్తూ నడుస్తూ వచ్చే మృత్యువు ఇద్దరి మధ్య బంధానికి ఆకస్మికంగా తెర దింపుతుంది. దీంతో అప్పటిదాకా మాటలు పంచిన ఓ మనసు ఉన్నట్టుండి మౌనంలోకి వెళ్ళిపోవడం అనేది మూగవేదనే! విద్యారణ్యతో నా పరిచయం నాలుగు దశాబ్దాలపైనే....!! ఎన్నడూ హెచ్చుతగ్గులు లేని మాటల ముచ్చట్లే మా మధ్య! 
అమ్మ
ఒడి నుంచి
జా
రా
ను....
అనే కవితతోనే మా పరిచయానికి బీజం వేశాడు విద్యా. అతని పేరు విద్యారణ్య కామ్లేకర్ అయినా నేను అతనిని పిలిచేది విద్యా అనే. నన్నతను జగ్గడూ అనే పలకరించేవాడు.
మనకు పెద్దవాళ్ళు పెట్టే పేరెలా ఉన్నా సాన్నిహిత్యంతో పిలుచుకునే పేర్లతోనే పరస్పరం పిలుచుకునేటప్పుడు పొందే ఆనందం వేరు. నాకు 1981 ప్రాంతంలో కవితలతో కలంస్నేహితుడై ఎనభై రెండు ఆగస్టులో ప్రత్యక్ష మిత్రుడయ్యాడు లకడీకాపూల్ లోని హిందుస్థాన్ సమాచార్ కార్యాలయంలో..... రాజీవగారు, విద్యారణ్య సహోద్యోగులక్కడ. రాజీవగారి కోసం వెళ్ళినప్పుడు. కలసిన ఆ క్షణంలోనూ ఏదో కవిత చెప్పాడు. ఎనభై మూడులో రేణుకతో నా పెళ్ళయ్యాక మేం రాంనగర్లో అద్దెకుంటున్న ఒక్క గది ఇంటికొచ్చినప్పుడు అమెరికన్ సాహిత్యం (తెలుగు పుస్తకం) మాకు కానుకగా ఇస్తూ మొదటి పేజీలో "జగద్రేణు" కి అని సంతకం చేసిచ్చాడు. విద్యారణ్య పెట్టిన ఈ కొత్త పేరు ఎంతగానో నచ్చి నేను కలంపేరుగా చేసుకుని కొన్ని రచనలుకూడా చేశాను. 
ఇద్దరం కలిసి పని చేయని పాత్రికేయులం. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, హిందీ మిలాప్, 
ఓ మరాఠీ పత్రికకు పని చేసిన విద్యారణ్యను ఇటీవల అనుకోకుండా కలిసింది ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శన ఆవరణలో. అప్పుడప్పుడూ వాట్సప్ మెసేజస్ తో పలకరించుకునే మేము ప్రత్యక్షంగా కలుసుకున్న పుస్తకప్రదర్శనలో ఫోటోలు తీసుకున్నాం. ఓ ఇరవై నిముషాలపైనే మాట్లాడుకున్నాం. దేవులపల్లి అమర్ ని కలిసాం. వారిద్దరికీ ఫోటోలు తీశాను. అదేరోజు నాగసూరి వేణుగోపాల్ గారిని కలిసాం. మళ్ళీ ఫోటోలు. కొన్ని జ్ఞాపకాలతో మా మాటలు. వీడ్కోలు. 
అనంతరం క్రమం తప్పక వాళ్ళబ్బాయ్ ఉదయ్ తిరుప్పావై పాశురాలకు వేస్తున్న బొమ్మలు పంపించేవాడు ఈరోజు మా అబ్బాయి వేసిన బొమ్మంటూ. ఉదయ్ చాలా బాగా వేస్తాడు బొమ్మలు. వాడి చిత్రకళ గురించి రాద్దామనుకున్న విషయం రాయకుండానే ఉండిపోయింది. ఓరోజు ఫోన్ చేసొస్తాను అన్న మాట అట్టాగే ఉండిపోయింది. ఆపై కలవనే లేదు ఇద్దరం. 
కొన్ని నెలల క్రితం విద్యారణ్య గురించి రాయడం కోసం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు (సాహితీవేత్త హీరాలాల్ గారు) పేరిట ప్రతి ఏటా ఇస్తున్న పురస్కారాలు, ఓమారు వరదలకు ఊళ్ళో వేలాది పుస్తకాలు కొట్టుకుపోవడం, వాడి కవితా ప్రస్థానం, లేఖా సాహిత్యం వంటివి చర్చకొచ్చాయి. తను చెప్పిన విషయాలతో ఓ ముచ్చటంటూ రాశాను. అందులో అమ్మ ఒడి నుంచి జారాను" అనే వాడి కవితకూడా ప్రస్తావించగా అర్జంటుగా ఈ కవిత అందులో తొలగించవా జగ్గడూ...కలిసినప్పుడు దాని గురించి చెప్తానన్నాడు. అది నువ్వు రాసిందేగా అంటే అది రాసుకున్న సందర్భం వేరులే అంటూ మాట దాటేశాడు. 
మా ఇద్దరి మధ్య మాటలెప్పుడూ పుస్తకాలూ రచనల గురించే. అలాగే భీమ్లీలో నేను మానసికంగా నమస్కరించుకునే గుడిపాటి వేంకటచలంగారి కుమార్తె షౌ గారిని భీమ్లీలో కలిసి తాను తీసుకున్న ఫోటో పంపుతూ ఎంత ఆనందపడ్డాడో. 
ఫేస్ బుక్ లో నా పోస్టులు ఫాలో అయ్యేవాడు. ఇంకా రాయాలంటూ ప్రోత్సహించిన ఆత్మీయ మిత్రుడు విద్యారణ్య  మరణం ఓ రణమే!!


కామెంట్‌లు